Politics

మొదట వివేకా కుక్కను చంపారు-నేరవార్తలు

మొదట వివేకా కుక్కను చంపారు-నేరవార్తలు

* నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు ఎట్టకేలకు కలెక్టర్‌ హామీతో ఆందోళన విరమించారు. చంపాపేట నుంచి సాగర్‌ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించి దాదాపు 7 గంటల పాటు నిరసన తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు. మరోవైపు బాధితుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నించినా ఫలితంలేకపోయింది. వారిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా ఆందోళనకారులు, బాధిత కుటుంబసభ్యులు వెనక్కి తగ్గ లేదు.

* అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడు రమేశ్‌(42)పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను కొంతకాలంగా అనుసరిస్తున్న రమేశ్‌… శుక్రవారం ఆమె బహిర్భూమికి వెళ్లిన సమయంలో నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రమేశ్‌ గ్రామంలో నాటుసారా విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడికోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

* కర్నూలు జిల్లాలో మినీ బస్సు బోల్తా పడింది. బస్సు మంత్రాలయం సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్దకు రాగానే డ్రైవర్‌ నిద్రమత్తుతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే బస్సులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందులో ప్రయాణిస్తున్న 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. పొలంలో పడి ఉన్న బస్సును స్థానికులు జేసీబీ సాయంతో తొలగించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఎట్టకేలకు మరో నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. సింహాద్రిపురం మండలం కుంచేకులవాసి ఉమాశంకర్‌రెడ్డిని ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్భంగా రిమాండ్‌ రిపోర్టులో సీబీఐ పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఉమాశంకర్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘‘వివేకా హత్యకేసులో సునీల్‌, ఉమాశంకర్‌ పాత్రపై ఆధారాలు ఉన్నాయి. హత్యకేసులో ఇద్దరి కుట్రకోణం ఉంది. ఉమాశంకర్‌ పాత్రపై సునీల్‌ విచారణలో చెప్పారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో ఉమాశంకర్‌ పాత్ర ఉందని తెలిపాడు. వివేకా హత్యకు ముందే ఆయన ఇంట్లో కుక్కను చంపారు. సునీల్‌, ఉమాశంకర్‌ కలిసి కారుతో ఢీకొట్టి కుక్కను చంపారు. హత్య చేయడానికి ఉమాశంకర్‌, సునీల్‌ బైక్‌పై వెళ్లారు. ఉమాశంకర్‌ బైక్‌లో గొడ్డలి పెట్టుకొని పారిపోయాడు. బైక్‌, గొడ్డలి స్వాధీనం చేసుకున్నాం. గుజరాత్‌ నుంచి ఫోరెన్సిక్‌ నివేదిక తెప్పించాం. గతనెల 11న ఉమాశంకర్‌ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నాం. మరి కొందరు నిందితులను పట్టుకోవాల్సి ఉంది. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని’’ అని సీబీఐ పిటిషన్‌లో పేర్కొంది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో మరో నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం కలకలం రేపింది. ఉమాశంకర్‌రెడ్డి స్వస్థలం సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామం. వైఎస్‌ వివేకానందరెడ్డి పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి. ఉమాశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈనెల 23వరకు రిమాండ్‌ విధించింది. దీంతో అతన్ని పులివెందుల నుంచి కడప జిల్లా జైలుకు తరలించారు.