Business

చెఫ్‌కు ₹746కోట్లు ఇచ్చిన జెఫ్-వాణిజ్యం

చెఫ్‌కు ₹746కోట్లు ఇచ్చిన జెఫ్-వాణిజ్యం

* దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. మరో కీలక ప్రకటన చేశారు. తమ సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సందర్భంగా.. ‘కరేజ్‌ అండ్‌ సివిలిటీ’ అనే అవార్డుని ప్రకటించారు. తొలి అవార్డును ప్రముఖ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌, సామాజిక కార్యకర్త వ్యాన్‌ జోన్స్‌ అనే ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో 100 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 746.02 కోట్లు) ఇవ్వనున్నారు. సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు బెజోస్ తెలిపారు. ఈ అవార్డు ద్వారా వస్తున్న సొమ్మును వారు కావాలంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చని బెజోస్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు. జోస్‌ ఆండ్రెస్‌ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చెఫ్‌. 2010లో ఈయన ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌-డబ్ల్యూసీకే’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రాంతాల్లో భోజనం అందజేస్తున్నారు. కరోనా సంక్షోభంలో అనేక మందికి అండగా నిలిచారు. భారత్‌లో సంజీవ్‌ కపూర్‌ అనే ప్రముఖ చెఫ్‌తో కలిసి 15 ప్రముఖ నగరాల్లో 30 ప్రాంతాల నుంచి ప్రజలకు భోజనం అందజేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆసుపత్రుల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్యారోగ్య సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. రెండు వారాల క్రితం భారత్‌కు వచ్చిన ఆండ్రెస్‌ ఇప్పటివరకు మన దేశంలో 4 లక్షల మీల్స్‌ అందజేసినట్లు వెల్లడించారు.

* ఇండియా యమహా మోటార్‌ తమ ఎఫ్‌జెడ్‌ 25 మోడల్‌లో ‘మాన్‌స్టర్‌ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌’ను మంగళవారం విడుదల చేసింది. దీని ధర రూ.1,36,800 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ నెలాఖరుకు వీటిని భారతీయ వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొస్తామని యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ మోటోఫుమి శితారా వెల్లడించారు.

* అమెరికా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో భారీ డేటా సెంటర్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ప్రముఖ వాణిజ్య పత్రిక ‘బిజినెస్ స్టాండర్డ్‌’ ఓ కథనం ప్రచురించింది.

* గ్లెన్మార్క్‌ లైఫ్‌ ఐపీఓ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27న మొదలయ్యే ఈ ఐపీఓ 29వరకు నడుస్తుంది. ఒక్కో షేరు ధరను ₹695- ₹720గా నిర్ణయించారు. ఈ ఇష్యూతో గ్లెన్మార్క్‌ ₹1513.60 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్లెన్మార్క్ ఫార్మా ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ కింద 6.30 మిలియ‌న్ షేర్లను ఉంచుతోంది. గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ క్రియాశీల ఔష‌ధ ప‌దార్ధాల (ఏపీఐ) త‌యారీ వ్యాపారంలో ఉంది. దీని పోర్ట్‌ఫోలియోలో 120 ఉత్ప‌త్తులున్నాయి.