Business

భారీగా పెరిగిన మొబైల్ రీఛార్జీ టారిఫ్-వాణిజ్యం

భారీగా పెరిగిన మొబైల్ రీఛార్జీ టారిఫ్-వాణిజ్యం

* దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్‌ రీచార్జ్‌ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్‌ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్‌టెల్‌ తన యూజర్ల కోసం బేసిక్‌ స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ ప్లాన్‌ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్‌ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు.

* భారత్‌కు చెందిన అతిపెద్ద అంకుర సంస్థ ఓయోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులతో ఓయో మార్కెట్‌ విలువ 9 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. ఓయో పబ్లిష్‌ ఇష్యూకు వచ్చేందుకు యోచిస్తున్నట్లు ఇటీవలే సంస్థ సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోపే మైక్రోసాఫ్ట్‌ పెట్టబడుల ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ప్రారంభమైన ఓయోలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 46 శాతం వాటాలున్నాయి. హోటళ్ల అగ్రిగేటర్‌గా ఉన్న ఈ సంస్థ కరోనా మూలంగా గత కొంత కాలంగా నష్టాల్లో నడుస్తోంది.

* దేశీయ ఫార్మా రంగ దిగ్గజం సన్‌ఫార్మా జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.1,444.17 కోట్ల లాభాలను ప్రకటించింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.1,655 కోట్ల నష్టాలను చవిచూసిన సంస్థ.. ఈసారి పుంజుకుంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా ఈ ఏడాది రూ.9,718.74 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7,585 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు ఈరోజు దాదాపు 9 శాతం మేర పుంజుకోవడం విశేషం.

* ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్‌ డిమాండ్‌ 19.2 శాతం పెరిగి 76.1 టన్నులుగా నమోదైంది. గతేడాది ఇదే వ్యవధిలో 63.8 టన్నులుగానే ఉన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో నిరుడు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో ఉండటం, వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే సాగడంతో నాటితో పోల్చితే నేడు కనిపిస్తున్న వృద్ధికి పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. నిజానికి ఈ ఏప్రిల్‌-జూన్‌లో అక్షయ తృతీయ, పెండ్లిండ్ల సీజన్‌లోనూ బంగారానికి డిమాండ్‌ ఆశించిన స్థాయిలో లేదని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ పీటీఐకి తెలిపారు. ఈ క్రమంలోనే రాబోయే ధనత్రయోదశి, పండుగల సీజన్‌పైనే ఆశలన్నీ అని అభిప్రాయపడ్డారు. కాగా, గతేడాదితో చూస్తే ఈసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ లేకపోవడం, ఆంక్షలతోనైనా వ్యాపారాలు నడువడం కాస్త ఊరటనిచ్చే అంశంగా డబ్ల్యూజీసీ పేర్కొన్నది. ఇక డబ్ల్యూజీసీ ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ2-2021’ నివేదిక ప్రకారం విలువ ఆధారంగా గత ఏప్రిల్‌-జూన్‌తో చూస్తే ఈసారి డిమాండ్‌ 23 శాతం పెరిగినట్లు కనిపిస్తున్నది. రూ.26,600 కోట్ల నుంచి రూ.32,810 కోట్లకు పెరిగింది. ఈసారి దేశంలో నగల డిమాండ్‌ 25% పెరిగి 55.1 టన్నులుగా నమోదైంది. విలువ ప్రకారం 29 శాతం పుంజుకుని రూ.23,750 కోట్లకు చేరింది.

* సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల కంపెనీల్లో భారీ రిక్రూట్‌మెంట్లు జరగడం, ఆ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు సంకే తం. కానీ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఇందుకు వైవిధ్యమైన సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ కంపెనీ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలివెళ్లడంతో శరవేగంగా నియమకాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యోగుల వలసల్ని పూరించేందుకు కంపెనీ ఈ ఏడాది 1,00,000 మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు గురువారం కాగ్నిజెంట్‌ ప్రకటించింది. 2021లో అనుభవం కలిగిన నిపుణులతో పాటు 30,000 మంది ప్రెషర్స్‌ను తీసకుంటామని, 2022లో 45,000 మంది కొత్త గ్రాడ్యుయేట్స్‌ను చేర్చుకుంటామని కాగ్నిజెంట్‌ సీఈవో బ్రియాన్‌ హాంప్‌షైర్స్‌ చెప్పారు. జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్ని వెల్లడించిన సందర్భంగా అనలిస్టులతో మాట్లాడుతూ ఉద్యోగుల వలస తమకు ప్రధాన ఆందోళనగా ఉందని చెప్పారు. ఈ జూన్‌ క్వార్టర్లో కంపెనీ నుంచి వలసలు రికార్డుస్థాయిలో 31 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మేర ఉద్యోగులు ఉండగా, ఇండియాలో 2 లక్షల మంది పనిచేస్తున్నారు. వలసలు తగ్గించడానికి జీతాల పెంపు, ప్రమోషన్లు, నైపుణాల్ని పెంపొందించడం, జాబ్‌ రొటేషన్లు, రిటెంన్షన్‌ డాలర్లు వంటి పలు చర్యల్ని చేపట్టామని హాంప్‌షైర్స్‌ తెలిపారు.