NRI-NRT

అమెరికాలో తగ్గిన శ్వేతజాతీయులు-తాజావార్తలు

అమెరికాలో తగ్గిన శ్వేతజాతీయులు-తాజావార్తలు

* అమెరికా క్రమేణా బహుళ జాతుల సమ్మిళిత దేశంగా రూపుదిద్దుకుంటోంది. గత దశాబ్దంగా శ్వేత జాతీయుల ఆధిక్యం తగ్గుతుండడంతో పాటు, ఇతర జాతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. గురువారం సెన్సస్‌ బ్యూరో విడుదల చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడయింది. 1790 నుంచి ఇక్కడ జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. తొలిసారిగా శ్వేత జాతీయుల సంఖ్య తగ్గింది. 2010లో వారి జనాభా 19.6 కోట్లు ఉండగా, తాజాగా 19.10 కోట్లు ఉంది. శాతాలవారీగా చూస్తే 63.7% నుంచి 57.8%కు తగ్గింది. అయితే మొత్తం జనాభాలో వారిదే ఆధిక్యం.

* తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా భాజపా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు నేతల పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెరాస సర్కారు విధానాలను ఎండగడుతూ 2023లో జరిగే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తామని భాజపా ముఖ్యనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న భాజపా అందుకు అనుగుణంగా జోరు పెంచింది. యాత్రలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి హోదాలో ఈనెల 19న కిషన్‌రెడ్డి రాష్ట్రంలో అడుగుపెట్టనున్నారు. అదే రోజు జన ఆశీర్వాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న కిషన్‌రెడ్డి… కేంద్ర ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 19న దిల్లీ నుంచి నేరుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి కోదాడ రానున్నారు. అదే రోజు కోదాడలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమవుతుంది. ఈనెల 20న దంతాలపల్లి, తొర్రూరు, రాయపర్తి, వర్దన్నపేట మీదుగా వరంగల్‌ చేరుకుంటారు. వరంగల్‌లో ఉచిత టీకా కేంద్రాన్ని కిషన్‌రెడ్డి సందర్శిస్తారు. అదే రోజు జనగామ జిల్లా రఘునాథపల్లె మండలం ఖిల్లాషాపూర్‌కు వెళ్లి సర్వాయి పాపన్న కోటను పరిశీలిస్తారు. ఆలేరుకు చేరుకుని పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కళాకారుడు చింతకింది మల్లేశంతో సమావేశమవుతారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 21న భువనగిరిలో రేషన్‌ దుకాణాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఘట్కేసర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మీదుగా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి యాత్ర చేరుకుంటుంది. అక్కడ ముగింపు సభ నిర్వహించనున్నారు. 12 జిల్లాలు, 7 పార్లమెంట్‌, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 324 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర సాగనుంది.

* వినేశ్‌ తలకు 2017లో బలమైన గాయమైంది. దీంతో ఆమె కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గందరగోళంలోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో తల దేనికైనా తగిలిస్తే తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ఈ సమస్య ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, చూపు ఒక్కసారిగా తగ్గిపోవడం, వెలుతురు, చప్పుడుకు ఇబ్బంది పడటం వంటివి ఎదుర్కొంటారు. కొంత గందరగోళం, ఏకాగత్ర తగ్గడంతోపాటు.. కుంగుబాటుకు లోనవుతారు. వినేశ్‌ వీటిల్లోని కొన్ని సమస్యలను దాదాపు నాలుగేళ్లుగా అనుభవిస్తోంది. కానీ, వీటిని పెద్దగా పట్టించుకోలేదు. శిక్షణ కొనసాగించింది. 2019లో కూడా కొన్నాళ్లు డిప్రెషన్‌లో ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కర్ఫ్యూను మరో వారంపాటు పొడిగించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఈనెల 21 వరకు కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. కొవిడ్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

* తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 245 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,380కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,842కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 582 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

* ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్‌ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి సమీప బంధువులు బోడ హరిదాసు(60), మల్సూరు(57), భద్రు(30) మద్యం తాగి… భోజనం చేస్తూ స్పృహ కోల్పోయి మరణించారు. భోజనంలో విషం కలిపినట్లు అనుమానించి స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా ఇంటిపై మృతుల కుటుంబసభ్యులు దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. బంధువులు తాగిన మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు నిర్ధారణ అయింది. పాత కక్షలతోనే ఆర్ఎంపీ వైద్యుడు చిన్నా మద్యంలో సైనైడ్‌ కలిపినట్లు మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నా ప్రస్తుతం ఖమ్మం పోలీస్‌ స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్నారు.

* కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం సాంబయ్యపల్లి సర్పంచ్ కొత్తపెల్లి రామకృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. విశ్రాంత ప్రొఫెసర్ అయిన కొత్తపెల్లి రామకృష్ణ.. తన గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. కానీ మహిళా వార్డు సభ్యుల భర్తలు అభివృద్ధి పనుల్లో అడ్డు పడుతుండటంతో మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. అంతటితో ఆగకుండా అభివృద్ధి పనులకు సంబంధించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామా చేయటంతోనైనా గ్రామం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని వివరించారు.

* సినీనటి కరాటే కల్యాణి భాజపాలో చేరారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో మాజీ ఎంపీ విజయశాంతి సమక్షంలో కరాటే కల్యాణికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భాజపా కండువా కప్పి ఆహ్వానించారు. కరాటే కల్యాణితో పాటు ఆమె అనుచరులు పది మంది పార్టీలో చేరారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కల్యాణి తెలిపారు.

* ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబ‌న్‌ల ఆధీనంలోకి వెళ్లిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేప‌టి క్రితం 129 మంది ప్ర‌యాణికుల‌తో ఢిల్లీకి బ‌య‌లుదేరింది. ఈ సాయంత్రం 6.06 గంట‌ల‌కు విమానం కాబూల్ విమానాశ్ర‌యంలో టేకాఫ్ అయ్యింద‌ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌ను చాలా ద‌గ్గ‌రి నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని భార‌త విదేశాంగ శాఖ తెలిపింది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆఫ్ఘనిస్థాన్‌లోని భార‌త దౌత్యాధికారులను వెన‌క్కు ర‌ప్పించాలా..? లేక‌ అక్క‌డే ఉంచాలా..? అనేదానిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది.