Business

చిన్న పరిశ్రమలకు ఫేస్‌బుక్ రుణాలు-వాణిజ్యం

చిన్న పరిశ్రమలకు ఫేస్‌బుక్ రుణాలు-వాణిజ్యం

* బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌త ఏడాది ఆగ‌స్టులో ఏకంగా రూ.56 వేల పీక్ స్థాయిని తాకిన బంగారం ధ‌ర‌లు ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చాయి. అయితే గ‌త కొన్ని రోజులుగా ప‌సిడి ధ‌ర‌లు మ‌ళ్లీ పెంపు బాట‌ప‌ట్టాయి. రోజూ ఎంతోకొంత పెరుగుతూ దేశ రాజ‌ధాని ఢిల్లీలో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,353కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం 24 క్యార‌ట్ బంగారం ధ‌ర రూ.46,225 వ‌ద్ద ముగిసింది.

* గృహ విక్రయాలు ఈ ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో సుమారు 30 శాతం మేర పెరిగి 1.8 లక్షలకు చేరొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్‌ అనరాక్‌ వెల్లడించింది. గిరాకీ మాత్రం కొవిడ్‌ పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. అనరాక్‌ రీసెర్చ్‌ ప్రకారం, గృహ విక్రయాలు 2020తో పోలిస్తే (1,38,344) ఈ ఏడాది 30 శాతం పెరిగి 1,79,527కు చేరతాయి. 2019లో గృహ విక్రయాలు 2,61,358గా నమోదవ్వడం గమనార్హం. హైదరాబాద్, దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాల్లో గృహ విక్రయాలపై అనరాక్‌ తన అంచనాలు వెలువరించింది. 2022లో 2,64,625 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమవుతాయని, 2023లో 3,17,550కు చేరతాయని అంచనా వేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. చివర్లో ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ.. లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. ఆసియా మార్కెట్లు బేర్‌ గుప్పిట్లోకి జారుకున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో పయనించాయి. రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల షేర్లు కూడా దిగజారడంతో సూచీలపై ప్రతికూల ప్రభావం పడింది. మరోవైపు గతకొన్ని రోజుల మార్కెట్‌ ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. చివరకు సెన్సెక్స్‌ 300 పాయింట్ల నష్టంతో 55,329 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి 16,450 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద నిలిచింది.

* ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ మరొకొత్త ప్రోగ్రాంతో ముందుకొచ్చింది. తమ ప్లాట్‌ఫాంపై వాణిజ్య ప్రకటనలు ఇచ్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘ఇండిఫీ’ అనే రుణసంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సంస్థలతో చేతులు కలుపుతామని ప్రకటించింది. ఈ తరహా కార్యక్రమాన్ని భారత్‌లోనే తొలిసారి ప్రారంభించడం విశేషం. భారత్‌లో మొత్తం 200 పట్టణాల్లో రిజిస్టరయిన కంపెనీలకు ఈ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలందించనున్నట్లు సమాచారం. 17-20 శాతం వడ్డీరేటుగా నిర్ణయించారు. మహిళలకు వడ్డీరేటులో 0.2 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఫేస్‌బుక్‌ ఇండియా ఎండీ, ఉపాధ్యక్షుడు అజిత్‌ మోహన్‌ వెల్లడించారు. తద్వారా ఫేస్‌బుక్‌కి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు.