Movies

హేమాపై చర్యలు తీసుకుంటామంటున్న నరేష్-తాజావార్తలు

హేమాపై చర్యలు తీసుకుంటామంటున్న నరేష్-తాజావార్తలు

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల హేమ చేసిన ఆరోపణలపై ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ స్పందించారు. హేమ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని వివరించారు.

* కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ దళితబంధు పథకం అమలు కోసం రూ.500 కోట్ల ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజున చెంచులకు (24) డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో ఆదివాసీల కోసం రూ.120.96 లక్షల వ్యయంతో నిర్మించనున్న 24 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి మంత్రి మాట్లాడారు. ఆదివాసీలు అడవుల్లోనే ఉంటారని, వారు అడవిని వదిలి వెళ్లలేరని అందువల్ల అడవి లాంటి ప్రాంతంలోనే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు.

* ఆగ‌స్టు 15న గోల్కొండ కోట‌పై నిర్వ‌హించే స్వాతంత్ర్య దినోత్స‌వ‌ వేడుక‌ల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు. పంద్రాగ‌స్టు రోజున గోల్కొండ కోట‌పై సీఎం కేసీఆర్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు సీఎస్ తెలిపారు.

* చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనఒ నిర్మిస్తామ‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్క‌ర్ క‌మ్యూనిటీ భ‌వ‌నానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

* రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ( RGIA ) ఇండియాతో పాటు మ‌ధ్య ఆసియాలో ఉత్త‌మ ప్రాంతీయ ఎయిర్‌పోర్టు అవార్డు వ‌రించింది. వ‌రుస‌గా మూడో ఏడాది ఈ అవార్డును ద‌క్కించుకున్న‌ట్లు జీఎంఆర్ ( GMR ) వెల్ల‌డించింది. స్కైట్రాక్స్ వ‌ర‌ల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డుల కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌టన చేసిన‌ట్లు తెలిపింది.

* ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారని తెరాస ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ ఆరోపించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెరాసపై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌.. ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను ఎందుకు ప్రశ్నించరని అన్నారు.

* ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ సమయంలో మోదీ చిత్రపటంతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్‌ డిపోను ఆమె పరిశీలించారు. ‘జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా ప్రజా పంపిణీ దుకాణంలోనే లబ్ధిదారులకు రేషన్‌ అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తే మాకు అనవసరం. కేంద్రం వాటా రేషన్‌ దుకాణాల వద్దే ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పీఎంజీకేఏవై బోర్డులు ప్రదర్శించండి’ అని అధికారులను ఆదేశించారు. ‘తాను వస్తున్నానని పీఎంజీకేఏవై బోర్డు పెట్టారా.. ఇంతకుముందు కూడా ఉందా’ అని డీలర్‌ను ప్రశ్నించారు. అనంతరం ఉచిత బియ్యం ఎవరు అందిస్తున్నారో తెలుసా అని లబ్ధిదారులను ఆరా తీశారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పిలిచి ఉచిత బియ్యం గురించి లబ్ధిదారులకు మా ముందే తెలియజేయాలన్నారు. దీంతో ఎమ్మెల్యే.. పీఎంజీకేఏవై ద్వారా బియ్యం ఇస్తున్నారని చెబుతూనే ‘మా అన్న పథకాలైతే చెప్పగలంగానీ ఇవేం చెప్పగలం’ అని నవ్వడంతో.. ప్రధాని మోదీ దేశంలో అందరికీ అన్నలాంటివారేనని గుర్తుంచుకోండి అంటూ మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు, ఆయన సేనాని గంటం దొర సమాధులను నిర్మలా సీతారామన్‌ సందర్శించి నివాళులర్పించారు. 75 వారాల పాటు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో దేశంలోని వీరుల స్మారక స్థలాలన్నీ సందర్శిస్తున్నట్లు చెప్పారు. అందులో మొదటగా మన్యం వీరుని స్మారక ప్రాంతాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీలు సత్యవతి, గొడ్డేటి మాధవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్యేలు ఉమాశంకర్‌ గణేష్‌, ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

* టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు, విజేతలు సోమవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జావెలిన్‌ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా సైతం తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా వారికి దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మరోవైపు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ సందీప్‌ ప్రధాన్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి క్రీడాకారులను ఘనంగా ఆహ్వానించారు. అభిమానులు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ భౌతిక దూరం గాలికొదిలేశారు. దాంతో క్రీడాకారులు అక్కడి నుంచి త్వరగానే వెళ్లిపోయారు.

* కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచం ముందు భారత్‌ శక్తిమంతమైన దేశంగా నిలబడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి కాంగ్రెస్‌ స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘క్విట్‌ ఇండియా డే’ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. కేసీఆర్‌, మోదీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. దేశంలో కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నారని ఆక్షేపించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత, గిరిజన వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఆ వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.