Business

చౌకగా ఆకాశ ఎయిర్‌లైన్స్-వాణిజ్యం

* షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ రూ.వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్‌ బుల్‌, ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరొందిన రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి దిగబోతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆయన విమానయాన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరో 15 రోజుల్లో విమానయాన శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రానున్న నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న విమానాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం తన తరఫున ప్రస్తుతానికి 35 మిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.260.25 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. సంస్థలో తనకు 40 శాతం వాటాలుండే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విస్తృత అనుభవం ఉన్న ప్రముఖులు తన భాగస్వాములుగా ఉండనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్‌, దేశీయ కంపెనీ ఇండిగోలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు తనతో కలిసి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో విమనయాన రంగానికి భారీ డిమాండ్‌ ఉండనున్నట్లు అంచనా వేశారు. ‘ఆకాశ ఎయిర్‌లైన్స్‌’గా పిలవబోయే తమ కంపెనీ.. ప్రయాణికులకు అత్యంత చౌకగా విమాన సేవలు అందించనుందన్నారు.

* ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్‌ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం వెల్లడించారు. తాజా సవరణలతో డీఐసీజీఐ ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని అన్నారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై రూ. 5లక్షల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని తెలిపారు.

* వచ్చే వారం నుంచి ప్యాసెంజర్‌ వాహనాల ధరలు పెంచేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. స్టీల్‌ సహా పలాడియం, రోడియం వంటి ఇతర లోహాల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో ఏడాది వ్యవధిలో తమ ఆదాయంపై 8-8.5 శాతం ప్రభావం ఉన్నట్లు సంస్థ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. అయినప్పటికీ.. ఆ భారాన్ని వినియోగదారులకు స్వల్ప స్థాయిలోనే బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయే మోడల్‌పై ఎంత మేర ధరలు పెంచాలన్న దానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు.

* ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి పలు ప్రభుత్వాలు భారీగా రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఫేమ్‌-2 విధానానికి సవరణ చేసిన తరువాత పలు రాష్ట్రాలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలపై భారీగా సబ్సీడిలను అందిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు మెరుగుపర్చడం కోసం వ్యక్తిగత రాయితీలను ప్రకటించింది. జాయ్‌ ఈ-బైక్‌పై సబ్సిడీ కార్యక్రమానికి గుజరాత్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజేన్సీ (జీఈడీఏ) ఆమోదం తెలిపింది.