ScienceAndTech

వాట్సాప్‌పై రష్యా కేసు-తాజావార్తలు

వాట్సాప్‌పై రష్యా కేసు-తాజావార్తలు

* వాట్సాప్‌పై రష్యా కన్నెర్రజేసింది. తమ దేశ పర్సనల్‌ డాటా చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై వాట్సప్‌ సంస్థపై రష్యాలో కేసు (Russia opens case against WhatsApp) నమోదైంది. వ్యక్తిగత డాటా చట్టాన్ని ఉల్లంఘించిన నేరారోపణపై ఇటీవలనే గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్‌ కంపెనీకి రష్యా కోర్టు ఒకటి 3 మిలియన్‌ రూబుళ్లను జరిమానాగా విధించింది. ఇదే కారణాలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌పై కూడా పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

* ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆచార్య కోసం క‌ళ్ల‌లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. అన్నింటికి మించి అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్ల‌కు పైగానే జ‌రుగుతోంది. ఈ సినిమాకు మొద‌టి నుంచి క‌లిసి రావ‌డం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. 2021, మే 13న ఈ సినిమాను రిలీజ్ చేయాల‌నే ప్లాన్‌తో సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా చేశారు. కానీ మ‌ధ్య‌లో క‌రోనా రావ‌డంతో షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. దీంతో సినిమా విడుద‌ల ఆల‌స్య‌మైంది. ఇప్పుడు ఎట్ట‌కేల‌కు సినిమా షూటింగ్ పూర్త‌యింది. మిగిలిపోయిన చిన్న చిన్న వ‌ర్కుల‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లోకి వెళ్లాల‌ని చూస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కుద‌ర‌క‌పోవ‌డంతో ద‌స‌రా బ‌రిలో దింపాల‌ని కొర‌టాల ప్లాన్ చేసుకున్నాడు. అయితే ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ విడుద‌ల కానుంది. దీంతో ద‌స‌రా బ‌రిలో నుంచి ఆచార్య త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. పోనీ సంక్రాంతికి విడుద‌ల చేద్దామంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్ బాబు, వెంక‌టేశ్ వంటి పెద్ద హీరోలు ఇప్ప‌టికే పండుగ పోటీకి సిద్ధ‌మ‌య్యారు. ఇంత‌మంది స్టార్ హీరోల మ‌ధ్య పోటీలో ఆచార్య‌ సినిమాను విడుద‌ల చేయ‌డం చిరంజీవికి ఇష్టం లేదు. అందుకే అన్ని సినిమాలు వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో లేదంటే స‌మ్మ‌ర్‌లో గానీ ఆచార్య విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదేగానీ జ‌రిగితే మెగా అభిమానుల‌కు అంత‌కంటే నిరాశ‌ప‌రిచే అంశం మ‌రొక‌టి ఉండ‌దు. 2022 స‌మ్మ‌ర్‌కు ఆచార్య రిలీజ్ అంటే.. దాదాపు మ‌రో 8 నెల‌ల స‌మ‌యం ఉంది. ఆ లోపు చిరు మ‌రో రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తి చేయొచ్చు. ఏదేమైనా ఆచార్య సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానుల‌కు నిజంగా ఇది షాకింగ్ న్యూసే.

* రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

* మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్‌ పరామర్శించారు. కాగా హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్‌ అస్వస్థకు గురైన విషయం తెలిసిందే.

* గత రెండు ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు చేరని తైజుయింగ్‌ ఎట్టకేలకు పతకానికి బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌ సెమీఫైనల్‌లో పీవీ సింధూను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో రియో ఒలింపిక్స్‌లో సింధూ చేతిలో ఓడిన తైజూయింగ్‌ ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. ఫలితంగా తన కేరీర్‌లో తొలి ఒలింపిక్స్‌ పతకం అందుకోనుంది. శనివారం జరిగిన సెమీస్‌-2 మ్యాచ్‌లో పీవీ సింధూపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన తైజు దూకుడైన ఆటతో వరుస గేమ్‌లలో విజయం సాధించింది. తొలి గేమ్‌ను 21-18, రెండో గేమ్‌ను 21-12 తేడాతో ఓడించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

* తాజాగా ఆపిల్‌ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ, రూపే, నెట్‌ బ్యాంకింగ్‌ పేమెంట్స్‌ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చును. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్‌ యూజర్లకు లాభం జరగనుంది. ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడానికి యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే ఈ సేవలు అప్‌డేట్‌ చేసిన ఐవోస్‌, ఐప్యాడ్‌, మాక్‌ఓఏస్‌ లో వస్తుందని ఆపిల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

* టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొల్లపూడి పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు యత్నించాయి. ఈ క్రమంలో గొల్లపూడిలో ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమాకు మద్దతు తెలపడంపై పలు దళిత సంఘాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

* తాబేళ్లను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ అటవీ శాఖ ప‌ట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ శాఖ నిఘా విభాగం హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో రైడ్ చేసి ఇద్దరు వ్యక్తులను ప‌ట్టుకుంది. వీరి వ‌ద్ద నుండి 330 ఇండియ‌న్ టెంట్‌ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ ఒకటిలో తాబేళ్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కావునా వీటిని పట్టుకోవటం, తరలించటం, అమ్మటం నేరం అన్నారు. ఇండియన్ టెంట్ లేదా అస్సాం రూఫుడ్ టార్టయిస్ గా పిలిచే ఈ తాబేళ్లు అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నట్లు తెలిపారు.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేసిన నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీకి సర్వం సిద్దమయింది. ఆగస్టు మాసం నుండే వారికి రేషన్ అందించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా రాష్ట్రంలో అర్హులైన సుమారు 3 ల‌క్ష‌ల 9 వేల 83 కొత్త కార్డుల్లోని 8.65 లక్షల లబ్దిదారుల‌కు ఆగష్టు నుండి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం చొప్పున ఆగస్టు నుండి నవంబర్ వ‌ర‌కు నాలుగు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్న‌ట్లు తెలిపారు. ఇందుకై అదనంగా నెలకు రూ.23.10 కోట్లతో 4 నెలలకు రూ.92.40 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయన్న‌ట్లు మంత్రి చెప్పారు. ఆగస్టు నెల పంపిణి 3వ తేదీ నుండి ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

* టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తుకు గడువు పెంచాలని సెట్‌ చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు గడువు పెంచేందుకు ఆయన సుముఖతం వ్యక్తం చేశారని టీఎస్‌ పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు.

* పాతబస్తీ బోనాల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని సూచించారు. నిబంధనలు ధిక్కరించి మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోనాల‌కు త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం, దేవాదాయ శాఖ ఆద్వ‌ర్యంలో అన్ని సదుపాయాలను సిద్ధం చేశామ‌న్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తామ‌ని పేర్కొన్నారు. బోనాలు స‌మ‌ర్పించేందుకు వ‌చ్చే భ‌క్తులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని కోరారు.

* మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో, అంతే వేగంగా ముందు తరాలు భాష వైపు ఆకర్షితమౌతాయన్నారు. ప్రభుత్వాలు భాషను కాపాడాలని సంకల్పిస్తే నిధులు ఇవ్వగలవ‌ని, అదే సంకల్పం ప్రజలు తీసుకున్నప్పుడే తరతరాలకు మనగలదని దిశానిర్దేశం చేశారు. భాషాభిమానుల వ‌ర్చువ‌ల్‌ సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు సూత్రాలను ఉప‌రాష్ట్ర‌ప‌తి పునరుద్ఘాటించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు.