Politics

67మందిని వెంటబెట్టుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లిన వెల్లంపల్లి-తాజావార్తలు

Minister Vellampalli Goes To Tirumala Temple With 67 Others

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,678 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,217 కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతిచెందగా.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 200,1255కి చేరగా.. మరణాల సంఖ్య 13,715కి పెరిగింది. కొత్తగా మరో 1535 మంది బాధితులు వైరస్‌నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రికవరి అయినవారి సంఖ్య 19,72,399కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,141 యాక్టివ్‌ కేసులున్నాయి.

* ఈరోజు నుండి రెండు రోజుల పాటు ఇంద్రకీలాద్రి పై పవిత్రోత్సవాలు.తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్ర మాల ధారణ.ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులకు అనుమతి.23 వ తేదీన మహా పూర్ణాహుతి తో ముగియనున్న పవిత్రోత్సవాలు.పవిత్రోత్సవాల సందర్భంగా దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు.

* వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్ష్యం కావాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రణాళికా బద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ఉద్దేశంతో 19 రాజకీయ పార్టీల నేతలతో శుక్రవారం సోనియా వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, స్టాలిన్‌ వంటి కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, సీపీఐ, సీపీఎం, ఎన్సీ, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్‌, వీసీకే, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌, జేడీఎస్‌, ఆర్‌ఎల్డీ, ఆర్‌ఎస్పీ, కేరళ కాంగ్రెస్‌ (మణి), పీడీపీ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఆమ్‌ ఆద్మీ, బీఎస్పీ, ఎస్పీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ మనందరి లక్ష్యం 2024 ఎన్నికలు కావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమ విలువలు.. రాజ్యాంగ సూత్రాలు, నియమాల పట్ల విశ్వాసం ఉంచే ప్రభుత్వాన్ని దేశానికి అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఒక విధంగా ఇది సవాల్‌తో కూడుకున్నదే అని అన్నారు. ప్రత్యామ్నాయం లేని స్థితిలో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. దేశం కోసం ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేళ వ్యక్తిగతంగా, సమష్టిగా పునః పరిశీలనకు ఇదే సరైన సమయం అని చెప్పారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై ఉమ్మడిగా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, ఓబీసీ బిల్లు విషయంలో అన్ని పార్టీలు ఒక్కటి తాటిపైకి వచ్చినట్లుగానే పార్లమెంట్‌ వెలుపల కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని సోనియా పిలుపునిచ్చారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆచంట ఉమేశ్‌ ఈ ఘనత సాధించాడు. ఆగస్టు 5న రాజమహేంద్రవరం నుంచి రష్యా బయల్దేరిన ఉమేశ్‌… మధ్యప్రదేశ్‌కు చెందిన మరో పర్వతారోహకుడితో కలిసి ఆగస్టు 15న శిఖరాగ్రం చేరుకొని మువ్వన్నెల జెండా ప్రదర్శించారు. 23×33 మీటర్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించినందుకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు, గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు సాధించానని ఉమేశ్‌ వివరించారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి మూడో దశ ఉద్ధృతి దాటికి శ్రీలంక వణికిపోతోంది. వైరస్‌ ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ నియంత్రణలోకి రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది.

* ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది.

* ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న తన 67 మంది అనుచరులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదమైంది. కరోనా నేపథ్యంలో సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 67 మందితో కలిసి మంత్రి శ్రీవారిని దర్శించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఇదే విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు తప్పేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి అయినా, సామాన్య భక్తుడైనా దర్శనం టికెట్ కొనుక్కుని స్వామి వారిని దర్శించుకోవచ్చన్నారు. కరోనా తగ్గుముఖం పడితే సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. అలాగే, త్వరలోనే టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

* అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద్ సభ శనివారం గతంలో తన సొంత నియోజకవర్గమైన అంబర్‌పేటలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘దిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే. కేంద్రమంత్రి అయినందుకు నాకు సంతోషం లేదు.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తా. అంబర్‌పేట నాకు తల్లిలాంటిది. ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది. పార్టీ.. అంబర్‌పేట నాకు రెండు కళ్లతో సమానం’’ అని వ్యాఖ్యానించారు.

* దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన త్రిసభ్య కమిషన్‌ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం చేపట్టిన విచారణలో ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి రవి గుప్త హాజరయ్యారు. త్రిసభ్య కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వికాస్‌ సిర్పూర్కర్‌, జస్టిస్‌ రేఖ, జస్టిస్‌ కార్తికేయన్‌ విచారించారు. ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న తేదీ నుంచి అఫిడవిట్లు సమర్పించడం వరకు అన్ని వివరాలను రవిగుప్త కమిషన్‌కు వివరించారు. మస్తాన్‌ వలితో పాటు పలువురు న్యాయవాదులు ఎన్‌కౌంటర్‌పై తమకున్న సందేహాలను కమిషన్‌ ముందుంచారు. దీనికి హోంశాఖ కార్యదర్శి రవిగుప్త సమాధానమిచ్చారు. సాక్షులను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో కమిషన్‌ విచారించనుంది.

* తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ రూపొందించిన పోస్టల్‌ కవర్‌ విడుదలైంది. ఈ పోస్టల్‌ కవర్‌ను విశాఖ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ వెంకటేశ్వర్లు శనివారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్‌ కవర్‌ అందుబాటులో ఉండనున్నాయి. ఈ పోస్టల్‌ కవర్‌ ధర ₹20లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆత్రేయపురం పూతరేకుల తయారీపై దాదాపు 500 కుటుంబాలకు పైగా ఆధారపడి జీవిస్తున్న విషయం తెలిసిందే.