Movies

కుంద్రా గురించి సాక్ష్యం చెప్పనున్న ఉద్యోగులు-తాజావార్తలు

కుంద్రా గురించి సాక్ష్యం చెప్పనున్న ఉద్యోగులు-తాజావార్తలు

* అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వివరాల్ని వెల్లడించేందుకు రాజ్‌కుంద్రా సహకరించడం లేదని క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మేజిస్ట్రేట్‌ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబయిలోని రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కార్యాలయంలో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వీరికి ఓ లాకర్‌ లభ్యమైనట్లు తెలుస్తోంది. అందులో పలు వ్యాపార ఒప్పందాలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. క్రైం బ్రాంచ్‌ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాకర్‌ని రహస్యంగా ఉంచారని.. అందుకే గతంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడలేదని సమాచారం.

* సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కరోనా ఆంక్షలు ఉన్నా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచించారు.కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. కాగా ఆలయ పరిసరాల్లో 200 సీసీ కెమెరాల తో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.

* ఫొటోలో కనిపిస్తున్నది గాలిమర. పైగా ఇది నీటిలో తేలుతుంది. వాతావరణం క్షణాల్లో మారే సముద్రపై గాలిమరలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నార్వేకు చెందిన సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. చతురస్రాకారంలో వెయ్యి అడుగుల ఎత్తు ఉండే ఈ నిర్మాణం ద్వారా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఇందులో వందల సంఖ్యలో చిన్న చిన్న ఫ్యాన్లను అమర్చి, డివైడ్‌ అండ్‌ రూల్‌ పద్ధతిని అమలు చేశారు.

* వివేకా హత్య హత్యపై ఆనాడు చంద్రబాబుపై అవాకులు చవాకులుపేలిన వైసీపీనేతలు, ఈరోజున చంద్రబాబుకు క్షమాపణచెప్పాలి. -వర్ల రామయ్య.

* ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు….1వ డివిజన్ వైసిపి అభ్యర్థి ఏకగ్రీవం.2వ డివిజన్ వైసీపి అభ్యర్థి జున్నురి కనక నరసింహ రావు 788 ఓట్ల మెజారిటీతో గెలుపు.3వ డివిజన్ వైసిపి అభ్యర్థిని ఏ క గ్రీవఒ.4వ డివిజన్ వైసిపి అభ్యర్థి డింపుల్ జాబ్ 748 ఓట్ల మెజారిటీతో గెలుపు.5వ డివిజన్ వైసిపి అభ్యర్థి గరికపూడి ఇమ్మన్యూల్ 865 ఓట్ల మెజారిటీతో గెలుపు.6వ డివిజన్ వైసిపి అభ్యర్థి సుంకర చంద్ర శేఖర్ 1753 ఓట్ల మెజారిటీతో గెలుపు.7వ డివిజన్ వైసిపి అభ్యర్థినిపిల్లంగోళ్ళ శ్రీదేవి 822 ఓట్ల మెజారిటీతో గెలుపు.8వ డివిజన్ వైసిపి అభ్యర్థి వంకదారి ప్రవీణ్ కుమార్ 28 ఓట్ల మెజారిటీతో గెలుపు.9వ డివిజన్ వైసిపి అభ్యర్థి సబ్బన శ్రీనివాస్ 534 ఓట్ల మెజారిటీతో గెలుపు.10వ డివిజన్ వైసీపి అభ్యర్థి పైడి భీమేశ్వర రావు 812 ఓట్ల మెజారిటీతో గెలుపు.

* గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్‌ఐ బాలకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఎస్‌ఐ బాలకృష్ణ తనను మోసం చేశారంటూ ఓ మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్పందించిన పోలీసులు ఆ మహిళపై వెంటనే నీళ్లు పోసి పక్కకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఎస్‌ఐని వీఆర్‌కు పిలిచారు. గతంలో గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే మహిళ తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు బాలకృష్ణపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతరం తాడేపల్లికి బదిలీ చేశారు. ఈనెల 23న రాత్రి సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మళ్లీ అదే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలకృష్ణ మోసం చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

* ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డి కలిశారు. అనంతరం చిరాన్‌ పోర్ట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ…తనకు, ప్రేమ్‌సాగర్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రేమ్‌ సాగర్‌రావు సోదర సమానులన్న రేవంత్‌రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం కదంతొక్కనున్నట్టు ప్రకటించారు.

* కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా.. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మితమైన అపురూప కట్టడం రామప్ప ఆలయం. శిల్పి రామప్ప పేరుతో ఈకాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

* దేశంలో అందరూ ఒకరకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో విధంగా ఆలోచిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ఎలాగైనా పరీక్షలు పెట్టి తిరుతామని మొండిపట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తే.. సుప్రీంకోర్టు జోక్యంతో పరీక్షలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు మరో విషమ పరీక్షను ఎదుర్కోబోతున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.

* చరిత్రాత్మక సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర కనులపండువగా జరుగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయ ద్వారాలు తెరుచుకోగా అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసమేతంగా తొలి బోనం అందించారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల సందడితో మహంకాళీ ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బోనాలతో తరలివచ్చి… ఆడపడుచులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది బోనాలు సమర్పించే అవకాశం లేకపోవడంతో ఈ సారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

* కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రెండు కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం తీసుకెళ్తున్న వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన సాహిల్‌ బొర్డియాగా గుర్తించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బంగారు ఆభరణాలు తరలించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు గన్నవరం సీఐ శివాజీ తెలిపారు.