ScienceAndTech

డిసెంబరు నాటికి ఇండియాలో డిజిటల్ కరెన్సీ

డిసెంబరు నాటికి ఇండియాలో డిజిటల్ కరెన్సీ

దశల వారీగా కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రయత్నాలు మొదలుపెట్టిందని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తెలిపారు. వీలైతే ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదో కొత్త విధానమైన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. భద్రత, భారత ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానం, ద్రవ్య లభ్యత వంటి అంశాలపై డిజిటల్‌ కరెన్సీ ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)పై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతమవుతోంది. ప్రయోగాత్మకంగా సీబీడీసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన దేశాల జాబితాలో భారతదేశమూ చేరింది. సీబీడీసీ అంటే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో లావాదేవీలు జరుగుతున్న క్రిప్టో కరెన్సీల వంటిది కాదు. అది రిజర్వు బ్యాంకు వంటి కేంద్ర బ్యాంకుల హామీ ఉన్న చట్టబద్ధ కరెన్సీ. అదే సమయంలో సీబీడీసీ కాగితం కరెన్సీ కాదు, నాణెమూ కాదు. దాన్ని ఈ రెండు రూపాల్లోకీ మార్చడమూ కుదరదు. సీబీడీసీ అనేది ఫోన్‌, డిజిటల్‌ వ్యాలట్‌, కంప్యూటర్‌ ద్వారా మాత్రమే ఉపయోగించగల డిజిటల్‌ కరెన్సీ.