NRI-NRT

ఫ్లోరిడా టెక్సాస్‌లలో భారీగా కోవిద్ కేసులు-తాజావార్తలు

ఫ్లోరిడా టెక్సాస్‌లలో భారీగా కోవిద్ కేసులు-తాజావార్తలు

* అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అగ్రరాజ్యాన్ని చిగురుటాకులా వణికించిన ఈ మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే ఉంటున్నట్టు ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 1,49,788 ఇన్‌ఫెక్షన్లు బయటపడగా.. మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. అలాగే, తాజాగా మరో 668మంది మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్‌ కాటుకు బలైపోయినవారి సంఖ్య 6.14లక్షలకు చేరింది.

* తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న 60 దళిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎన్నో పోరాటలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ ఆరేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్‌, తాగునీరు, సాగునీరు సమస్య తీరింది. కులవృత్తులపై ఆధారపడిన వారిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు తెచ్చినా వాటిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. కరోనా వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల కొన్ని పథకాల ఆమలు పెండింగ్‌లో ఉంది. ఏదేమైనా దళితబంధు పథకం అమలు చేసి తీరుతాం. ఇల్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రభుత్వ భూమిని నిరుపేద ఎస్సీలకు ఇస్తాం. వాసాలమర్రి గ్రామంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో ఎర్రవల్లి గ్రామం పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఎర్రవల్లిలో ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చాం. గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. వాసాలమర్రిలో కూడా అదే విధంగా కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

* రాష్ట్రంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని.. కోర్టు ఆదేశాల పట్ల గౌరవం లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికే రూ.413 కోట్లు చెల్లించామని.. నాలుగు వారాల్లో మరో రూ.1,117 కోట్లు చెల్లించనున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

* కార్యకర్తల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ పెద్ద దిక్కుగా ఉంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మరణించిన తెరాస కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించిన కేటీఆర్‌ .. తన దృష్టికి తెచ్చిన సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

* పార్టీకి వ్యతిరేకంగా తనతో సహా ఎవరు పనిచేసినా చర్యలుంటాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

* రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ న్యాయస్థానం దృష్టికి వస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది.

* కర్ణాటక కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల బసవరాజ్‌ బొమ్మై ప్రమాణస్వీకారం తర్వాత బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రెండు పర్యాయాలు దిల్లీ పర్యటనకు వెళ్లి భాజపా అధిష్ఠాన పెద్దలతో చర్చించి తర్జనభర్జనల అనంతరం బొమ్మై.. 29 మందితో కొత్త జట్టును ఎంపిక చేశారు.

* దేశ భద్రతతో ముడిపడి ఉన్న పెగాసస్ హ్యాకింగ్‌పై పార్లమెంట్‌లో చర్చజరపాలని 14 విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ విషయంలో ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తూ.. ఆ పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

* ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌.. ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితికి దిగజారింది. సాంస్కృతిక, ఫ్యాషన్‌, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని పాక్‌ కేబినెట్‌ నిర్ణయించినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు బుధవారమూ కొనసాగింది. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్‌ తొలిసారి 54 వేల మార్క్‌ను దాటింది. నిన్న 16 వేల మైలురాయిని దాటిన నిఫ్టీ నేడూ దూసుకెళ్లింది. రెండు సూచీలు ఈ రోజు తాజా జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి.

* భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. భారత్‌కు కనీసం రజతం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో స్వర్ణ పోరుకు అర్హత సాధించాడు. 7-9 తేడాతో కజక్‌స్థాన్‌ కుస్తీవీరుడు సనయెవ్‌ నురిస్లామ్‌ను ఓడించాడు.

* కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్‌ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, న్యాయమూర్తి విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

* అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.10వేల వరకు ఉన్న డిపాజిట్లను బాధితులకు అందజేసినట్టు తెలిపింది. ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.20వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి బ్యాంకుఖాతాలో ఈనెల 24న సీఎం చేతులమీదుగా జమ చేస్తారని వెల్లడించింది. అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలని తెలిపారు. ఎవరైనా డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ చూపాలని, నగదును వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక డిపాజిట్‌ దారుడు ఒక క్లెయిమ్‌కు మాత్రమే అర్హులని తెలిపారు. గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.