WorldWonders

ACP వేళ్లు నరికిన వ్యాపారులు-నేరవార్తలు

ACP వేళ్లు నరికిన వ్యాపారులు-నేరవార్తలు

* మహారాష్ట్రలోని ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని.. ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా దుకాణాలు ఏర్పరుచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా అక్కడ ఘర్షణ తలెత్తింది.ఈ క్రమంలో ఏసీపీపై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ కత్తితో దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీతోపాటు ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి కేసులో నిందితుడు అమర్జీత్​​ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ పేర్కొన్నారు.

* వరంగల్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని హతమార్చాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. వరంగల్‌ ఏసీపీ కల్కోట గిరికుమార్‌ ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ ఎల్బీ నగర్‌లో మహమ్మద్‌ చాంద్‌పాషా తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయనకు తన తమ్ముడు షఫీతో ఏడాదిగా పశువుల వ్యాపారం లావాదేవీల్లో వివాదం నడుస్తోంది. సుమారు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం చాంద్‌పాషా ఇంటిలోనే ఆయన కుటుంబంపై దాడి చేశాడు.

* తన భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేశారని ఆరోపిస్తూ ఓ మహళా రైతు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేట జిల్లా కొండపాక తహసీల్దారు కార్యాలయంలో ఆందోళనకు దిగారు. పెట్రోల్‌ పోసి కార్యాలయాన్ని తగలబెట్టేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళితే.. కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మి అనే మహిళకు ఆరెపల్లెలో 22 ఎకరాల భూమి ఉంది. అయితే, ఆ భూమిని ఇతరుల పేరుమీద మార్చారని ఆరోపిస్తూ బుధవారం ఆందోళన చేపట్టింది. భర్త యాదగిరి, కుమారుడు భానుతో కలిసి వచ్చిన ఆమె… పెట్రోల్‌ పోసి తహసీల్దారు కార్యాలయాన్ని తగలబెట్టేందుకు యత్నించారు. గమనించిన తహసీల్దారు రామేశ్వర్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో కుకునూరుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళను అడ్డుకున్నారు. భూ వివాదంపై కోర్టుకు వెళ్లాలని మహిళకు తహసీల్దారు సూచించారు. ఇకపై ఇక్కడ ఆందోళనకు చేయవద్దంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది.

* వరుసబెట్టి బ్యాంకుల్ని లూటీ చేస్తున్న సైబర్‌ ముఠా పోలీసులకు సవాలు విసురుతోంది. నెల రోజుల వ్యవధిలోనే రెండు బ్యాంకుల నుంచి రూ.7 కోట్లు కొల్లగొట్టింది ఒకే ముఠా అని నిర్ధారణ అయినా అంతకు మించి వివరాలు తెలుసుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడంలేదు. ఈ ముఠా మరికొన్ని బ్యాంకులపైనా కన్నేసి ఉంటుందన్న అంచనాలు ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. రిమోట్‌ యాక్సెస్‌ టూల్‌(ర్యాట్‌) ద్వారా బ్యాంకుల సర్వర్‌లోకి చొరబడి డబ్బు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు పోలీసులను ఏమార్చేందుకు ఆ సొమ్మును వేర్వేరు వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించారు. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.

❉ జులైలో తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.1.96 కోట్లను కొల్లగొట్టారు. ఆ సొమ్మును తొలుత మూడు ఖాతాల్లోకి మళ్లించారు. వాటి నుంచి రూ.1.94 కోట్లను సికింద్రాబాద్‌ చిరునామాతో ఉన్న ఓ మహిళ ఖాతాలోకి, అక్కడి నుంచి పది వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. డబ్బు పోయిన విషయంపై బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో శేరిలింగంపల్లికి చెందిన ఇద్దర్ని అరెస్టు చేసినప్పటికీ దోచుకున్న డబ్బు జమ చేసేందుకే వీరి ఖాతాలను వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నేరగాళ్లు తొలుత ర్యాట్‌ ద్వారా బ్యాంకు ఉద్యోగి నెట్‌వర్క్‌లోకి, అక్కడినుంచి బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఈ దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది.

❉ దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే ముంబయిలోని ఓ బహుళజాతి బ్యాంకులో రూ.5 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో హైదరాబాద్‌ బ్రాంచికి చెందిన ఓ ఖాతాదారుకి సంబంధించి రూ 1.2 కోట్లు ఉన్నాయి. అయితే బ్యాంకు అధికారులు ఈ డబ్బును ఖాతాదారుకి చెల్లించి ముంబయిలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు.. కొల్లగొట్టిన డబ్బు జమ అయిన దిల్లీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేయగా ఆయనకు ఈ నేరంతో సంబంధం లేదని వెల్లడైంది. ఇక్కడ కూడా సైబర్‌ ముఠా ర్యాట్‌ ద్వారా బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఎంపిక చేసిన ఖాతాదారులకు ఓటీపీ వచ్చే ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ ఐడీలను మార్చారు. అనంతరం వారి ఖాతాల్లోని డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

❉ దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు బ్యాంకుల్లోనూ డబ్బు కొల్లగొట్టింది ఒకటే ముఠా అని, ఈ ముఠా గతంలో బంగ్లాదేశ్‌లోని ఫెడరల్‌ బ్యాంకులోనూ ఇదే తరహాలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసుల్లో డబ్బు జమ అయిన ఖాతాదారులను పట్టుకోగలిగినా దర్యాప్తు అంతకు మించి ముందుకు సాగడంలేదు.

❉ ఉదాహరణకు హైదరాబాద్‌ కేసులో తొలుత బ్యాంకు డబ్బు ఇద్దరు అన్నదమ్ముల ఖాతాలోకి మళ్లించారు. అక్కడ నుంచి సికింద్రాబాద్‌ చిరునామాతో ఉన్న యువతి ఖాతాలోకి మళ్లించారు. ఈ యువతి ఖాతా తెరిచేటప్పుడు ఇచ్చిన చిరునామా, ఆధార్‌కార్డు నకిలీదని తేలింది. దాంతో ఈ యువతి ఎవరన్నది తెలుసుకోవడం సాధ్యం కావడంలేదు. ముంబయి కేసులోనూ ఇదే పరిస్థితి.

❉ కేవలం డబ్బు జమ అయిన ఖాతాదారులను పట్టుకున్నప్పటికీ వారు తమ ఖాతాల్లో పడ్డ డబ్బును డ్రా చేసి వేరేవాళ్లకి ఇచ్చామని, వారెవరో తమకు తెలియదని చెబుతున్నారు. దాంతో అసలు నిందితులు మాత్రం పట్టుబడటంలేదు. ఈ నేపథ్యంలో.. బ్యాంకుల్లోకి చొరబడి డబ్బు కొల్లగొడుతున్న ముఠాను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. అయినా ఆ ముఠా గుట్టు రట్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

* ఇంటి పనుల్లో సాయపడేందుకు భూస్వామి కుటుంబంతో పాటు వెళ్లిన 13 ఏళ్ల దళిత బాలిక.. అత్యాచారం, హత్యకు గురైంది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకొచ్చి, వెంటనే అంత్యక్రియలు చేయాలంటూ బాలిక తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేశారు. గురుగ్రామ్‌లో గత నెలలో జరిగిన ఈ ఘటన శవపరీక్ష నివేదిక అనంతరం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన ఓ దళిత కుటుంబం ఉత్తర దిల్లీకి వలసవచ్చి నరేలా ప్రాంతంలో ఉంటోంది. ఇక్కడున్న భూస్వామి వద్ద రెండేళ్లుగా భార్యాభర్తలు పనిచేస్తూ తమ నలుగురు పిల్లల్ని పోషిస్తున్నారు. ఇందులో 7వ తరగతి చదివే పెద్దమ్మాయి(13) తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. గురుగ్రామ్‌లోని తమ బంధువుల ఇంట ప్రసవం జరిగిందని, వారికి సాయంగా ఉండాలంటూ జులై 17న భూస్వామి కుటుంబీకులు.. ఆ బాలికను తీసుకెళ్లారు. ఆగస్టు 23న మీ అమ్మాయి చనిపోయిందని, అదే రోజు రాత్రి మృతదేహాన్ని అంబులెన్స్‌లో నరేలాలోని వారి ఇంటికి తీసుకొచ్చారు. అనుమానం వచ్చిన బాలిక తండ్రి పోలీసులకు ఆశ్రయించాడు. తన కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశాడు. శవపరీక్షలో అత్యాచారం జరిగినట్టు తేలడంతో తాజాగా కేసులో మరిన్ని సెక్షన్లు జోడించారు. అంత్యక్రియలు చేయాలంటూ ఆ రోజు ఒత్తిడి చేసిన భూస్వామి బావమరిది ప్రవీణ్‌ వర్మను అరెస్టు చేశారు. భూస్వామి, అతని భార్య పరారీలో ఉన్నారు.

* కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక (16) మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి సమయంలో ముళ్ల పొదల్లో శిశువును వదిలేసి సమీపంలోని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల సమాచారంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఐసీడీఎస్‌ అధికారులు.. ముళ్లపొదల్లో ఉన్న శిశువును రక్షించి అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బావి నుంచి మైనర్‌ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆత్మహత్య నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పెళ్లికాకుండానే తల్లి కావడంతోనే మనస్తాపంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

* విజయవాడ: నగరంలోని పాతబస్తీ వించిపేటలో ఇమ్రాన్‌ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి స్థానికంగా నివాసముండే జాఫర్‌తో ఇమ్రాన్‌ గొడవ పడినట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. మృతుడిపై గతంలో దోపిడీ కేసులు ఉన్నాయని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

* మాదక ద్రవ్యాల వ్యవహారం కర్ణాటకను కుదిపేస్తోంది. ఇదివరకే కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్టు కాగా.. ఇప్పుడు ప్రముఖ మోడల్​ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో నటి, మోడల్​, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్​, మరో వ్యాపారవేత్త భరత్​, డీజే వచన్​ చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్​ బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిని పోలీసులు విచారిస్తున్నారు. వీరందరికీ నైజీరియా డ్రగ్స్​ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సినీ రంగానికి చెందిన చాలా మందికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.