Devotional

టీటీడీకి 55మందితో జంబో కమిటీ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి నియమితులయిన నేపథ్యంలో సభ్యుల నియామకంపై కసరత్తు ప్రారంభమయింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక దేవాలయాల్లో ఒకటయిన టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం, ప్రతిసారీ విపరీతమైన పోటీ ఉంటుంది. దానికోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, కేంద్రమంత్రులు, పీఠాధిపతుల నుంచి కూడా భారీ సంఖ్యలో సిఫార్సులు వస్తుంటాయి. వారితోపాటు, స్థానికంగా ఉన్న రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలకు కూడా చోటు కల్పించడం ఏపీ ముఖ్యమంత్రులకు కత్తిమీద సాములా మారుతుంటుంది. ఈసారి ఆ వంతు జగన్‌కు వచ్చింది.

నిజానికి టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య గత రెండున్నరేళ్ల వరకూ 15 మందికే పరిమతమయింది. ఈ సంఖ్యను జగన్ సీఎం అయిన తర్వాత 25కి పెంచారు. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఎక్కువమందికి పదవులివ్వాలన్న లక్ష్యంతో, మరో 11 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఈ ఆహ్వానితుల వ్యవస్థను ప్రారంభించారు. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహా మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆ సంఖ్యను 11కి పెంచారు. పాత పాలకమండలి పదవీకాలం ముగిసి, కొత్తగా వైవి సుబ్బారెడ్డి మరోసారి చైర్మన్‌గా నియమితులయిన నేపథ్యంలో, బోర్డు సభ్యుల సంఖ్యను మరింత పెంచాలన్న యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా మొత్తం బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను 55 వరకూ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం వరకూ కేవలం 15 మంది మాత్రమే ఉన్న పాలక మండలిలో.. 12 మంది నామినేటెడ్ సభ్యులు, టీటీడీ ఈఓ, ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ), దేవదాయ శాఖ కమిషనర్లు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండేవారు. ఆ 12 మంది నామినేటెడ్ సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మహిళలు, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గానికి చెందిన సభ్యులుండేవారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఈ విధానం అమలయింది. విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబునాయుడు ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ సంఖ్యను ప్రస్తుత సీఎం జగన్ 11కు పెంచి, అసలు పాలకవర్గసభ్యుల సంఖ్యను 25కు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
టీటీడీలో చోటు కోసం ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు చెబుతున్నారు. వీరుకాకుండా సీఎం జగన్ మిత్రులు, వైసీపీ కీలక నేతల బంధు మిత్రులు, మహారాష్ట్ర పారిశ్రామికవేత్తలు సిఫార్సు చేసిన వారి సంఖ్య 70కి చేరుకున్నట్లు సమాచారం. వీరిలో ఎంత వడపోసి కసరత్తు చేసినా, అందులో 53 మందిని తొలగించడానికి అసలు సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఆ ప్రకారంగా మొత్తం 55 మందిని నియమించే అవకాశాలున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.