Movies

ఓ విచిత్రమైన సినిమాలో రెజీనా

ఓ విచిత్రమైన సినిమాలో రెజీనా

రెజీనా ప్రధాన పాత్రలో తెలుగులో ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. అగస్త్య, నివేదా సతీష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ ‘‘ఓ లేడీ రైటర్‌ రాసిన కథతో ఓ దర్శకురాల్ని తెరకు పరిచయం చేస్తూ.. ఈ సిరీస్‌ రూపొందిస్తున్నారని తెలిశాక నాలో ఆసక్తి పెరిగింది. కథ విన్నాక.. నేనిది తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఓ హారర్‌ కథకు రియాలిస్టిక్‌ ఎమోషన్స్‌ జోడిస్తూ.. స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం నాకెంతో నచ్చింది. నేనిప్పటి వరకు చేయని విభిన్నమైన పాత్రను ఇందులో పోషిస్తున్నా. నివేదితా నాకు సోదరిగా కనిపిస్తుంది. మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ.. ఆహా, ఆర్కా వాళ్లు ఈ సిరీస్‌ నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఓ విచిత్రమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో.. ప్రతిభావంతులైన మహిళా బృందంతో ఈ సిరీస్‌ చేస్తున్నాం. క్రిస్మస్‌కు ‘ఆహా’లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు శోభు యార్లగడ్డ, అల్లు అరవింద్‌. ఈ కార్యక్రమంలో పల్లవి, సౌమ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.