Business

భారత్ వెళ్తే నీరవ్ మోడీ ఆత్మహత్య చేసుకుంటాడు-వాణిజ్యం

* అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ కంపెనీల త్రైమాసిక ఫలితాల దన్నుతో సోమవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా దూసుకెళ్లగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16,300 మార్క్‌ పైన కదలాడుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 226 పాయింట్ల లాభంతో 54,504 వద్ద, నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 16,303 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హిందాల్కో, సిప్లా, రిలయన్స్‌ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* పీఎఫ్‌ చందాదారులు యూఏఎన్‌ (UAN) నంబర్‌తో తమ ఆధార్‌ను జత చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్‌ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరు. యాజమాన్యాలు పీఎఫ్‌ మొత్తాలను జమ చేయలేకపోవడమే కాకుండా.. పీఎఫ్‌కు సంబంధించి చందాదారులు సైతం నగదును ఉపసంహరించుకోలేరు. సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తొలుత ఈపీఎఫ్‌ ఖాతాకు ఆధార్‌ జత చేయడానికి జూన్‌ 1ను ఈపీఎఫ్‌వో గడువుగా విధించింది. దాన్ని తాజాగా సెప్టెంబర్‌ 1 వరకు పొడిగించింది. ఇది వరకే మీరు ఆధార్‌తో మీ పీఎఫ్‌ ఖాతాను జత చేసి ఉంటే మరోసారి ధ్రువీకరించుకోండి. ఒకవేళ జత చేయని పక్షంలో వెంటనే జత చేసుకోండి.

* ప‌రారీలో ఉన్న ఆర్థిక నేర‌గాడు నీర‌వ్ మోదీ… త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ‌వ‌ద్ద‌ని కోరుతూ అప్పీల్ దాఖ‌లు చేసేందుకు లండ‌న్ హైకోర్టు సోమ‌వారం అనుమ‌తి ఇచ్చింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ)లో లెట‌ర్ ఆఫ్ ఇండెంట్ పేరిట రూ.13,500 కోట్ల మోసానికి పాల్ప‌డి.. నీర‌వ్ మోదీ విదేశాల‌కు పారిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత లండ‌న్ వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్న నీర‌వ్ మోదీని బ్రిట‌న్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి జైలులోనే మ‌గ్గుతున్న నీర‌వ్ మోదీ.. త‌న మాన‌సిక ఆరోగ్యం, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న నేప‌థ్యంలో భార‌త్‌కు అప్ప‌గించొద్ద‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. తీవ్ర నిరాశానిస్ప్రుహ‌ల్లో చిక్కుకున్న నీర‌వ్ మోదీ ఆత్మ‌హ‌త్య చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు వాదించారు. ముంబైలోని ఆర్టూర్ రోడ్ జైలులో ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌ను నివారించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌స్టిస్ మార్టిన్ చంబేర్లియ‌న్ విచార‌ణ జ‌రిపారు.

* జూన్‌ నెలతో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ (MRF Profits) బంపర్ లాభాన్ని ఆర్జించింది. కంపెనీ లాభం 12 రెట్లు పెరగ్గా.. ఆదాయం కూడా 70 శాతం పెరిగింది. జూన్ త్రైమాసికం ఫలితాలను ఎంఆర్‌ఎఫ్‌ సోమవారం విడుదల చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.13.5 కోట్ల నుంచి కంపెనీ లాభం సంవత్సరానికి 12 రెట్లు అధికంగా రూ.165.5 కోట్లకు పెరిగింది.