NRI-NRT

అయిదో పెళ్లికి సిద్ధమయిన అమెరికా ప్రవాసుడు

అయిదో పెళ్లికి సిద్ధమయిన అమెరికా ప్రవాసుడు

గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం కలకలంరేపింది. అమెరికాలో ఉంటున్న వ్యక్తి సెలవులపై ఇండియా వచ్చినప్పుడల్లా ఒకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. కొద్దిరోజులు కాపురం చేసి మొహం చాటేస్తున్నాడు. ఇప్పటి వరకు నలుగుర్ని ఇలాగే మోసం చేసి ఐదో పెళ్లికి సిద్ధంకాగా.. ఈ నిత్య పెళ్లికొడుకు వ్యవహారాన్ని ఓ బాధిత యువతి బయటపెట్టారు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన కర్నాటి వీర భద్రరావు కుమారుడు కర్నాటి సతీష్ అనే వ్యక్తి అమెరికాలో సాన్ట్‌వేర్‌ ఉద్యోగి. అతడి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తారు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగమని చెబుతారు. సెలవుపై అతడు ఊరికి వచ్చిన సమయంలో ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారు. నెల రోజులు కాపురం చేశాక.. మళ్లీ వచ్చి అమెరికా తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోతాడు. ఇలా గుంటూరుకు చెందిన ఎంబీఏ చదివిన యువతితో సంబంధం కుదుర్చుకుని భారీగా కట్నం తీసుకున్నాడు. 2019లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. నెలపాటు ఇక్కడే ఆమెతో కాపురం చేశాడు. కొద్దిరోజులయ్యాక అమెరికా తీసుకెళ్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు.

వ్యక్తి నెలలు గడుస్తున్నా రాకపోగా.. ఫోన్‌ చేసినా స్పందన లేదు. అత్తమామలను అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది. అతడి గురించి ఆరా తీస్తే గతంలో కూడా ఇలాగే పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసినట్లు కేసులున్నాయని తెలిసింది. తనన నాలుగో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 24న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 26న కేసు నమోదు చేశారు. వారిని ఏప్రిల్‌లో దిశ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఐదు నెలలైనా నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గత డిసెంబరులో అతడు ఇండియాకు వచ్చి తల్లిదండ్రులను కలిసి విజయవాడకు చెందిన యువతితో ఐదో పెళ్లికి రెడీ అయ్యాడు. త్వరలో ముహూర్తాలు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం నాలుగో భార్యకు తెలియటంతో ఐదో పెళ్లివారికి చెప్పారు. దీంతో వారు పెళ్లి రద్దు చేసుకోగా.. అతడు అమెరికా వెళ్లిపోయాడు. అతడ్ని ఇండియాకు రప్పించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు. 13 ఏళ్ల కిందట విశాఖకు చెందిన యువతిని అతడు వివాహమాడి విడిచిపెట్టాడు. మూడేళ్ల తర్వాత ఆమె బంధువును పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత నరసరావుపేటకు చెందిన మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అతని నిర్వాకం గురించి తెలిసిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని పాస్‌పోర్ట్ సీజ్‌ చేశారు. ఆమెతో రాజీ చేసుకుని మళ్లీ అమెరికా వెళ్లాడు. 2019లో గుంటూరుకు చెందిన యువతిని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఐదో పెళ్లి దగ్గర వ్యవహారం ఆగిపోయింది.