Politics

హుజూరాబాద్ సురేఖకేనా?-తాజావార్తలు

హుజూరాబాద్ సురేఖకేనా?-తాజావార్తలు

* నగరంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి హబ్‌’ను మంత్రులు కేటీఆర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘ఇన్నోవేషన్‌ ఎవరి సొత్తు కాదు. ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించండి. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలి. 2,601 రైతు వేదికలను టి-ఫైబర్‌ ద్వారా అనుసంధానం చేస్తాం. వర్సిటీలో పరిశోధనలు పెరగాలి. అగ్రిహబ్‌లో తెలుగుకు పెద్దపీట వేయాలి. సిరిసిల్ల ప్రాంతంలో 6 మి.మీ. భూగర్భ జలం పెరగడంపై ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారు.

* గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో టీపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ భేటీ అయ్యారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక, గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహణపై సమావేశంలో చర్చిస్తున్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం ఇప్పటికే కొండా సురేఖ, సదానంద, కృష్ణారెడ్డి పేర్లతో ఎన్నికల నిర్వహణ కమిటీ మాణికం ఠాగూర్‌కు జాబితా అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు పేర్లపై నేతల అభిప్రాయాన్ని ఆయన సేకరిస్తున్నారు. సమావేశంలో కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మెజారిటీ నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం. సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాన్ని క్రోడీకరించి తుది జాబితాను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి మాణికం ఠాగూర్‌ అందజేయనున్నారు. ఈ సమావేశం తర్వాత హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశముంది.

* పారాలింపిక్స్‌ పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్‌-52 విభాగంలో ఆదివారం వినోద్‌ కుమార్‌ మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతడికి పతకం దక్కలేదు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పోటీల్లో వినోద్‌ 19.91 మీటర్ల దూరం డిస్క్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే పోలెండ్‌ అథ్లెట్‌ పయిటర్‌ కోస్‌విజ్‌ 20.02 మీటర్లతో స్వర్ణం గెలుపొందగా క్రొయేషియాకు చెందిన వెలిమిర్‌ సాండోర్‌ 19.98 మీటర్లతో రజతం సాధించాడు. అయితే, వినోద్‌ ఈ పోటీలకు అర్హుడు కాదని ఇతర అథ్లెట్లు ఫిర్యాదు చేయడంతో నిర్వాహకులు ఫలితాలను నిలిపివేశారు. వినోద్‌ వర్గీకరణ ప్రక్రియను సమీక్షించి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

* కరోనా వైరస్‌ సృష్టించిన విలయం ఎన్నో జీవితాలను నాశనం చేసిందని భారత అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారికి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి హృదయం విదారకరంగా ఉందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చిన్నారులను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తూనే.. ఉచిత వసతి, విద్య వంటి ప్రయోజనాలను వారికి అందించే చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాలకు సూచించింది.

* తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో సీపీఎం సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికారులు బహిరంగంగా చెబుతున్నా.. దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని నిలదీశారు.

* హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంత‌రం తీర్మాన ప్ర‌తిని సింగ‌పూర్ లోని గెస్ట్‌హౌజ్‌లో మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు అందజేశారు.

* తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌ల్దేర‌నున్నారు. 2వ తేదీన మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి కేసీఆర్ భూమి పూజ చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు, పార్టీ నాయ‌కులు పాల్గొన‌నున్నారు. సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు సీఎం కేసీఆర్ తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు. ఢిల్లీలోని వ‌సంత్ విహారం మెట్రో స్టేష‌న్ ప‌క్క‌న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణం కోసం 1300 గ‌జాల స్థ‌లాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించిన సంగ‌తి తెలిసిందే.