Fashion

ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏమిటి?

ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏమిటి?

ధృతరాష్ట్రుడు అంధుడు కావచ్చు. కానీ అమిత బలశాలి. విపరీతమైన పుత్రప్రేమ. ఆ ప్రేమతో కొడుకులు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికీ, గుడ్డిగా సమర్ధిస్తూంటాడు. భీష్మ ద్రోణ విదురాది పెద్దలు కౌరవులకు ఎన్ని హితవులు బోధించినప్పటికీ, వాటిని వినమని కొడుకులకు సలహా ఇచ్చేవాడే కానీ, కొడుకులు అందుకు అంగీకరించకపోతే కొడుకులనే సమర్ధించేవాడు. ఆ చనువు, గుడ్డిప్రేమను దుర్యోధనాదులు అలుసుగా తీసుకుని సర్వనాశనం అయిపోయారు.

కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు నూరుగురూ పాండవుల చేతుల్లో నిహతులు అయ్యారు. దృతరాష్ట్రుడి సముఖంలో కూర్చుని యుద్ధవిశేషాల గూర్చి సంజయుడు రన్నింగ్ కామెంటరీ ఇచ్చేవాడు. తన కొడుకులు అందరూ తమ్ముడి కొడుకుల చేతుల్లో చావడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. వారిమీద విపరీతమైన కసి, ద్వేషం తో రగిలిపోతాడు. కానీ ఏమీ చెయ్యలేని అశక్తుడు.

యుద్ధానంతరం విజయులై పాండుకుమారులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడు దృతరాష్ట్రుడి మందిరానికి వస్తాడు…యుధిష్టురుడికి పట్టాభిషేకం చెయ్యమని కోరడానికి. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు పాండవులను ఒక వంక దీవిస్తున్నట్లు నటిస్తూనే మరోవంక కడుపుమంటతో రగిలిపోతాడు. తనకు ప్రియాతిప్రియమైన పెద్దకొడుకు దుర్యోధనుడిని సంహరించిన భీమసేనుడిమీద కక్షను కళ్ళతోనే దాచుకుంటూ దీవించడానికి అన్నట్లు భీముడిని కౌగలించుకోబోతుండగా జరగబోయే ఆపదను గ్రహించిన శ్రీకృష్ణుడు భీముడిని పక్కకు తోసి ఆ స్థానంలో ఇనుముతో తయారుచేసిన భీముడి ప్రతిమను నిలబెడతాడు. తాను భీముడినే కౌగలించుకున్నాననే భ్రమతో ఆ ఇనుప భీముడిని నొక్కి నొక్కి పిండి పిండి చేస్తాడు ధృతరాష్ట్రుడు. అంతటి బలశాలి ధృతరాష్ట్రుడు. తరువాత వాస్తవం గ్రహించి శ్రీకృష్ణుడి చీవాట్లతో సిగ్గుతో తలవంచుకుంటాడు.

*

పై కథ ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? ఒకటికాదు రెండు కాదు..పైన చెప్పబడిన కథ అనేక పాఠాలు మనకు బోధిస్తుంది.

దృతరాష్ట్రుడి బలం విషయాన్ని పక్కన పెడితే, పిల్లలను అతి గారాబంతో పెంచకూడదు. వారు చేసే తప్పొప్పులను సరిదిద్దటం పెద్దల బాధ్యత. వారు మంచిపని చేసినపుడు మెచ్చుకోవాలి. తండ్రి పిల్లల ముఖాన్నే మెచ్చుకోరాదు. పిల్లలు తప్పుదోవ పడుతున్నప్పుడు గ్రహించి మందలించాలి. మొక్కై వంగనిది మానై వంగదు అని పెద్దలు చెబుతారు.

ఇక మన బంధువుల్లోనే పైకి మంచితనం నటిస్తూ లోపల మన ఎదుగుదలను ఓర్వలేని వారు ఉంటారు. వారు మనకు ద్రోహం చేసినదాకా అసలు విషయాన్ని గ్రహించలేము. కనుక ఎంత దగ్గరి వారినైనా గుడ్డిగా నమ్మరాదు. వారితో బంధాలు నిలుపుకుంటూనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆస్తులకోసమో, మరొకదానికోసమే సొంత బంధువులే ఒకరినొకరు చంపుకుంటున్న సంఘటనలను అనేకం చూస్తున్నాం.

ఇక శ్రీకృష్ణుడి లాంటి అండదండలు అందించే ఆత్మీయబంధువులు ఎవరికైనా అవసరం. ఫలానావారు మనకు తోడుగా ఉన్నారంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది.

ఇక వయసు పెరిగే కొద్దీ మన బుద్ధి వికసించాలి. వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా బుద్ధి పరిణితి లేకుండా ఇతరులపై కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడం, తనమన భేదం లేకుండా తగాదాలు పెట్టుకోవడం, అపకారం చెయ్యాలని ప్రయత్నించడం మొదలైన దుర్లక్షణాలను దూరంగా పెట్టకపోతే సొంతవారిముందే పరువుపోయి అపకీర్తి పాలు కావలసి వస్తుంది.

బంధువులు, స్నేహితులను దుర్మార్గులు అని తెలిసీ కూడా వారి వలన మోసపోయి చేతులారా కష్టాలు కొని తెచ్చుకున్నా, తెలిసిగాని, తెలియకగాని నమ్మినవారి చేతిలో మోసపోయినా, ముక్కుముఖం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్నట్లు లెక్క.