Sports

అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు సీబీఐకు ఇవ్వాలి-తాజావార్తలు

అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు సీబీఐకు ఇవ్వాలి-తాజావార్తలు

* పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు జీవితంలో అనేక మెట్లు ఎక్కామని అమర రాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… పారిశ్రామిక వేత్తగా తాను ఎదిగిన క్రమాన్ని వివరించారు. ‘‘నా తండ్రి నిరక్షరాస్యుడే కానీ, చాలా తెలివైన వ్యక్తి. ఆయన చొరవ, ముందుచూపు ఉన్న వ్యక్తి. అవే లక్షణాలు నాక్కూడా వచ్చాయి. చిన్నప్పుడు స్వగ్రామంలోనే అనేక విషయాలు నేర్చుకున్నా.నాజీవితంలో మరో గొప్ప వ్యక్తి మా మేనమామ పి.రాజగోపాలనాయుడు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడు. నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసేవారు. ఎప్పుడూ పల్లెలు, రైతులు, కూలీల గురించే ఆలోచించేవారు. మా తండ్రి, మేనమామ నుంచి అనేక విషయాలు నేర్చుకున్నా. అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలని కోరుకున్నా. రాజగోపాలనాయుడు స్ఫూర్తితోనే ప్రజాసేవలోకి వచ్చాం. వ్యవసాయ రంగంపై ఆధారపడే వారు క్రమంగా తగ్గుతున్నారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది నా లక్ష్యం’’ అని రామచంద్రనాయుడు వివరించారు.

* సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మనకు రాజకీయాలు నేర్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు.

* ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ ఇబ్రహీంపట్నంలో మరో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇబ్రహీంపట్నంలో ఈనెల 18న నిర్వహించనున్న ఈ సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. శనివారం జరగబోయే కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈనెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేశారు. సాధ్యమైనంత వరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 21వ తేదీ తర్వాత సభ ఎప్పుడు పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నా వైరస్‌ ఉద్ధృతి మాత్రం ఆగడంలేదు. గడిచిన 24గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి దాదాపు 10వేల మందికి పైగా మృత్యువాతపడగా.. 7లక్షల మందికి ఈ మహమ్మారి సోకింది. అమెరికా, బ్రిటన్‌, ఇరాన్‌ సహా పలు దేశాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి ఆందోళనకరంగా మారుతోంది. ఒక్క అమెరికాలోనే నిన్న దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదు కాగా.. ఇరాన్‌లో 39వేలకు పైగా కేసులు, 568 మరణాలు వెలుగుచూశాయి. ఇకపోతే, బ్రిటన్‌లోనూ దాదాపు 33వేల మందికి కొవిడ్‌ సోకింది. జులై 23 తర్వాత తొలిసారి నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అక్కడి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,54,62,557 మందికి వైరస్‌ సోకగా.. 43,35,111మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5కోట్ల మందికి పైగా కోలుకున్నారు.

* భారత్‌లోకి ప్రవేశించడంపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రముఖ విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ టెస్లా తీరుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ కోరినట్లుగా దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. భారత్‌లో తమ కార్యాచరణ ఏంటో వివరించాలని కోరింది. ఈ మేరకు గత నెల ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పూర్తిగా అనుసంధానించిన కార్లను దిగుమతి చేసుకోవడం కంటే.. పరికరాలను యూనిట్ల వారీగా దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకాలు వర్తిస్తాయని ఈ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపినట్లు అధికారి పేర్కొన్నారు. దీనిపై తమ అభిప్రాయం తెలపాలని టెస్లాను కోరినట్లు తెలిపారు. అలాగే దిగుమతి సుంకాలను తగ్గిస్తే భారత్‌లో చేపట్టబోయే పనులకు సంబంధించిన పూర్తి కార్యాచరణను సమర్పించాలని అడిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు భారత్‌లోనే కార్ల తయారీ పరికరాలను సమకూర్చుకోవాలని కూడా కోరినట్లు వెల్లడించారు. భారత్‌లో ఇప్పటి వరకు 100 మిలియన్‌ డాలర్లు విలువ చేసే పరికరాలను కొనుగోలు చేసినట్లు టెస్లా ప్రతినిధులు తెలిపారు. పన్నులు తగ్గిస్తే ఈ విలువ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే విక్రయాలు, సేవలు, ఛార్జింగ్‌ వసతుల్లో ప్రత్యక్ష పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ఇలా భారత్‌లోకి దశలవారీగా ప్రవేశించి పూర్తి స్థాయి తయారీలో పెట్టుబడులు ప్రారంభిస్తామని స్పష్టం చేసినట్లు అధికారి వెల్లడించారు.

* విడ్‌ టీకా విషయంలో మరో ముందడుగు పడింది. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ (నాజల్‌ వ్యాక్సిన్‌) క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతించింది. రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు అనుమతి లభించినట్లు భారత్‌ బయోటెక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 18 నుంచి 60 ఏళ్ల వయసు వారిపై తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

* సచివాలయానికి ఐఏఎస్‌ అధికారులు సరిగా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా పరిగణించారు. విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. పది రోజులకోసారి సచివాలయానికి తానూ హాజరుకావాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఐఏఎస్‌లతో సమావేశం నిర్వహించారు. విభాగాధిపతులు, క్యాంపు కార్యాలయాల నుంచి పనిచేయడం సరికాదని సీఎస్‌ సూచించారు. పరిపాలన గాడి తప్పేందుకు అధికారులు అవకాశం ఇవ్వకూడదన్నారు. ఇ-ఫైల్స్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ వ్యక్తిగత దస్త్రాలపై వివరణ ఉండాలని సీఎస్‌ అధికారులకు సూచించారు.

* స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన పత్ర్యేక బ్రాంచ్‌ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టోళ్లు, 50 లైవ్‌ బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరు దిల్లీ వాసి కాగా.. మిగతా వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారిగా తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై మహమ్మద్‌ అజహరుద్దీన్‌ పరువు నష్టం దావా వేశారని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో గురువారెడ్డి మాట్లాడుతూ రూ.రెండుకోట్లకు తమపై అజహరుద్దీన్‌ సివిల్‌ సూట్‌ వేశారని.. ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేశారని చెప్పారు. అజహర్‌పై ఉన్న మ్యాచ్‌ఫిక్సింగ్‌ కేసులను మళ్లీ తెరవాలని.. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అజహర్‌ వేసిన పరువునష్టం దావాపై తాము కౌంటర్‌ వేశామని.. ఇప్పటి వరకు ఆయన నుంచి సమాధానం లేదన్నారు. బీసీసీఐ ఆదేశాలను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న అజహరుద్దీన్‌ పాటించడం లేదని గురువారెడ్డి ఆరోపించారు. హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.