Business

బజాజ్ చేతక్ విద్యుత్తు స్కూటర్ రెడీ-వాణిజ్యం

బజాజ్ చేతక్ విద్యుత్తు స్కూటర్ రెడీ-వాణిజ్యం

* బజాజ్ చేతక్ విద్యుత్తు స్కూటర్… మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ లలో రేపటి(గురువారం) నుంచి అందుబాటులోనికి రానుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు… గురువారం నుంచి రూ. 2 వేలు చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. కాగా… 2022 నాటికి 24 నగరాల్లో బజాజ్ చేతక్ విద్యుత్తు స్కూటర్‌ను విడుదల చేసేందుకు బజాజ్ ఆటో కసరత్తు చేస్తోంది. మునుపటి ఐసీఈ మోడల్ స్కూటర్‌‌ను తయారు చేసిన దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత 2020 లో చేతక్ బ్రాండ్ సంస్థ విద్యుత్తు వాహనంగా మళ్ళీ వస్తోంది. పూణేలోని చకన్ ప్లాంట్లో ఈ విద్యుత్తు స్కూటర్లు తయారు కానున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 కిలోవాట్ల మోటారుతో నడుస్తుంది. ఇది 5 హెచ్‌పీ శక్తిని మోటారు 3 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో అనుసంధానితమై ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాగా గరిష్ట వేగం 70 కిలోమీటర్లు.ఐదు గంటల వ్యవధిలో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. కాగా… ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ సాయంతో కేవలం ఒక గంటలో 25 శాతం వరకు ఛార్జ్ అయ్యే వెసులుబాటు కూడా ఉంది. ఇక బ్యాటరీ జీవితం 70 వేల కిలోమీటర్లు లేదా ఏడు సంవత్సరాలు.బ్యాటరీపై మూడు సంవత్సరాలులేదా 50 వేల కిలోమీటర్ల వారంటీఉంది.

* ఏటీఎం లావాదేవీలపై బ్యాంకుల ఇంటర్‌చేంజ్‌ ఫీజుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల చేసిన సవరణలు వచ్చే నెల మొదట్నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్థిక లావాదేవీల ఇంటర్‌చేంజ్‌ ఫీజును రూ.15 నుంచి 17కు పెంచగా, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి 6కు పెంచింది. ఈ కొత్త చార్జీలు ఆగస్టు 1 నుంచి వర్తించనున్నాయి. ఆర్బీఐ వివరాల ప్రకారం క్రెడిట్‌ కార్డులు లేదా డెబిట్‌ కార్డుల ద్వారా జరిగే చెల్లింపుల ప్రాసెసింగ్‌ కోసం వ్యాపారుల నుంచి ఈ ఇంటర్‌చేంజ్‌ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తాయి. దేశంలో వివిధ బ్యాంకులు జారీ చేసిన దాదాపు 90 కోట్ల డెబిట్‌ కార్డులుంటాయని అంచనా. తమకు ఖాతాలున్న బ్యాంక్‌ ఏటీఎంల నుంచి నెలకు ఐదుసార్లు కస్టమర్లు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకు కలిపి ఈ పరిమితి వర్తిస్తుంది. ఇక ఇతర బ్యాంక్‌ ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లోనైతే మూడుసార్లు, నాన్‌-మెట్రో నగరాల్లో ఐదుసార్లు ఉచితంగా లావాదేవీలను జరుపవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పరిమితి దాటిన ఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున చార్జీలుండగా, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రూ.21 వసూలు చేయనున్నారు. పెరిగిన నిర్వహణ వ్యయం వల్లే ఈ చార్జీల పెంపునకు అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ఓ తాజా ప్రకటనలో తెలిపింది.

* స్వల్ప, మధ్య స్థాయి కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న వారిపై నిర్వహించిన మోల్నుపిరవిర్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ పదార్థం (ఏపీఐ) ఉత్పత్తికి సంబంధించిన సూత్రీకరణనూ అభివృద్ధి చేస్తున్నట్లు ఆప్టిమస్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ డి శ్రీనివాస్‌ రెడ్డి బుధవారం వెల్లడించారు. మొత్తం 1218 మందిపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహించామని, 353 మందిపై నిర్వహించిన ప్రయోగాలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. చికిత్స 5-28 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. 10, 14 రోజు నాటికి ఈ ఔషధం మంచి పనితీరును చూపించడంతోపాటు, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. చికిత్స వ్యవధిలో, తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు, అనారోగ్యం బారిన పడకుండా ఈ ఔషధం భద్రతనిస్తుందని తెలిపారు. అందువల్ల ఆప్టిమస్‌ ఫార్మా మోల్నుపిరవిర్‌ ఉత్పత్తికి సిద్ధం అవుతోందని వెల్లడించారు. అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐని సంప్రదించినట్లు తెలిపారు.

* భారత స్థిరాస్తి విపణి 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్ల)కు చేరొచ్చని గృహ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా వెల్లడించారు. గిరాకీ పెరగడం, గత ఏడేళ్లలో కొత్తగా తీసుకొచ్చిన రెరా చట్టం వంటి సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో ఉపాధి పొందే వారి సంఖ్య 2019లో 5.5 కోట్లుగా ఉండగా.. రాబోయే సంవత్సరాల్లో 7 కోట్లకు పెరగొచ్చని అంచనా వేశారు. స్థిరాస్తి రంగంపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కిరాయిదారుల చట్టాన్ని త్వరగా అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరినట్లు వెల్లడించారు. కొత్త చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేసినప్పటికీ.. ఇప్పటివరకు అద్దె ఒప్పందాలకు సంబంధించిన అన్ని వివాదాలు రాష్ట్రాల పాత చట్టాలకు లోబడే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 మొదటి, రెండో దశ ఉద్ధృతి వల్ల స్థిరాస్తి రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొందని, అయితే గృహాలకు గిరాకీ మళ్లీ పుంజుకుందని మిశ్రా పేర్కొన్నారు. ‘2-3 ఏళ్లక్రితం కింద దేశీయ స్థిరాస్తి రంగ విపణి విలువ 200 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.15 లక్షల కోట్లు)గా ఉంది. 2030కి ఇది లక్ష కోట్ల డాలర్లకు చేరొచ్చు. వచ్చే 7-8 ఏళ్లలో ఇది సాధ్యపడుతుందని ప్రస్తుత ధోరణులు స్పష్టం చేస్తున్నాయి’ అని అన్నారు.