Devotional

రేపటి నుండి తితిదే సర్వదర్శనాలు ప్రారంభం-తాజావార్తలు

TTD To Start Sarvadarshanam From Sep 08 2021

* తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో ఈ అగరబత్తులు తీసుకొస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. సెప్టెంబ‌రు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.

* అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం .. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు . నడుచుకుంటూ కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి . ఒకటి అలిపిరి మెట్లు మార్గం … మరొకటి శ్రీవారి మెట్టు మార్గం … అయితే ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు . అయితే మరమ్మతులు , ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు మూసివేశారు .

* 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువు.రూపు దిద్దుకున్న పంచముఖ రుద్రగణపతి.10న నవరాత్రులు ప్రారంభం.. 19న నిమజ్జనం.హైదరాబాదులోని ఖైరతాబాద్‌ గణేశుడు సిద్ధమయ్యాడు. వినాయక చవితికి ఐదు రోజుల ముందే పూర్తయిన పంచముఖ రుద్రగణపతిని చూసేందుకు భక్తులు అప్పుడే క్యూకడుతున్నారు. గతేడాది కరోనా కారణంగా 11 అడుగుల విగ్రహానికే పరిమితమైన నిర్వాహకులు ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని తీర్చిదిద్దారు.ఖైరతాబాద్‌లో వినాయకుడిని ఏర్పాటు చేయడం ప్రారంభించి 65 ఏళ్లు నిండిన సందర్భంగా రెండేళ్ల క్రితం 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10 గణేశ్ నవరాత్రులు ప్రారంభం కానుండగా, 19న నిమజ్జనం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

* బ్రాహ్మ‌ణ స‌మాజాన్ని కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసిన‌ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్ బ‌ఘేల్ తండ్రి నంద‌కుమార్ బ‌ఘేల్‌ను ఆ రాష్ట్ర‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను రాయ్‌పూర్ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా కోర్టు ఆయ‌నకు 15 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన నంద‌కుమార్ బ‌ఘేల్ బ్రాహ్మ‌ణుల‌ను దేశ బ‌హిష్క‌ర‌ణ చేయాల‌న్నారు. బ్రాహ్మ‌ణుల‌ను గంగా న‌ది నుంచి ఓల్గా న‌దికి పంపించాలి. వాళ్లు విదేశీయులు. వాళ్లు మ‌న‌ల‌ను అంట‌రాని వాళ్లుగా ప‌రిగ‌ణిస్తున్నారు. మ‌న హ‌క్కుల‌ను లాగేసుకుంటున్నారు. బ్రాహ్మ‌ణులు ఎవ‌రినీ గ్రామాల్లోకి అడుగుపెట్ట‌నివ్వ వ‌ద్ద‌ని నేను గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను కోరతా అని నంద‌కుమార్ బ‌ఘేల్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఘ‌ట‌నపై ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం భూపేశ్ బ‌ఘేల్ మాట్లాడుతూ.. చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌న్నారు. ఒక కొడుకుగా నేను ఆయ‌న‌ను గౌర‌విస్తాన‌ని, కానీ ఒక ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్య‌ల‌ను స‌హించ‌బోన‌ని బ‌ఘేల్‌ వ్యాఖ్యానించారు. త‌న ప్ర‌భుత్వంలో సామాన్యుడైనా, ముఖ్య‌మంత్రి తండ్రి అయినా చ‌ట్టానికి అతీతులుకార‌ని ఆయ‌న చెప్పారు.

* కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. రోజుకు 2వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించన్నట్లు తితిదే స్పష్టం చేసింది.

* తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస పార్టీపై విపక్షాల విమర్శలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించేది లేదని.. దీటుగా తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. కొంతమంది నేతల మాటలు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా కేసీఆర్ ముందు వ్యవహరిస్తున్నారని విపక్షాలపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పేరుకు దిల్లీ పార్టీలైనా…సిల్లీ పనులు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ భాజపా ఉండేవే కావన్నారు. అన్ని పార్టీలు, నాయకుల చరిత్రలు ప్రజలకు తెలుసునన్నారు. జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ తెరాస విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, గ్రేటర్ హైదరాబాద్ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

* ఐటీ కంపెనీలు ప్రస్తుతం అనుసరిస్తున్న ఇంటి వద్ద నుంచే పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) విధానానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం కన్పిస్తోంది. కొవిడ్‌-19 టీకాలు వేసే కార్యక్రమం వేగవంతం అవ్వడం, కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉంటుండటం ఇందుకు కారణాలు. ఈ ఏడాది చివరికల్లా లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తన 5,00,000 మంది ఉద్యోగుల్లో 70-80% మందిని కార్యాలయాలకు రప్పించే యోచనలో ఉన్నట్లు ఆ సంస్థ సీఈఓ రాజేశ్‌ గోపీనాధన్‌ తెలిపినట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది. అయితే కొవిడ్‌-19 మూడో విడత వ్యాప్తి పరిణామాలను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ టీసీఎస్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, మిగతా ఐటీ కంపెనీలు కూడా దీనిని అనుసరించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 మార్చిలో కొవిడ్‌-19 ఉద్ధృతి ప్రారంభమై, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడంతో, ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేసేలా ఐటీ కంపెనీలు అవకాశం కల్పించాయి. ఏడాదిన్నరగా అత్యధిక ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. సుమారు 195 బి.యన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన టీసీఎస్‌, ఈ మొత్తాన్ని మరింతగా పెంచుకునేందుకు కొత్త కంపెనీలను కొనుగోలు చేసే ప్రణాళికలేవీ లేవని, దానికి బదులు సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తామని సీఈఓ తెలిపారు.

* కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస, భాజపా కుట్రలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆడే ఆటలో బండి సంజయ్‌ బలికాక తప్పదన్నారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారం కాపాడుకోవడానికి భాజపాతో కేసీఆర్‌ దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర భాజపా నాయకులు డమ్మీలుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం దిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రాజాసింగ్‌కు భాజపాలోనే విలువలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఫిర్యాదులు సర్వసాధారణమని.. ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

* మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే అధికార కూటమి నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు చేపడుతోందని ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నమేనని విమర్శించారు. మనీ లాండరింగ్‌ కేసులో భాగంగా అధికారంలో ఉన్న మహా వికాస్‌ అగాడీకి చెందిన పలు పార్టీల నేతలపై ఈడీ దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో శరద్‌ పవార్‌ ఈ విధంగా స్పందించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 150పైగా ఇటువంటి ఘటనలు జరిగినా అరెస్టులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కన్నాతో పాటు భాజపా నేతలు, వీహెచ్‌పీ నేతలు విజయవాడలో గవర్నర్‌ను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం భాజపా నేతలు మీడియాతో మాట్లాడారు.