DailyDose

భక్తురాలిని చితకబాదిన పూజారి-నేరవార్తలు

భక్తురాలిని చితకబాదిన పూజారి-నేరవార్తలు

* జమ్మూకశ్మీర్‌వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. ఉగ్రవాదులకు నిధుల చేరవేతకు సంబంధించిన ఓ కేసు నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాలే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది. వీరికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు సహకరిస్తున్నాయి. దోడా, కిష్టావర్‌, రంబన్‌, అనంత్‌నాగ్‌, బద్గాం, రజౌరీ, షోపియాన్‌ సహా మరికొన్ని జిల్లాల్లోని అనుమానితుల నివాసాల్లో దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే పలు కీలక పత్రాలతో పాటు, డిజిటల్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్‌ అనుకూల కార్యక్రమాల చేపడుతూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్న జమాతే.. పలు ఉగ్రవాద కార్యక్రలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్లు ఇటీవల నమోదైన ఓ కేసులో బహిర్గతమైంది. గతవారం కూడా ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.

* విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలో గండి మడుగులో మునిగి నలుగురు మృతి చెందారు.విహారయాత్ర కోసం బెంగళూరు నుంచి 20 మంది కుటుంబసభ్యులు ఏపీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.వారిలో నలుగురు హఫీజ్‌ (10), ఉస్మాన్‌ (11), హంజా (12), యూసుఫ్‌ (40) వెల్లిగల్లు ప్రాజెక్ట్ సమీపంలో గండిమడుగులో మునిగి మృతి చెందినట్లు గుర్తించారు.

* పంజాబ్​లోని మొహలీలో దారుణ హత్య జరిగింది. యూత్ అకాలీదళ్ నేత విక్కీ మిద్దుఖేరపై ఇద్దరు సాయుధులు కాల్పులకు తెగబడ్డారు.పార్కింగ్​ స్థలంలో తన కారు ఎక్కుతుండగా బాధితుడిపై దుండగులు దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.దాడి అనంతరం దుండగులు ఇద్దరూ ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

* మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన్ను హత్య చేసేందుకు వినియోగించిన గొడ్డలి, ఇతర మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా మారణాయుధాల్ని వెలికితీసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. 20 మంది మున్సిపల్‌ సిబ్బందితో నిన్న, ఈరోజు పులివెందుల రోటరీపురం వాగులో మరికినీరు తొలగించి, యంత్రాలతో మట్టి తొలగించి గాలంచినా ఫలితం లేకపోయింది. రోటరీ పురం ఎడమ భాగంలో అన్వేషణ పూర్తయింది. సీబీఐ కస్టడీలో ఉన్న కీలక అనుమానితుడు సునీల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. మున్సిపల్‌ సర్వే సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. ఆ ప్రాంతం వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

* దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. మూసి ఉన్న ఆలయంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందన్న కారణంతో ఆమెను తీవ్రంగా కొట్టాడో అర్చకుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బిహార్‌లోని దర్భంగాలో ఉన్న ‘శ్యామా దేవాలయం’లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర బిహార్‌తో పాటు….నేపాల్‌ నుంచి భక్తులు అధికంగా వచ్చే ఈ ఆలయంలో పనిచేస్తున్న ఓ పూజారి భక్తురాలిని జుట్టు పట్టుకుని మరీ తీవ్రంగా కొట్టాడు. ఘటన అనంతరం ఆలయ కమిటీ పూజారిని తొలగించింది. సదరు మహిళకు మతిస్థిమితం సరిగా లేదని గుడి తలుపు పగలగొట్టేందుకు ప్రయత్నించిందని….అందుకే కొట్టాల్సి వచ్చిందని పూజారి వివరణ ఇచ్చాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో….మహిళా జుట్టు పట్టుకుని పూజారి కొడుతుండటం కనిపించింది. ఈ చర్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. మహిళ ప్రవర్తనపై ఇబ్బంది ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని అభిప్రాయపడ్డారు.