NRI-NRT

ఘనంగా కాన్సస్ తెలుగు సంఘం రజతోత్సవం

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటీ (TAGKC) రజతోత్సవ వేడుకలు శనివారం నాడు స్థానిక ఓలాతే బాల్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ శ్రీకాంత్‌ రావికంటి ప్రారంభోపన్యాసం చేశారు. సంస్థకు 25 ఏళ్లుగా సేవలందించిన అధ్యక్షులు, ట్రస్ట్‌ బోర్డు ఛైర్‌పర్సన్లు, వారి జీవిత భాగస్వాములను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు. 35 ఏళ్లుగా స్థానిక తెలుగు వారికి, సంఘానికి సేవలందిస్తున్న లక్ష్మీ నాయుడును జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గాయకులు పాటలతో అలరించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ టేకులపల్లి సంఘం చేసిన సాహితీ, సేవా కార్యక్రమాల గురించి వివరించారు.