ScienceAndTech

ఇండియాలో టెస్లా శాటిలైట్ ఇంటర్నెట్-వాణిజ్యం

ఇండియాలో టెస్లా శాటిలైట్ ఇంటర్నెట్-వాణిజ్యం

* ప్రముఖ టెలికామ్ దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో రికార్డు సాధించింది. భారత దేశంలో 5జీ టెక్నాలజీ సహాయంతో మొట్ట మొదటి క్లౌడ్ గేమింగ్ సెషన్ విజయవంతంగా నిర్వహించినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్(డీఓటీ) కేటాయించిన స్పెక్ట్రమ్ 5జీ ట్రయల్స్ లో భాగంగా మనేసర్(గుర్గావ్)లో ఈ ప్రదర్శన నిర్వహించారు. గేమర్లు డెమో కోసం వన్ ప్లస్ 9ఆర్ మొబైల్ ఉపయోగించారు. ముఖ్యంగా, ఎయిర్‌టెల్‌ సీటీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 5జీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. “వచ్చే ఏడాది మొదట్లో 5జీ రావచ్చు” అని ఆయన అన్నారు. ఎయిర్‌టెల్ నిర్వహించిన 5జీ క్లౌడ్ గేమింగ్ సమావేశంలో భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ గేమర్లు మోర్టల్(నమన్ మాథుర్), మాంబా(సల్మాన్ అహ్మద్)లు పాల్గొన్నారు. “ఈ స్మార్ట్ ఫోన్లో హై ఎండ్ పీసీ, కన్సోల్ క్వాలిటీ గేమింగ్ ఆడిన అనుభవం కలిగింది. 5జీ నిజంగా భారతదేశంలో ఆన్ లైన్ గేమింగ్ ను అన్ లాక్ చేస్తుందని” అని గేమర్స్ అన్నారు. వీరు గేమ్ ఆడే సమయంలో 3500 మెగాహెర్ట్జ్ అధిక సామర్థ్యం కలిగిన స్పెక్ట్రమ్ బ్యాండ్ కు కనెక్ట్ అయినట్లు సంస్థ తెలిపింది. గేమింగ్ ప్రియులు హై ఎండ్ గేమ్స్ ఆడాలంటే ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ క్లౌడ్ గేమింగ్ ద్వారా రియల్ టైమ్ లో గేమ్స్ స్ట్రీమ్ చేయవచ్చు.

* దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తమ జోరును కొనసాగించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ‎ఐటీ, ఎఫ్ఎంసిజి, సీమెంట్ షేర్ల అండతో బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. చివరకు, సెన్సెక్స్ 514.33 పాయింట్లు (0.90%) పెరిగి 57852.54 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 157.90 పాయింట్లు (0.92%) లాభపడి 17234.20 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.05 వద్ద నిలిచింది.‎

* సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువస్తుంది. అందులో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. పెట్టుబడిదారులు తమ రిటైర్ మెంట్ లేదా వృద్ధాప్యం కొరకు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇది ఉతమమైన పాలసీ. ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు డెత్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఎఐ) ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేల పెట్టుబడిదారుడు మరణించినట్లయితే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తర్వాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లయితే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.

* భారత్‌ కార్ల మార్కెట్‌ పై కన్నేసిన టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ‘స్టార్‌ లింక్‌’ శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సేవల్ని భారత్‌కు విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం Department of Telecommunications అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ట్విటర్‌ ఇంటరాక్షన్‌లో భాగంగా ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు.. స్టార్‌ లింక్‌ సేవలు భారత్‌కు విస్తరిస్తామని సమాధానం వచ్చింది మస్క్‌ నుంచి. అదే జరిగితే భారత్‌లో ఇంటర్‌ నెట్‌కు వినియోగించే సెల్‌ఫోన్‌ టవర్లు, కేబుళ్లతో పాటు శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ వినియోగదారులకు అందనుంది. ఇందుకోసం ఇంటిమీద చిన్న యాంటెన్నాతో ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోవచ్చు.

* టెక్‌ వరల్డ్‌లో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఆపిల్‌ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టబోతుంది. భూమి నుంచి 500 కి.మీ ఎత్తులో ఉండే ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’ సాయంతో సిమ్‌ లేకుండా వాయిస్‌ కాల్‌, బ్రౌజింగ్‌.. పోయిన వస్తువుల్ని గుర్తించేందుకు ఎయిర్‌ ట్యాగ్స్‌, గేమ్‌ లవర్స్‌ గేమ్‌ ఆడి సమయంలో ఢీలా పడిపోకుండా యాక్టీవ్‌గా ఉండేలా వైర్‌ లెస్‌ ఇయర్‌ పాడ్‌ ఇలా కొత్త కొత్త టెక్నాలజీలను ఆపిల్‌ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకేసింది. జ్వరాన్ని గుర్తించేందుకు ఉపయోగించే థర్మా మీటర్‌ వాచ్‌లను (గడియారాలను) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

* ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకుంది. బాసెల్‌ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్‌-1 బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు బ్యాంక్‌ పేర్కొంది. ఈ ఏటీ-1 బాండ్లకు 7.72 శాతం కూపన్‌ రేటును ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ.1,000 కోట్ల బేస్‌తో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్‌ కనిపించినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్స్‌ లభించినట్లు వెల్లడించింది.