NRI-NRT

భారతీయ విద్యార్థులకు వీసా కష్టాలు

భారతీయ విద్యార్థులకు వీసా కష్టాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న విలయం విదేశీ విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే వారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కొవిడ్‌ ఉద్ధృతి సమయంలో అమెరికాలో చదువుతున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు రాగా.. తాజాగా అక్కడ కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వీరికితోడు ఈ ఏడాది కొత్తగా అడ్మిషన్‌ తీసుకోవాలనుకునే వారికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వీసా జారీ ఆలస్యం కావడంతో పాటు, అమెరికా వెళ్లేందుకు విమాన సర్వీసులు తక్కువగా ఉండడం వారిని వేధిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్, చైనా విద్యార్థులు ఛార్టర్‌ ఫ్లైట్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.

అమెరికాలో ఉన్నతవిద్య కోసం ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10లక్షల మంది విదేశీ విద్యార్థులు వెళ్తుంటారు. వీరిలో చైనా, భారత్‌ల నుంచే అధికంగా ఉంటారు. ప్రస్తుతం అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ప్రారంభం కావడంతో విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారత విద్యార్థులకు వీసా జారీలో తీవ్ర ఆలస్యం అవుతోంది. ఇక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో అమెరికా సిబ్బంది తక్కువగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. కరోనా విజృంభిస్తోన్న వేళ కాన్సులేట్‌ సిబ్బంది అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం భారత విద్యార్థులు వేచిచూడాల్సి వస్తోంది. అంతేకాదు వీసా రాకముందే అమెరికా ప్రయాణానికి ముందస్తుగా విమాన టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఇది మరింత కష్టంగా మారింది. వీటితోపాటు ఆయా దేశాల్లో అనుసరిస్తోన్న వ్యాక్సిన్‌ విధానం కూడా విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థులకు సమస్యగా మారింది.

వీసా జారీలో ఇబ్బందులు ఇలా ఉంటే, మరోవైపు ఇప్పటికే అక్కడ అడ్మిషన్‌ పొందిన విద్యార్థులతో పాటు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన పూర్వ విద్యార్థులు తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా అమెరికాకు విమాన సర్వీసులు భారీగా తగ్గిపోవడమే ఇందుకు కారణం. చైనా నుంచి 2019 జులైలో దాదాపు 1626 విమాన సర్వీసులు (4లక్షల 79వేల సామర్థ్యం) నడవగా.. ఈ ఏడాది కేవలం 61 విమాన సర్వీసులు(20వేల సీట్లు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారత్‌లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే దాదాపు 5రెట్లు ఎక్కువగా ప్రయాణ ఛార్జీ చెల్లించాల్సి వస్తోందని చైనా, భారత్‌ విద్యార్థులు వాపోతున్నారు. వీటిని భరించేందుకు సిద్ధమైనప్పటికీ ప్రయాణ సమయానికి విమాన సర్వీసులు రద్దు అవుతుండడం మరో సమస్యగా మారింది. దీంతో ఛార్టర్‌ ఫ్లైట్‌లను ఆశ్రయిస్తున్నట్లు చైనీస్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో భారత విద్యార్థులు కూడా ఛార్టర్‌ విమానాలవైపు మొగ్గుచూపుతున్నారు.

అమెరికాలో చదువులపై అంతర్జాతీయంగా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఇలా లక్షల మంది అక్కడ చదువుకోవడం వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతిఏటా వేల కోట్ల రూపాయలు (దాదాపు 38బిలియన్‌ డాలర్లు) ఆదాయంగా వస్తోంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నారని న్యూయార్క్‌లోని కార్నెల్‌ యూనివర్సిటీలోని అంతర్జాతీయ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న ప్రొఫెసర్‌ వెండీ వోల్ఫోర్డ్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.