Devotional

బాలగణపతి శిరస్సు పడిన క్షేత్రం తెలుసా?

బాలగణపతి శిరస్సు పడిన క్షేత్రం తెలుసా?

శివుడు ఖండించిన బాల గణపతి శిరస్సు పడిన గుహ ఇదే…..

హిందూ పురాణాలను అనుసరించి పరమశివుడు పార్వతి దేవి వల్ల ప్రాణం పోసుకొన్న వినాయకుడి తలను ఖండిస్తాడు. అటు పై ఓ ఏనుగు తలను ఆ మొండానికి అతికించి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు. అయితే ఆ తెగిన తల పడిన ప్రదేశం ఓ గుహ.

పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ గుహలోనికి వెళ్లడం ఓ సాహసమే అని చెప్పాలి. గుహలోపలికి వెళ్లాలంటే ఇనుప గొలుసులను పట్టుకొని దిగాలి. కొన్ని అడుగుల లోతుకు వెళ్లితో ఆ గుహ మనకు కనిపిస్తుంది. అదే గుహలో మనం శివుడి జఠాజూటం శిరోజాలను కూడా చూడవచ్చు…

ముఖ్యంగా ఛార్ దామ్ క్షేత్రంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలు కూడా ఇదే గుహలో ఉన్నట్లు స్కాందపురాణం వివరిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ గుహకు ఉన్న రెండు ద్వారాలు కలియుగాంతాన్ని సూచిస్తాయి. మరెందుకు ఆలస్యం, ఆ గుహ ఎక్కడ ఉంది, ఎప్పుడు మొదటిసారిగా ఈ గుహ బయటి ప్రపంచానికి తెలిసింది తదితర వివరాలన్నీ మీ కోసం..

సున్నపురాయితో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహ పాతాళ భువనేశ్వర్. సముద్ర మట్టానికి 1,350 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పాతాళ భువనేశ్వర్ గుహ 160 మీటర్ల పొడవు ఉంటుంది.

పాతాళ భువనేశ్వర్ గుహ ఉత్తరాఖండ్ లోని పితోరాఘర్ జిల్లాలోని ప్రముఖ పట్టణమైన గంగోళిహాట్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్ అనే చిన్న గ్రామంలో ఉంటుంది. ఈ గుహ నుంచి మౌంట్ కైలాష్ కు నేరుగా ద్వారం ఉందని చెబుతారు.

హిందూపురాణాల్లో తలమానికమైన స్కాంద పురాణంలో ఈ పాతాల భువనేశ్వర్ గుహ గురించి సవివరంగా వివరించారు. అందులో ఉన్న కథను అనుసరించి ఈ గుహలోనే పరమేశ్వరుడితో సహా 3 కోట్ల మంది దేవతలు నివశించేవారని చెబుతారు.

అటువంటి పవిత్రమైన గుహలోపలికి వెళ్లిన మొదటి మానవుడు సూర్యవంశానికి చెందిన రాజా రితుపర్ణుడు. ఒకసారి నలుడు జూదంలో తన భార్య చేతిలోనే ఓడిపోతాడు.

పందెం ప్రకారం కొన్ని ఏళ్లపాటు అతడు కారాగార వాసం గడపాల్సి వస్తుంది. అయితే కారాగార వాసం నుంచి తప్పించుకోవడం కోసం నలుడు ఈ రితుపర్ణుడి సహాయం కోరుతాడు.

రితిపర్ణుడు నలుడిని హిమాలయాల్లోని అడవుల్లో తనకు మాత్రమే తెలిసిన ఓ ప్రాంతంలో దక్కోవడానికి సహయం చేస్తానని చెప్పి స్వయంగా అక్కడికి తీసుకువెలుతాడు.

తిరిగి వచ్చే సమయంలో జింకను చూసి పట్టుకొంటాడు. ఆ జింకను తనతో పాటు రాజ్యానికి తీసుకొని వెళ్లాలని భావిస్తాడు. అయితే ఆ జింక నన్ను ఇక్కడే వదిలేయమని కోరుతుంది.

తనకు ప్రాణ భిక్షపెడితే ముక్కోటి దేవతలు నివాసం ఉండే చోటుకు నిన్ను తీసుకువెలుతానని చెబుతుంది. రితుపర్ణుడు జింక మానవ భాషలో మాట్లాడటం విని ఆశ్చర్య పోతాడు. అంతేకాకుండా ఆ జింక ప్రతిపాదనకు అంగీకరిస్తాడు.

అటు పై ఆ జింక అతడి దగ్గరికి వచ్చి దగ్గర్లో ఉన్న గుహ వద్దకు తీసుకువెలుతుంది. అక్కడే కాపాలాగా ఉన్న ఆదిశేషుడి వద్ద జింక రూపంలో ఉన్న దేవదూత జరిగిన విషయం మొత్తం చెప్పి రితుపర్ణుడిని లోనికి తీసుకువెళ్లాల్సిందిగా సూచిస్తుంది.

ఆదిశేషుడు తన పడగ పై రితుపర్ణుడిని కూర్చోబెట్టుకొని గుహ లోపలికి తీసుకువెలుతారు. అక్కడి పరిస్థితులను, దేవతలను చూసి రితుపర్ణుడు ఆశ్చర్యపోతాడు.

అది ఒక్క గుహ కాక గుహలో అనేక ఉప గుహలు ఉన్నాయి. అవి అన్నీ ఒక్కొక్క దేవతకు సంబంధించిన నివాస ప్రాంతాలని ఆదిశేషుడు రితుపర్ణుడికి వివరిస్తాడు.

తన పర్యటనలో శివుడు, విష్ణువుతో పాటు పలు దేవతలను రితుపర్ణుడు సందర్శిస్తాడు. ముఖ్యంగా శివుడు వినాయకుడు బాలుడిగా ఉన్నప్పుడు గొడవ పడి అతని శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే.

ఆ బాల గణపతి, శివుడికి యుద్ధం జరిగినే ప్రాంతం ఇదే అని తెలుసుకొంటాడు. ఖండించిన శిరస్సు అదే గుహలో ఉండటం కూడా చూస్తాడు. శివుడి అనుమతితో దానికి నమస్కారం కూడా చేసుకొంటాడు.

ఇక గుహ నుంచి రితుపర్ణుడు బయటికి వచ్చిన తర్వాత ఆ గుహ ద్వారం పూర్తిగా మూతబడిపోయింది. ఇదిలా ఉండగా ఆదిశంకరాచార్యులు తన హిమాలయ పర్వత పర్యటనలో భాగంగా ఈ గుహవద్దకు వస్తాడు..

తనకున్న తప: శక్తితో ఈ గుహ విషయం మొత్తం తెలుసుకొంటాడు. దేవతలను ప్రార్థించి తిరిగి ఈ పాతళ భువనేశ్వర్ గుహలోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేసినట్లు చెబుతారు. ఈ విషయాలన్నీ స్కందపురాణంలో వివరించబడ్డాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ గుహలోపలికి వెళ్లిన వారికి ఆ వినాయకుడి తల శిల రూపంలో కనిపిస్తుందని చెబుతారు. అయితే ఆ శిరస్సు గుహ బయట పడిందని ఆ ప్రాంతంలో పరస్తుతం బాల గణపతి ఆలయం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

సదరు ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు. మొత్తంగా శివుడి త్రిశూలంతో వినాయకుడు శిరస్సును కోల్పోయిన ప్రాంతం ఇదేనని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా శివుడి జఠాజూఠంలోని శిరోజాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి.

ఇదిలా ఉండగా ఈ గుహకు నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిని వరుసగా రన్ ద్వార్, పాప ద్వార్, ధర్మ ద్వార్, మోక్షద్వార్. వీటిలో రన్ ద్వార్, పాప ద్వార్ లు వరుసగా రామరావణ యుద్ధం, మహాభారత యుద్ధం తర్వాత మూసుకుపోయాయని చెబుతారు.

కలియుగం అంతం సమయంలో మిగిలిన రెండు ద్వారాలు ఒకదాని తర్వాత మరొకటి మూసుకుపోతాయని స్కాందపురాణంలో వివరించబడింది. ఇక గుహలోపలికి వెళ్లే ద్వారం చాలా చిన్నగా ఉంటుంది.

ఇనుప గొలుసులను పట్టుకొని లోపలికి దిగాల్సి ఉంటుంది. లోపల కూడా చాలా మసక, మసక చీకటిగా ఉంటుంది. అయినా కూడా భక్తులు చాలా మంది నిత్యం ఈ గుహను సందర్శించుకొంటూ ఉంటారు.