NRI-NRT

సైనిక్ స్కూల్ విద్యార్థికి సాయం అందించిన కర్నూలు ఎన్నారై ఫౌండేషన్

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కలికిరి సైనిక్ స్కూల్ నిర్వహించిన ప్రవేశపరీక్ష లో ఎంపికైన విద్యార్ధి టి. జయ సాయి నాగదేవ్ కు మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం లక్ష నలభై వేల రూపాయలను కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ అందించింది. బుధవారం ఆగస్టు 4 నాడు కర్నూలు ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ద్వారా విద్యార్ధి జయ సాయి నాగదేవ్ కు చెక్కును అందజేశారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా అందిస్తున్న ఆర్ధిక సహాయం స్ఫూర్తిదాయకమని, కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సేవలని అభినందిస్తున్నట్లు ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరానికి చెందిన విద్యార్ధి, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ నిర్వహించిన ప్రవేశపరీక్షలో అత్యధిక మార్కులు సాధించడం గర్వకారణమని, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలకు పైగా ఆర్ధిక సహకారం అందజేస్తున్నట్లు కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవి పొట్లూరి తెలిపారు.
భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులకు తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ తెలిపారు. డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సీఐ పవన్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.