Devotional

ద్వారకాతిరుమలలో జంతుబలి అపచారం-తాజావార్తలు

ద్వారకాతిరుమలలో జంతుబలి అపచారం-తాజావార్తలు

* ద్వారకాతిరుమల చిన వెంకన్న శేషాచల కొండ పై ఘోర అపచారం జరిగింది. దేవస్థానంకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి ఈ అపచారానికి పాల్పడ్డారు. ఈ రోజు తెల్లవారుఝామున అన్నదాన భవనం పక్కన గల పవర్ హౌస్ లో జంతుబలి పూజలు నిర్వహించారు.మేకపోతుకు అగరొత్తుల ధూపం, పసుపు, కుంకుమ , వేపాకులతో దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది బలిపూజలు చేసారు. అలా పూజలు చేసిన మేకపోతుతోపవర్ హౌస్ చుట్టూ మూడు సార్లు ప్రదక్షణలు చేయించారు. తరువాతమేకపోతు చెవులు కోసి మొక్కులు చెల్లించారు. అనంతరం మేకపోతును ఆటోలో అక్కడ నుంచి తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది విందు ఏర్పాటు చేసుకోగా, దానిలో భాగంగానే ఈ మేకపోతుకు బలిపూజలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ జంతు బలి వెనుక తెర వెనక పాత్రధారులు ఎవరనే సందేహాలు భక్తుల్లో కలుగుతున్నాయి. ఆలయ ఈవోగా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆలయంలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవో పర్యవేక్షణ లోపమే ఆలయంలో వరుస ఘటనలకు ప్రధాన కారణమని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

* త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధైర్యముంటే తనపై పోటీ చేసి గెలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూరులో ఆయన పర్యటించారు. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన పలువురు భాజపాలో చేరగా ఆయన పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ‘‘ నన్ను దిక్కులేని వాడని అనుకుంటున్నారు. నేను హజూరాబాద్‌ ప్రజల గుండెల్లో చోటున్న బిడ్డను. దళిత బంధు ద్వారా రూ.10లక్షలు ఇచ్చినా తెరాస గెలవదు. గొర్రెలిచ్చినా, కులాలవారీ తాయిలాలిచ్చినా తెరాసకు ప్రజలు ఓట్లు వేయరు. నన్ను ఓడించేందుకు రూ.5వేల కోట్లయినా ఖర్చు చేస్తారట. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరు. నన్ను కాపాడుకుంటారా.. చంపుకుంటారా.. మీ ఇష్టం. ఓట్ల మీద తప్ప ఎస్సీలపై కేసీఆర్‌కు ప్రేమ లేదు. తెరాస ఏమిచ్చినా తీసుకోండి.. భాజపాకే ఓటేయండి’’ అని ఈటల రాజేందర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

* రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. చైనా భారీఎత్తున కొవిడ్‌ పరీక్షలు జరుపుతోంది. శ్రీలంకలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

* ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, ఆదివాసీలు, దళితులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలిసి వెళ్లిన రేవంత్ రెడ్డి.. సభ ఏర్పాట్లు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తదితర అంశాలపై చర్చించారు.

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. శనివారం పి.ఆదర్శ్‌, ఎల్‌ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్‌ చేయగా.. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. జులై 9న ఈ కేసులో నిందితుడిగా ఉన్న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని కువైట్‌ నుంచి వస్తుండగా అరెస్ట్‌ చేసినట్లు పేర్కొంది. శనివారం అరెస్టయిన ఆదర్శ్‌, సాంబశివరెడ్డిలను కోర్టులో ప్రవేశ పెట్టినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నయోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

* తెలంగాణ రాష్ట్ర సభ్యులు బోర్డు సమావేశానికి హాజరై అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా మరో తేదీని ఖరారు చేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రెండు బోర్డులకు మరోమారు విడివిడిగా లేఖలు రాసింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసుల విచారణ ఉన్నందున సోమవారం తలపెట్టిన బోర్డు భేటీకి హాజరు కాలేమని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ గతంలోనే లేఖలు రాశారు. అయితే కార్యాచరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్న కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో సమయాభావం వల్ల సమావేశాన్ని నిర్వహిస్తామని.. హాజరుకావాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లీ లేఖ రాశాయి.

* ఎటు చూసినా బహుళ అంతస్తుల ఆకాశ హర్మ్యాలు… విశాలమైన రహదారులు… అందమైన ఉద్యానవనాలు… జల విహారానికి వీలుగా తీర్చిదిద్దిన కాలువలు… అన్ని వర్గాల వారూ సుఖంగా, సౌఖ్యంగా నివసించే మహానగరం! విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నెలవు. ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచే ప్రజా రాజధాని. ఇదీ రెండేళ్ల క్రితం వరకూ అమరావతి గురించి రాష్ట్ర ప్రజలు కన్న కల! అది సాకారమవుతున్న దశలో రాజధాని పనులు అటకెక్కాయి! వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నప్పుడు 15 వేల మంది కార్మికులతో, వాహనాల రాకపోకలతో, విద్యుద్దీపాల వెలుగుల్లో రేయింబవళ్లు కళకళలాడిన అమరావతిలో… ఇప్పుడు ఎటు చూసినా నీరవ నిశ్శబ్దం. అమరావతిని కాపాడుకోవడానికి 600 రోజులుగా ఎండనక, వాననక… ప్రభుత్వ నిర్బంధాల్నీ, ఆంక్షల్ని, ఖాకీ బూట్ల పదఘట్టనల్ని, లాఠీ ఛార్జీల్ని భరించి, సహించి, ఎదురొడ్డి పోరాడుతున్న రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు, రైతులు కూలీల ఆక్రందనలు, ఉద్యమ నినాదాలు తప్ప అక్కడ ఎలాంటి శబ్దాలూ వినిపించడం లేదు.రాజధానికి అవసరమైన భారీ భవనాల కోసం నిర్మించిన పునాదులు నెలల తరబడి నీళ్లలో నానుతూ తటాకాల్ని తలపిస్తున్నాయి. సగంలోనే పనులు ఆగిపోయి… యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల్లా మిగిలిపోయిన బ్రిడ్జిలు… ఇప్పటికే చాలావరకూ పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న నివాస భవనాల ఆవరణల్లో అంతెత్తున పిచ్చిమొక్కలు… నిలువెత్తు పెరిగిన తుమ్మచెట్ల మధ్య దీనంగా కనిపిస్తున్న రహదారులు… భవనాల పునాదులు, బ్రిడ్జిలు, నివాస భవనాల నిర్మాణాల్ని నిలిపివేయడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్న ఇనుప చువ్వలు! చెదురుమదురుగా పడిన నిర్మాణ సామగ్రి, యంత్ర పరికరాలు… దొంగల పాలవకుండా వాటికి కాపలా కాస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న ఒకరో ఇద్దరో సెక్యూరిటీ గార్డులు..! ఇదీ ఇప్పుడు అమరావతి దీనస్థితి..!

* ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ముగిసింది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథులు, ప్రేక్షకుల మధ్య వేడుకను వైభవంగా ముగించారు. భారీ సంఖ్యలో క్రీడాభిమానులు లేకున్నా.. బాణాసంచా పేల్చి.. నృత్యప్రదర్శనలు, లైట్‌షో నిర్వహించి ఒలింపిక్‌ ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌ స్టేడియంలో ప్రపంచ దేశాల జెండాలు ప్రదర్శించారు. గత నెల 23 నుంచి ఇవాళ్టి వరకు ఒలింపిక్‌ క్రీడలు జరిగాయి. టోక్యో ఒలింపిక్స్‌లో 113 పతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా… 88 పతకాలతో ద్వితీయ స్థానంలో చైనా, 58 పతకాలతో తృతీయ స్థానంలో జపాన్‌, 7 పతకాలతో 48వ స్థానంలో భారత్‌ నిలిచాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు టోక్యోలోనే అత్యధికంగా ఏడు పతకాలు లభించాయి. ఒలింపిక్స్‌ క్రీడలు 2024లో పారిస్‌లో జరగనున్నాయి.

* విభిన్న కథలు, నేపథ్యాలను ఎంచుకుంటూ వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో రామ్‌ గోపాల్‌ వర్మ ఒకరు. అంతేకాదు, అంతకుమించి వివాదాలతో ఆడుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఆయన ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ‘రక్త చరిత్ర’తో ఫ్యాక్షన్‌ను తనదైన కోణంలో చూపించి సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించారు. దానికి అనుబంధంగా ఇప్పుడు ‘కడప్ప’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తీయబోతున్నట్లు ప్రకటిస్తూ వీడియోను పంచుకున్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,283 పరీక్షలు నిర్వహించగా.. 2,050 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,82,308 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,531కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,458 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,48,828కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,93,429 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

* అలనాటి దిగ్గజ నటి, ఊర్వశి శారద కన్నుమూశారంటూ ఆదివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు, ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆ వార్తలు నిజమా? కాదా? అన్న దానిపై స్పష్టత కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న శారద సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. ‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని పేర్కొన్నారు.

* జంట నగరాల్లో రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు జలమండలి వెల్లడించింది. పైప్‌లైన్ల మరమ్మతుల దృష్ట్యా రేపు ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు అంతరాయం కలగనుంది. బాలాపూర్, మైసారం, బార్కాస్, మేకలమండి, భోలక్ పూర్, తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్, మహింద్రా హిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

* తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని రేవంత్‌తో చెప్పినట్లు వెల్లడించారు. చౌటుప్పల్‌ రాజీవ్‌ భవన్‌లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ది అరాచక పాలన అని.. హిట్లర్‌ బతికి ఉంటే కేసీఆర్‌ను చూసి విలపించేవారని ఎద్దేవా చేశారు. కేవలం గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకే ఆయన సీఎంలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రం పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు. సుమారు రూ.3,400 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.