NRI-NRT

14వసంతాల పున్నమి…టాంటెక్స్ తెలుగు సాహిత్య సదస్సు

TANTEX Telugu Vennela Program Completes 14Years

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెస్క్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెన్నెల 14 వ వార్షికోత్సవ సదస్సు ఆదివారం నాడు అంతర్జాలంలో నిర్వహించారు. ఈ శీర్షికలో 168వ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

మాడ సమన్విత ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. వార్షకోత్సవ సందర్భంగా సంస్థ అద్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి సంస్థ పూర్వ నిర్వాహకులను, వ్వవస్థాపకులను గుర్తు చేస్తూ సాహిత్య సదస్సుల సుదీర్ఘ ప్రస్థానానికి వారందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన తోటకూర ప్రసాద్, వంగూరి చిట్టెన్ రాజు నాటి ప్రారంభ దశ విశేషాలను గుర్తు చేసుకున్నారు.

సాహిత్య కార్యక్రమాలలో భాగంగా విశిష్ట అతిథులు డాక్టర్ ఉపద్రష్ట సత్యం “రసరంజిత సంవాద సాహిత్యం” అంశంపై చర్చ చేశారు. విశిష్ట అతిథి డాక్టర్ శొంఠి శారద “గానాభిజ్ఞత” సంగీత స్వరూపం అనే అంశంపై తాత్విక దృష్టికోణంలో విశ్లేషించారు. పద్య కవి, గాయకులు, కథారచయిత ఫణి డొక్కా “సాహితీ లోకంలో హాస్య గుళికలు” అన్న అంశం పై ప్రసంగించి సభలో నవ్వులు పూయించారు. ముఖ్య అతిథి, భావ, గజల్ కవితల రచయిత్రి, సంగీతజ్ఞులు డాక్టర్ అరవిందా రావు “వెన్నెలతో ఒక మాట” అన్న శీర్షికన చక్కటి విందైన సంగీత లహరిని ప్రసరింపజేశారు. వేణుగాన కళాకారులు డాక్టర్ మంద అనంతకృష్ణ ప్రదర్శన అలరించింది.

సంగీత కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల అందెరచన “మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు”, చిన్నారి మేఘన కుప్పచ్చి త్యాగరాయ కీర్తన “శోభిల్లు సప్తస్వర” ఆలిపించి రంజింపజేశారు. నృత్య ప్రదర్శనలలో భాగంగా వివిధ నృత్య పాఠశాలల విద్యార్థినులు, చిన్నారులు చక్కటి నాట్యాంశాలతో సభాకులను విశేషంగా ఆకట్టుకున్నారు. సభలో ప్రసంగాలపై ప్రత్యేకించి విశిష్ట ముఖ్య అతిథుల ప్రసంగంపై పెద్దలు తమ సహృదయ స్పందనను తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహితీ ప్రియులు హాజరయ్యారు. సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి విశేష ప్రతిభ కనపరచిన శృతిలయ, రాగలీన, నాట్యాంజలి మరియు సాయి నిత్య నృత్య పాఠశాలల విద్యార్థినులకు వారి గురువులకూ ధన్యవాదాలు తెలిపారు. చక్కటి మృదు మధురంగా గీతాలు పాడిన సమన్విత, మేఘనతోపాటు, సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.