Health

తెలంగాణాకు వచ్చేసిన డెల్టా వేరియంట్-తాజావార్తలు

తెలంగాణాకు వచ్చేసిన డెల్టా వేరియంట్-తాజావార్తలు

* ప్ర‌పంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta variant ) క‌రోనా వైర‌స్ ద‌డ పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వైర‌స్ వేరియంట్‌.. చికెన్ పాక్స్(chickenpox) క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న సంకేతాల‌ను అమెరికా వినిపించింది. అగ్ర‌రాజ్యానికి చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) ఈ విష‌యాన్ని తెలిపింది. క‌రోనా వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌రీతిలో విస్త‌రిస్తోంద‌ని, వ్యాక్సిన్ల ర‌క్ష‌ణ వ‌ల‌యాన్ని కూడా అది చేధించ‌గ‌ల‌ద‌ని, దాని ద్వారా మ‌రింత విధ్వంస‌క‌ర‌మైన వ్యాధి సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు సీడీసీ చెప్పింది.

* టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత సిరిసిల్ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి… పెద్దూర్ అప‌రెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప‌థంలోకి తీసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. పెద్దూర్ అప‌రెల్ పార్కులో గోక‌ల్‌దాస్ ఇమెజేస్ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గోకుల్‌దాస్ ఎండీ సుమీర్ హిందూజాతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

* దళిత బంధు పథకం ఆగే ప్రసక్తే లేదని.. ఆరునూరైనా 100 శాతం అమలుచేసి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్పష్టం చేశారు. దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు అని, మహాయజ్ఞంలా దళితబంధును చేపట్టినట్లు సీఎం తెలిపారు. దళితుల అభివృద్ధికి లక్ష కోైట్లెనా ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల దళిత బంధు ఏడాది ఆలస్యమైందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పెద్దిరెడ్డిని పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం చాలా సంతోషం అన్నారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడని, ఇరువురం కలిసి ఒకేసారి మంత్రులుగా పనిచేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.

* ప్రజా దీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. పాదయాత్రలో భాగంగ 12వ రోజు ఈటల హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక వద్ద ఈటల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండటంతో పాదయాత్రను కొండపాకలో నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధరించారు. బీపీ90/60, షుగర్‌ లెవెల్‌ 265గా నమోదైంది. ఆక్సిజన్‌ లెవెల్స్‌ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటలను హైదరాబాద్‌ తరలించారు. ప్రస్తుతం ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్‌ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈటల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

* విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీని ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కొండ్లు మరీదయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్‌ పేరుతో అక్రమాలు జరిగాయని ఎన్జీటీ నిర్ధరణకు వచ్చింది.

* తెలంగాణలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా 70 డెల్టాప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు కేంద్ర శాస్త్ర సాంకేతిశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.

* 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద జరిగిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో బండి సంజయ్‌ మాట్లాడారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

* కొండపల్లి ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పది మంది పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు రేపు ఉదయం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించనున్నారు.

* దేశంలో క‌రోనా విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం సౌక‌ర్యాన్ని క‌ల్పించిన విష‌యం తెలిసిందే. క‌రోనా పూర్తిగా త‌గ్గేవ‌ర‌కు వారు ఇంటి నుంచే ప‌ని చేసుకోవచ్చ‌ని ఆయా సంస్థ‌లు ప‌లుసార్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌ట్లో పూర్తి స్థాయిలో కార్యాల‌యాల‌ను తెర‌వ‌డానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల ర‌క్ష‌ణే త‌మకు ముఖ్య‌మని అంటున్నాయి. అయితే, వ‌ర్క్ ఫ్రం హోం వ‌ద్ద‌ని, ఉద్యోగుల‌ను క్ర‌మంగా కార్యాల‌యాల‌కు పిలిపించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ ఆయా కంపెనీల‌ను కోరారు. తాజాగా, ఆయా కంపెనీల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు ప‌ని చేసేలా చూస్తున్నామ‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలిసింది. ఐటీ కంపెనీల‌న్నీ 100 శాతం మంది ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసేలా చూడాల‌ని ఈ సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కారు సూచించింది. ఈ మేర‌కు సెప్టెంబ‌రు 1 నుంచే కార్యాల‌యాల‌ నుంచే ఉద్యోగుల‌తో ప‌నులు చేయించేలా చూడాల‌ని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థ‌లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరింది. అయితే, ప్ర‌భుత్వ సూచ‌న ప‌ట్ల ప‌లు ఐటీ సంస్థ‌లు విముఖ‌త వ్య‌క్తం చేశాయి. వ‌ర్క్‌-ఫ్రం-హోం వ‌ల్ల త‌మ ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తున్నార‌ని చెప్పాయి.

* మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో పెద్దిరెడ్డికి గులాబీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపై సీఎం కేసీఆర్‌ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో గతంలో తామిద్దరం కలిసి పని చేసినట్లు సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. పెద్దిరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.