Movies

ద్రౌపదితో కొత్త లోకంలోకి తీసుకువెళ్తా

ద్రౌపదితో కొత్త లోకంలోకి తీసుకువెళ్తా

హిందీ చిత్రసీమలో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతోంది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్‌. సాంఘిక చిత్రాలతో పాటు ‘రామ్‌లీలా’ ‘పద్మావత్‌’ ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి చారిత్రక కథాంశాల ద్వారా అద్భుత ప్రతిభావంతురాలిగా గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో పౌరాణిక ఇతివృత్తాలతో రూపొందుతున్న ‘రామాయణ్‌’ ‘ద్రౌపది’ చిత్రాల్లో నటిస్తోంది. ‘ద్రౌపది’ సినిమాలో టైటిల్‌ పాత్రలో కనిపించనుంది. తన కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోయే పాత్ర అవుతుందని దీపికాపడుకోన్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘భారతీయ సాంఘిక జీవనంపై మహాభారత ఇతిహాసం గొప్ప ప్రభావాన్ని చూపించింది. ఆ మహాకావ్యంలోని ప్రతి కథలో జీవిత సత్యాలు దాగి ఉంటాయి. అయితే ఇప్పటివరకు మహాభారత కథల్ని పురుషుల దృక్కోణం నుంచే చూశాం. ‘ద్రౌపది’ చిత్రం అందుకు భిన్నంగా మహిళా కోణం నుంచి సాగుతుంది. ద్రౌపది తాలూకు తెలియని పార్శాల్ని ఈ సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాం. ఇంతకు ముందెప్పుడూ చూడని కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే చిత్రమిది’ అని దీపికాపడుకోన్‌ పేర్కొంది. మధు మంతెన నిర్మిస్తున్న ఈ సినిమాకు దీపికా సహనిర్మాతగా వ్యవహరిస్తోంది. కథలోని భావోద్వేగాలు, తన పాత్ర తాలూకు గాఢత నచ్చి చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా చేరానని దీపికాపడుకోన్‌ చెప్పింది. వచ్చే ఏడాది ‘ద్రౌపది’ సెట్స్‌మీదకు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.