Movies

ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌లో అనసూయ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్‌ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్యానెల్‌లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. ‘‘ఇండస్ట్రీకి సేవ చేయాలనే వచ్చా. సినీ పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. మాకు అవకాశం ఇస్తే అది చేసి చూపిస్తాం. గతంలో కొందరు సభ్యులతో విలేకరుల ముందుకు వచ్చా. వారు ప్యానెల్‌ సభ్యులు కాదు. కేవలం నా శ్రేయోభిలాషులు మాత్రమే. ఇప్పుడు ‘మా’ ప్యానెల్‌ను ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకూ సమాన అవకాశం ఇస్తున్నాం. అందరూ హేమ, జీవితా రాజశేఖర్‌ అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావించారు. ఈ విషయమై హేమతో నేను మాట్లాడా. ‘మనందరం కలిసి ఉండాలి మీరేమంటారు’ అని అడిగాం. ‘నేను ప్రెసిడెంట్‌గా పోటీ చేయను. మీ ఆలోచనలు నాకు నచ్చాయి. మీ ప్యానెల్‌లో పోటీ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని హేమ చెప్పారు. ఆమె చాలా ధైర్యవంతురాలు. గతంలో పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే మా ప్యానెల్‌లో తీసుకున్నాం. ఇక జీవితా రాజశేఖర్‌ కూడా అధ్యక్ష బరిలో ఉంటారని అనుకున్నారు. ఆమెతో రెండు గంటలకు పైగా మాట్లాడా. మా కార్యచరణను ఆమె ముందు ఉంచాను. ఆ విషయాలన్నీ ఆమెకు నచ్చాయి. దీంతో నా ప్యానెల్‌లో పోటీ చేయడానికి ఒప్పుకొన్నారు. రాజశేఖర్‌ కూడా ఇందుకు మద్దతు ఇస్తానని అన్నారు’’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు. తాము పోటీ చేస్తే బాగా పనిచేసేవారికి అవకాశం లేకుండా పోతుందని సినీ నటులు సాయికుమార్‌, బండ్ల గణేశ్‌ తనతో చెప్పినట్లు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. అందుకే వారిని అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్లు వివరించారు. సాయికుమార్‌, బండ్లగణేశ్‌, సన, శ్రీరామ్‌ ఏడిద వీరంతా తమకు తోడుగా ఉంటామన్నారని వివరించారు. త్వరలోనే అందరితోనూ కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. తమ ప్యానెల్‌ ఎజెండా ఏంటి? ఏయేం పనులు చేస్తాం? అన్నీ అప్పుడు వివరిస్తానన్నారు. ‘మా’ ప్యానెల్‌కు సంబంధించిన ఏది చెప్పాలన్నా తికమక లేకుండా కేవలం అధికార ప్రతినిధులే మాట్లాడతారని ప్రకాశ్‌రాజ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

*** మెయిన్‌ ప్యానెల్‌ సభ్యులు
* అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్‌
* ట్రెజరర్‌-నాగినీడు
* జాయింట్‌ సెక్రటరీ: అనితా చౌదరి
* జాయింట్‌ సెక్రటరీ: ఉత్తేజ్‌
* ఉపాధ్యక్షుడు: బెనర్జీ
* ఉపాధ్యక్షురాలు- హేమ
* ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌- శ్రీకాంత్‌
* జనరల్‌ సెక్రటరీ- జీవితా రాజశేఖర్‌

*** ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో ఈసీ మెంబర్స్‌ (ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు)
* అనసూయ (వ్యాఖ్యాత, నటి)
* అజయ్‌
* బి.భూపాల్
* బ్రహ్మాజీ
* బుల్లితెర నటుడు ప్రభాకర్‌
* గోవిందరావు
* ఖయ్యూం
* కౌశిక్‌
* ప్రగతి
* రమణారెడ్డి
* శివారెడ్డి
* సమీర్‌
* సుడిగాలి సుధీర్‌
* డి.సుబ్బరాజు
* సురేశ్‌ కొండేటి
* తనీశ్‌
* టార్జాన్‌