Business

హైదరాబాద్ వాసులపై పెరగనున్న ఆస్తిపన్ను

హైదరాబాద్ వాసులపై పెరగనున్న ఆస్తిపన్ను

రాజధానిలో ఆస్తిపన్నుకు రెక్కలు రాబోతున్నాయి. ఇంటి అద్దెను ప్రాతిపదికగా తీసుకుని పన్ను విలువను నిర్ధరించే ప్రస్తుత విధానానికి స్వస్తి పలికి.. భూమి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పన్ను నిర్ధరించే కొత్త విధానం అమల్లోకి రానుంది. ఆమేరకు సర్కారు అనుమతి కోరుతూ బల్దియా లేఖ రాసింది. త్వరలో ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని పురపాలకశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై సర్కారు గతేడాది డిసెంబరులోనే స్థానిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. కొత్త విధానంతో జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.500 కోట్ల మేర పెరగొచ్చని అంచనా. అభివృద్ధి పనులు వేగంగా జరిగేందుకు, మౌలిక సౌకర్యాల విస్తరణకు ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు అడ్డుకట్ట పడనుందని అధికార యంత్రాంగం భావిస్తోంది.

ప్రస్తుత చట్టం ప్రకారం.. నగరంలోని ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ ఏ, బీ, సీ, డీ అనే 4 విభాగాలుగా విభజించింది. వాటి ద్వారా 3 నెలల ఇంటి అద్దెను ప్రామాణికంగా తీసుకుని ఆస్తిపన్నును గణిస్తున్నారు. దానివల్ల ప్రధాన రహదారులు, వాణిజ్య రహదారులు, కాలనీలు, బస్తీల్లో వేర్వేరుగా పన్ను నిర్ధరణ అవుతుంది. చట్ట ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పెంపు జరగాలి. కానీ వేర్వేరు కారణాలతో 15 ఏళ్లుగా పెరగలేదు. కొత్త విధానానికి జీహెచ్‌ఎంసీ మూడేళ్ల కిందటే బీజం వేసింది. దీనిపై మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అప్పట్లో సర్కారుకు సిఫార్సు చేశారు.

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 20 లక్షల నిర్మాణాలున్నాయి. పన్ను పరిధిలో ఉన్నవి 17 లక్షలే. వాటి నుంచి గత ఆర్థిక సంవత్సరం రూ.1,700 కోట్ల పన్ను వసూలైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.1,850 కోట్లు పొందాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఆస్తిపన్ను విధానంతో ఆదాయాన్ని రూ.2,350 కోట్లకు పెంచుకోవాలనేది జీహెచ్‌ఎంసీ ఆలోచన. అదే జరిగితే శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌ జోన్లు, ఇతర జోన్లలోని కొన్ని ప్రాంతాల్లో పన్ను పెరగనుంది. అయితే నూతన విధానంతో పేద, మధ్యతరగతి, సంపన్నులు నివసించే ప్రాంతాల ఆస్తిపన్నులో వ్యత్యాసాలు లేకుండా పోతాయనే విమర్శలూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ విలువ, ఇంటి విస్తీర్ణాన్ని లెక్కగడితే బస్తీలు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు తేడా ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నివాస, నివాసేతర, సంస్థల విషయంలో విభాగాలను రూపొందించి, రిజిస్ట్రేషన్‌ విలువలో ఏ ప్రాంతానికి ఎంత శాతం పన్ను నిర్ధరిస్తారో ముందే తెలపాలని పౌరులు కోరుతున్నారు.