Health

ఏపీలో మరో లాక్‌డౌన్?-తాజావార్తలు

ఏపీలో మరో లాక్‌డౌన్?-తాజావార్తలు

* కోవిడ్‌19 వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుగా రాబోయే పండుగల సందర్భంగా స్థానికంగా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. మొహర్రం (ఆగస్టు 19), ఓనం (ఆగస్టు 21), జన్మాష్టమి (ఆగస్టు 30), వినాయక చవితి (సెప్టెంబరు 10), దుర్గా పూజ (దసరా నవరాత్రులు, అక్టోబరు 5-15) లకు జనం గుంపులుగా ఒకేచోట చేరకుండా చూడాలని, స్థానికంగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో కోరారు. పండుగల సందర్భంగా జనం పెద్దసంఖ్యలో ఒకేచోటికి చేరితే… సూపర్‌ స్ప్రెడర్‌గా అవి మారే అవకాశం ఉంటుందని, కోవిడ్‌ కేసులు పెరిగిపోవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. సెకండ్‌ వేవ్‌లో కేసుల వ్యాప్తిని అడ్డుకోవడానికి రాష్ట్రాలు చేసిన కృషిని అభినందించారు. 

* ఏపీలో లాక్ డౌన్ వైపు అడుగులు పడుతున్నాయి..!ఇప్పటికే చిత్తూరు, గుంటూరు,నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చేశాయి.మధ్యాహ్నం వరకే కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది.మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకే పర్మిషన్ ఇస్తున్నారు.మొత్తమ్మీద సెకండ్ వేవ్ ప్రారంభంలో ఎలా జరిగిందో..ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతోంది.ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తోంది.రాత్రి 9గంటల వరకే షాపులు,10 గంటల వరకు జన సంచారానికి అనుమతి ఉంది.అయితే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేసులు పెరుగుతున్న కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా మరికొన్ని గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటోంది.గుంటూరు నగరంలోని బ్రాడీపేట సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని చోట్ల కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు.సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గిపోలేదా..? లేక థర్డ్ వేవ్ మొదలైందా అనే సంశయం ఉండగానే..అనుకోకుండా లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి రావడం విశేషం.ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా రోజువారీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.దీంతో ఎక్కడికక్కడ అధికారులే చొరవ తీసుకుని నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.స్థానిక నాయకులతో చర్చించి కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నారు.అందరూ మాస్క్ లు ధరించండి,శానిటైజర్ వాడండి,సామాజిక దూరం పాటించండి అని చెబుతున్నా ప్రయోజనం లేదని తేలిపోయింది.మాస్క్ పెట్టుకోనివారికి జరిమానా విధిస్తున్నా ఫలితం కనిపించడంలేదు.దీంతో లాక్ డౌన్ తరహా ఆంక్షలే కరోనా కట్టడికి మేలు అని అధికారులు భావిస్తున్నారు.

* అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎంపీ శ్రీనివాసులపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తప్పుడు కేసు పెట్టించారని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. ‘‘కాకాణి అనుచరులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్‌ తవ్వకానికి అక్రమ దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మాగుంటను కేసులో ఇరికించారు. దరఖాస్తు పెట్టింది మాగుంటే అయితే దీనిపై పోలీసులు విచారణ ఎందుకు చేయలేదు? ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి పోలీసు, జలవనరుల అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు.

* దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్‌ అంశంపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ‘వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమైనవే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైంది’ అంటూ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు తమ పిటిషన్ కాపీలను ప్రభుత్వానికి అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

* 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది. జర్మనీతో జరిగిన కాంస్య పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. నవ చరిత్రకు నాంది పలికింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 ని), హార్దిక్‌ సింగ్‌ (27ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29ని), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31ని) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2ని), నిక్లాస్‌ వెలెన్‌ (24ని), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25ని), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48ని) రాణించారు.

* రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతూ తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని ఆక్షేపించారు. రాళ్లదాడి చేసిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారన్నారు. ఈ విషయంపై తనతో కలసి పనిచేసిన ప్రతి ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. అనారోగ్యం నుంచి కోలుకుని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన అనంతరం ఈటల మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మెరుగైన వైద్యం అందించారంటూ అపోలో యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

* కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం 10% ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా తమ పౌరులకు బూస్టర్‌ డోసు అందించే ప్రక్రియను ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్‌ ముప్పును అధిగమించేందుకుగాను అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు కూడా ‘బూస్టర్‌’ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో బుధవారం విలేకర్ల సమావేశంలో అధనోమ్‌ మాట్లాడారు. కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ తొలి డోసు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు మూడో డోసు ఆలోచనలను మానుకోవాలన్నారు.

* తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జి.కొండూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ దేవినేని ఉమ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదలయ్యారు. ఆయన విడుదల సందర్భంగా జైలు వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

* అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్‌ డివిజన్‌ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్‌ కార్డులను గురువారం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మేయర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ..అర్హులైన పేదలకు కార్డులు జారీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు.