Movies

వారి మీద కూడా కేసు పెట్టాలంటున్న ఆర్పీ పట్నాయక్-నేరవార్తలు

వారి మీద కూడా కేసు పెట్టాలంటున్న ఆర్పీ పట్నాయక్-నేరవార్తలు

* సైదాబాద్ లో ఆరేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న రాజు పోలీసులకు చిక్కాడు.◆ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజు సొంతూరు అడ్డగూడూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.◆ నిన్న సాయంత్రం రాజు దొరికాడని హైదరాబాద్ తరలించామని అడ్డగూడూరు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు.◆ గురువారం సాయంత్రం అదృశ్యమైన బాలిక రాజు ఇంట్లో విగతజీవిగా కనిపించింది.

* సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘యాక్సిడెంట్‌ విషయంలో అతివేగంకేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలి. ఈ చర్యల వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం’ అని పోస్టు పెట్టారు..

* గుంటూరు జిల్లాలో వివాహితపై సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరానికి 28 కి.మీ దూరంలో.. మేడికొండూరు మండలం పాలడుగు వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో అత్యంత ఆటవికంగా దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దోపిడీ దొంగల ముఠా తరహాలో మాటువేసిన ఆగంతకులు.. భార్యాభర్తలు ఇద్దర్నీ తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలు పెట్టారు. ఉన్మాదులుగా మారి.. భర్తను కట్టేసి భార్యపై అఘాయిత్యానికి తెగబడ్డారు. వేటకొడవళ్లతో బెదిరించి నగలు, నగదు కూడా కాజేశారు.  సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద మూడు నెలల కిందట జరిగిన సామూహిక అత్యాచార ఘటన మరవకముందే.. అదే తరహా దారుణం అదే జిల్లాలో చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.అసలేం జరిగిందంటే…గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దంపతులు (భార్య 26, భర్త 30 ఏళ్లు) బుధవారం మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9.45 గంటలకు సొంతూరుకి బయల్దేరారు. రెండున్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించాక.. దారికి అడ్డంగా వేసి ఉన్న ఓ చెట్టు కొమ్మ ఎదురుపడింది. దానిపై నుంచే బైక్‌ను ముందుకు పోనివ్వగా.. దుండగులు చక్రానికి కర్ర అడ్డంపెట్టి వాహనంపైనుంచి వారిద్దరినీ కిందపడగొట్టారు. వెంటనే ఇద్దరిపై అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత కొడవళ్లు చూపించి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సమీపంలోని పొలాల్లోకి వారిని తీసుకెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేవారికి డౌట్ రాకుండా బాధితుల బైకును పొలాల్లోకి దించేశారు. బాధితురాలి భర్త బనియను, దుస్తుల్ని చించేసి వాటితోనే అతన్ని కట్టేశారు. అతని వద్ద ఇద్దరు దుండగులు కాపలా కాయగా, మరో ఇద్దరు బాధితురాల్ని ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. రాత్రి 12.40 గంటల వరకూ భార్యాభర్తలిద్దరినీ తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం నలుగురు ఉన్మాదులు బాధితురాలి మెడలోని మంగళసూత్రం, చెవిదుద్దులు, వెండి కాళ్లపట్టీలు, రూ.5 వేల డబ్బు దోచుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కొడవళ్లు చూపించి బెదిరించారు. ఎవరికీ చెప్పబోమని బాధితులు అన్న తర్వాతే విడిచిపెట్టి పరారయ్యారు. ఆ సమయంలో ఓ ఫోన్‌ నంబర్‌ కూడా బాధితులకు ఇచ్చారు. దాన్ని పరిశీలించగా, అది మధ్యప్రదేశ్‌కు చెందిన నంబర్‌గా తేలింది. ఆగంతుకుల్లో ముగ్గురు తెలుగులో మాట్లాడారని.. ఓ వ్యక్తి మాత్రమే వేరే భాషలో మాట్లాడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. వారంతా ముఖాలకు మాస్కులు పెట్టుకున్నట్లు చెప్పారు.పోలీసుల అదుపులో 8 అనుమానితులు…గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎనిమిది పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా వారిని విచారిస్తున్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.భయం లేకనేనా…ఇటువంటి ఘటనలు ఎక్కువగా నార్త్ సైడ్ జరుగుతుంటాయి. సౌత్ అందునా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి క్రైమ్స్‌ చేసినవాళ్లకి ఎలాంటి గుణపాఠాలు ఎదురయ్యాయో అందరం చూశాం. కానీ ఏపీలోని గుంటూరు జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు రెండు జరగడం మాత్రం ప్రభుత్వం కాస్త సీరియస్‌గా ఫోకస్ పెట్టాల్సిన అంశంగానే కనిపిస్తోంది.

* కడప జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. కడప జిల్లా దువ్వూరు మండలంలోని తమ 1.5 ఎకరాల భూమిని ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు తిరుపాల్‌రెడ్డి.. మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డితో కలిసి బెదిరిస్తున్నారని కుటుంబం విలపించింది. వారికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. తాను కూడా వైకాపా కార్యకర్తనే అన్న దువ్వూరు మండలం ఎర్రబల్లెకు చెందిన అక్బర్‌ బాషా.. న్యాయం చేయాల్సిన పోలీసులు, ప్రజా ప్రతినిధులు దౌర్జన్యం చేస్తుంటే దిక్కు లేని వాడిగా మిగిలిపోయానని తీవ్ర ఆవేదన చెందారు.జీవనాధారమైన పొలాన్ని తమ ఆక్రమించారని.. తనకు న్యాయం చేయాలని సీఎం జగన్‌ను, డీజీపి గౌతమ్‌ సవాంగ్‌ను వేడుకున్నారు. లేని పక్షంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమంటూ సెల్ఫీ వీడియోలో అక్బర్‌బాషా  ఆవేదన వ్యక్తం చేశారు. అక్బర్‌ బాషా కుటుంబం పోలీసుల సంరక్షణలో ఉన్నారని.. జిల్లా ఎస్పీ విచారణ జరిపి న్యాయం చేస్తారని కడప పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు దువ్వూరు నుంచి కడపకు బయలుదేరినట్లు సమాచారం.