DailyDose

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి. వాలంటీర్ ఆత్మహత్య-నేరవార్తలు

ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి. వాలంటీర్ ఆత్మహత్య-నేరవార్తలు

* గుంటూరు జిల్లా సీతానగరం పుష్కర ఘాట్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయవాడలోని కృష్ణలంక ప్రాంతం రాణిగారితోటకు చెందిన షేక్‌ లాల్‌బాషా(26)గా గుర్తించారు. ఇతను వాలంటీర్‌గా విధులు నిర్వర్తించేవాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

* నకిలీ చలానాల కుంభకోణం కేసులో మరో ముగ్గురు సబ్‌ రిజిస్ట్రార్లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కృష్ణా జిల్లా మండవల్లి సబ్‌రిజిస్ట్రార్‌ సుబ్రమణ్యం, విజయవాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లు, కడప సబ్‌ రిజిస్ట్రార్‌లను అధికారులు విధుల నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో వీరితో పాటు 9 మంది సబ్‌ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినట్లయింది. సబ్‌రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌తో ఆయా కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

* మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగిఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు.

* యువ పారిశ్రామిక వేత్త రాహుల్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ను నిన్న అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించిన పోలీసులు ఇవాళ మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్‌ కోగంటి సత్యంను బెంగళూరులో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. ఈకేసులో కోరాడ విజయ్‌కుమార్‌ ఏ1, అతడి భార్య పద్మజ ఏ2, మరో మహిళ గాయత్రి ఏ3, కోగంటి సత్యం నాలుగో నిందితుడిగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.

* కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొండపల్లిలోని శాంతినగర్‌లో ఆరేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ కొనుక్కొనేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపి పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో అస్వస్థతకు గురైన బాలుడు.. కొంతసేపటికి తేరుకొని ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.