Health

గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం అంతా కట్టుకథ-తాజావార్తలు

గాంధీ ఆసుపత్రిలో అత్యాచారం అంతా కట్టుకథ-తాజావార్తలు

* ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తోన్న అఫ్గాన్‌ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను కాపాడమంటూ ఎయిర్‌పోర్టులో ఉన్న యూఎస్‌, యూకే దళాలను వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తోన్న తల్లులు ఎందరో..! ఆ హృదయ విదారక ఘటనలు చూస్తుంటే దుఖం పొంగుకొస్తోందని బ్రిటీష్‌ ఆర్మీ సీనియర్‌ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపిన విషయం తెలిసిందే. కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకొని వీరంతా పహారా కాస్తున్నారు. అయితే, తాలిబన్ల పాలనతో భయాందోళనకు గురైన అఫ్గాన్‌ వాసులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు గత సోమవారం ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అఫ్గాన్ వాసులను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. అయినప్పటికీ అక్కడకు చేరుకున్న వేలాది మంది అఫ్గానీయులు.. తమను కాపాడాలంటూ యూకే, యూఎస్‌ బలగాలను కోరుతున్నారు. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు. కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అంటూ ఓ బ్రిటిష్‌ అధికారి మీడియాకు చెప్పారు.

* తిరుపతి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

* పోలీసులను నాలుగు రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టించిన గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. మహబూబ్‌నగర్‌ నుంచి ఈ నెల 5న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ రోగి భార్య, మరదలిపై అత్యాచారం, ఆ తర్వాత ఒకరు కనిపించకుండా పోయిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కానీ, చివరికి అత్యాచార ఘటన అంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు. గాంధీ ఆసుపత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళలు చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చారు. మత్తు ప్రయోగం, అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. చిత్తభ్రమలకు లోనై సెక్యూరిటీగార్డుపై అత్యాచారం ఆరోపణలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ‘‘గాంధీ ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు మహిళలు కల్లుకు బానిసలు. భర్తను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఐదు రోజుల పాటు అక్కా చెల్లెళ్లు కల్లు తాగలేదు. కల్లు తాగకపోవడంతో వారిలో విత్‌డ్రాయల్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆగస్టు 11న రోగిని గాంధీ ఆసుపత్రిలోనే వదిలేసి అక్క వెళ్లి పోయింది. ఆగస్టు 11 నుంచి 15 వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఆమె చెల్లెలు ఉంది. ఆగస్టు 12, 14 తేదీల్లో సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగింది. అన్నీ క్షుణ్నంగా పరిశీలించినా ఎక్కడా అత్యాచారం జరిగినట్టు ఆధారాల్లేవు’’ అని పోలీసులు తెలిపారు.భర్తను గాంధీ ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన మహిళను నారాయణగూడలోని ఓ ఔషధ దుకాణం వద్ద గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో భర్తను చేర్పించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందనే దానిపై ఆమెను చిలకలగూడ పోలీసులు విచారించారు. ఆమెను భరోసా సెంటర్‌కు పంపిన పోలీసుల అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. కేసు దర్యాప్తులో భాగంగా మహబూబ్‌నగర్‌కు వెళ్లిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. అక్కా చెల్లెళ్లు మద్యం ఉపసంహరణ లక్షణాల(ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌)తో ఉన్నారని గుర్తించారు. అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. దీంతో అసలు కథ వెలుగు చూసింది.

* సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా? అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. ఈ అవినీతికి సంబంధింది అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

* తెలంగాణలోని దళిత, గిరిజనులను సీఎం కేసీఆర్ మోసం చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. కేసీఆర్ చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రజలందరికీ వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పార్టీ కార్యకర్తలంతా దళితులు, గిరిజనుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

* తెదేపా సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరంలోని బచ్చయ్య చౌదరి నివాసంలో ఆయనను కలిసి మాట్లాడారు. అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆవిర్భావం నుంచి గోరంట్ల పార్టీలో ఉన్నారు. ఆయన చెప్పిన విషయాలను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించాం. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని బుచ్చయ్య చెప్పారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదు’’ అని చినరాజప్ప వెల్లడించారు.

* గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో పురోగతి లభించింది. ఆరోపణల తర్వాత కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు ఒప్పకున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు విజయ్‌తో కలిసి బాధితురాలు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో ఇష్టపూర్వకంగా వెళ్లిందా? లేదా ? అనే కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ లభ్యమైంది.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ‘మా’ భవన నిర్మాణమే అజెండాగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం రంగంలోకి దిగారు. సినిమా బిడ్డల ప్యానల్‌ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌కి నిర్మాత బండ్ల గణేశ్‌ మద్దతు తెలిపిన విషయం విదితమే. కాగా, తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలు, శాశ్వత భవన నిర్మాణం గురించి బండ్ల గణేశ్‌ కొన్ని షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదన్నారు.

* తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ మొదలైంది. నిన్నటికి నిన్న తాలిబన్లపై నిరసన ప్రదర్శన చేసిన కొందరిపై కాల్పులు జరపగా.. తాజాగా నేడు దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన ర్యాలీపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు. ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే అసదాబాద్‌ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు.

* బెజవాడ నగరంలో కలకలం రేపిన కారులో మృతదేహం కేసులో పురోగతి లభించింది. మ్యానర్‌ ఫుడ్‌ ప్లాజా ఎదురు రోడ్డులో పార్కు చేసి ఉన్న కారులో మృతదేహాన్ని ఈరోజు ఉదయం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. మృతుడు జడ్‌ఎక్స్‌ఎన్‌ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన రాహుల్‌గా పోలీసులు తెలిపారు. తొలుత పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసినప్పటికీ కారులో లభ్యమైన ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా హత్యగా నిర్ధారించారు. వ్యాపార, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

* గనుల తవ్వకాలను చేపట్టేందుకు వీలుగా ప్రైవేటు ఏజెన్సీలకు గుర్తింపు (అక్రెడిటేషన్‌) ఇచ్చే ఒక పథకాన్ని తీసుకొచ్చినట్లు గనుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫ్‌ ద క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ-ఎన్‌ఏబీఈటీ) ఆయా ఏజెన్సీలకు అక్రెడిటేషన్లు ఇవ్వనుందని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. పథకంలో సూచించిన ప్రమాణాలున్న కంపెనీలకు ఈ గుర్తింపు లభిస్తుంది. ఆసక్తి ఉన్న ప్రైవేటు తవ్వక ఏజెన్సీలు పథకంలో సూచించిన విధంగా అక్రెడిటేషన్‌ పొందాలని గనుల మంత్రిత్వ శాఖ వివరించింది.

* ఎట్టకేలకు గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. పరిమిత సమయంలో స్వస్థలం బళ్లారిని సందర్శించేందుకు అవకాశం కల్పించింది. ఎన్ని రోజులు, ఎక్కడికి వెళ్తారో ఎస్పీకి చెప్పాలని సుప్రీకోర్టు ఆదేశించింది. 2015 జనవరిలో ఇచ్చిన బెయిల్‌ ఆంక్షల్లో సుప్రీంకోర్టు స్వల్ప మార్పులు చేసింది. విచారణ త్వరగా ముగించాలని హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ 3 నెలల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది.