NRI-NRT

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు”

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు”

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా “తెలంగాణా భాషా దినోత్సవ వేడుకలు” అంతర్జాలంలో ఘనంగా నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం జొన్నవిత్తుల రచించి, పార్థసారథి స్వరపరిచి, ఎస్. పి. బాలు గానం చేసిన ప్రత్యేక దృశ్య గీతంతో సభను ప్రారంభించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి కాళోజికి ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తానా ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచిన కవి, సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ తెలంగాణా ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహాన్ని తన రచనలలో పొందుపరచి, నిజాం ప్రభుత్వ దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలాన్ని ఎత్తి, గళాన్ని విన్పించి, పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించిన స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు కాళోజీ నారాయణ రావు జయంతిని తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా భాషా దినోత్సవంగా జరుపుకోవడం ముదావహం అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె. వి. రమణాచారి, తెలంగాణా సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి, పీవీ కుమార్తె సురభి వాణీ, సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు డా. సురవరం కృష్ణ వర్ధన్, డా. సుద్దాల అశోక్ తేజ, డా. లక్ష్మి పాకాల, డా. పల్లా రత్నాకర్, డా. పల్లా శ్యామసుందర్, సినారె మనవడు సందడి లయచరణ్, మడిపల్లి దక్షిణామూర్తి తదితరులు పాల్గొని తెలంగాణా భాష గొప్పదనంపై, దాన్ని పరిరక్షించుకోవల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు.