Videos

భీమ్లా నాయక్ పాటపై హైదరాబాద్ డీసీపీ అభ్యంతరం-తాజావార్తలు

భీమ్లా నాయక్ పాటపై హైదరాబాద్ డీసీపీ అభ్యంతరం-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 64,739 పరీక్షలు నిర్వహించగా.. 1,520 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,18,200 మంది వైరస్‌ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌ మహమ్మారి బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,887కి చేరింది. 1,290 మంది బాధితులు కోలుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,89,391కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,922 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,68,09,774 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

* కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇచ్చినప్పటికీ పరిహారం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, అవి రూపొందించే నాటికి మూడో వేవ్‌ కూడా ముగుస్తుందేమోననే అభిప్రాయం వ్యక్తం చేసింది.

* పవన్ భీంలా నాయక్ పాటపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల గురించి ఈ పాటలో వివరించిన తీరు బాగాలేదని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డి.సి.పి. రమేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘మేం (తెలంగాణ పోలీసులు) ఫ్రెండ్లీ పోలీసులం. ప్రజలకి రక్షణ కల్పించేందుకు జీతాలు తీసుకునే మేం వారి ఎముకల్ని విరగ్గొట్టం. పోలీసుల గొప్పతనాన్ని చెప్పేందుకు రచయిత రామజోగయ్యశాస్త్రికి తెలుగులో ఇంతకన్నా మంచి పదాలు దొరకలేదేమో! ఈ పాటలో పోలీసుల సేవల గురించి తెలుపలేదు’ అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ‘అది సినిమా సర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

* తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పనితీరును ప్రశంసిస్తూ పవన్‌ కల్యాణ్‌ చేసిన ట్వీట్‌, ప్రముఖ నటుడు చిరంజీవి, స్టాలిన్‌ భేటీపై ఆ రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ తన ప్రసంగంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్‌ ట్వీట్‌ను తమిళనాడు మంత్రి తెలుగులో చదివి వినిపించడం విశేషం. తోటి సభ్యులకు అర్థమయ్యేలా ఈ ట్వీట్‌ను తెలుగులో చదువుతూ తమిళంలో తర్జుమా చేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ ఇటీవల పవన్‌ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు.

* పంజాగుట్ట పీఎస్‌ పరిధిలో బంగారు ఆభరణాల చోరీ కేసును హైదరాబాద్‌ పోలీసులు వేగంగా ఛేదించారు. ముంబయికి చెందిన నగలవ్యాపారి నుంచి రెండు కిలోల బంగారు నగలు దోచేసింది ఆయన కింద పనిచేసే ఉద్యోగే అని దర్యాప్తులో నిగ్గు తేల్చారు. ఈమేరకు బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్, వెస్ట్‌ జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాసరావుతో కలిసి చోరీ వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి చెందిన నగల వ్యాపారి శ్రవణ్‌ కుమార్‌ (రనూజ జ్యువెలర్స్‌ యజమాని) హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటారు. శ్రవణ్‌ కింద ఉద్యోగులుగా పనిచేసే ముకేష్‌, గులాబ్‌ మాలి ఇద్దరూ గత నెల 23న 3336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లోని పలు షాపులకు డెలివరీ ఇచ్చేందుకు ముంబైలో బస్సెక్కారు. గోల్డ్‌ ట్రేడింగ్‌ , విలాసాలకు అలవాటు పడిన గులాబ్‌ మాలి అనే ఉద్యోగి.. అతని స్నేహితుడు ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి బంగారాన్ని పక్కదోవ పట్టించేందుకు పథకం పన్నాడు.

* మాన్సాస్‌ ట్రస్ట్‌లో చాలా అవినీతి జరిగిందని.. దీనిపై తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో జరిగిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని చెప్పారు. దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ ఆక్రమణలు ఎవరు చేశారో విచారణలో బయటపడుతుందన్నారు.

* శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇవాళ కూడా అక్రమ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న దాదాపు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ కిలో బంగారం పట్టుకున్నారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు అక్రమంగా బంగారం తీసుకొస్తున్నట్టు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకుని లగేజీ తనిఖీ చేయగా.. పేస్టు రూపంలో ఉన్న కిలో బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.43.55లక్షలు ఉంటుందని అధికారులు అంచనావేశారు.

* దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. గతేడాది డిసెంబరులో ప్రధానితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. అకాల వర్షాల వల్ల హైదరాబాద్‌లో దెబ్బతిన్న రహదారులు, మౌలికవసతుల కల్పనకు అవసరమై ఆర్థిక సాయం అందించాలని అప్పట్లో సీఎం కేసీఆర్ కోరారు. ఆ తర్వాత ప్రధానితో కేసీఆర్‌ ఇప్పటి వరకు భేటీ కాలేదు.

* భాజపా ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఛత్తీస్‌గఢ్‌ భాజపా వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న పురందేశ్వరి జగదల్‌పుర్‌లో పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘చింతన్‌ శివిర్‌’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపా కార్యకర్తలు ఉమ్మితే.. బఘేల్, ఆయన మంత్రివర్గం కొట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. 2023లో భాజపాను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్‌ మండిపడింది. బఘేల్‌ స్పందిస్తూ ఆకాశంపై ఎవరైనా ఉమ్మితే అది వారి ముఖంపైనే పడుతుందన్నారు. పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నారని, భాజపాలోకి చేరాక ఆమె మానసిక స్థితి దిగజారిపోయిందని పేర్కొన్నారు.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు, నటుడు నరేశ్‌ వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో తన తోటి నటీనటులకు ఆయన పార్టీ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించిన ఓ మెస్సేజ్‌ వైరల్‌గా మారింది. నగరంలోని దసపల్లా ఫోరమ్‌ హాల్‌లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి పార్టీ జరగనుందని.. ఈ మేరకు శుక్రవారం అందరికీ ఆహ్వానం అందుతుందంటూ నరేశ్‌ విజయ కృష్ణ పేరుతో ఓ వాట్సాప్‌ మెస్సేజ్‌ పెట్టారు.