Devotional

వేలంలో ₹6.5లక్షలకు పలికిన కొబ్బరికాయ-తాజావార్తలు

వేలంలో ₹6.5లక్షలకు పలికిన కొబ్బరికాయ-తాజావార్తలు

* త్వరలో వరంగల్ (మామునూరు) నుంచి విమానాల రాకపోకలు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సింధియా హామీ ఇవ్వడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నిన్న (శనివారం) సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

* దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కొనియాడారు. యాదగిరి గుట్ట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న విడుదలవుతున్న రైతన్న సినిమా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అవ‌లంభిస్తున్న రైతు, విద్యుత్ వ్య‌తిరేక చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఈ సినిమా తీశాన‌ని క్లారిటీ ఇచ్చారు.

* బాగ‌ల్‌కోట్ జిల్లాలోని చిక్క‌ల‌కీ అనే గ్రామంలో 12 వ శ‌తాబ్దంలో నిర్మించిన మ‌లింగ‌రాయ దేవుడి గుడి ఉంది. అది చాలా ప‌వ‌ర్ ఫుల్ గుడి అని అక్క‌డి వారి న‌మ్మ‌కం. మలింగ‌రాయ‌డి ద‌గ్గ‌ర ఒక కొబ్బ‌రికాయ‌ను ఉంచి.. దానికి సంవ‌త్స‌రం మొత్తం పూజ‌లు చేసి.. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రావ‌ణ మాసం ముగింపు సంద‌ర్భంగా దాన్ని వేలం వేస్తారు దేవ‌స్థాన క‌మిటీ సభ్యులు.మ‌లింగ‌రాయ అంటే ఎవ‌రో కాదు.. శివుడి నందినే మ‌లింగ‌రాయ‌గా అక్క‌డ కొలుస్తారు. నంది విగ్ర‌హం మీద ఉంచి ఆ కొబ్బ‌రికాయ‌కు పూజ‌లు చేస్తారు. విశిష్ట పూజ‌లు అందుకున్న ఆ కొబ్బ‌రికాయ ఎవ‌రి ఇంట్లో ఉండే ఆ ఇంట్లో అన్నీ శుభాలు క‌లుగుతాయ‌ని.. వాళ్ల‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ని అక్క‌డి వారి న‌మ్మ‌కం. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆ కొబ్బ‌రికాయ‌ను వేలం వేస్తే.. 10 వేల రూపాయ‌ల వ‌ర‌కు డ‌బ్బులు వ‌స్తాయ‌ట‌.కానీ.. ఈ సంవ‌త్స‌రం మాత్రం.. వెయ్యి రూపాయ‌ల‌తో స్టార్ట్ అయిన వేలం.. ల‌క్ష‌, 3 ల‌క్ష‌లు కూడా దాటింద‌ట‌. ఆ త‌ర్వాత‌.. మ‌హ‌వీర్ అనే ప‌ళ్ల వ్యాపారి.. దానికి 6.5 లక్ష‌లు ఇస్తాన‌ని చెప్ప‌డంతో.. చివ‌ర‌కు ఆ కొబ్బ‌రికాయ అత‌డికే ద‌క్కింది. కొబ్బ‌రికాయ వేలం ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌తో గుడిని అభివృద్ధి చేస్తామ‌ని ఆల‌య క‌మిటీ తెలిపింది.

* భార్య పుట్టింటికి వెళ్తాన‌ని చెప్పింది. భ‌ర్త వ‌ద్ద‌ని వారించాడు. లేదు నేను వెళ్లాల్సిందే, నా త‌ల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదు ప‌రామ‌ర్శించి రావాలి అని భార్య బ‌తిమాలింది. కొన్ని రోజులాగితే నేను కూడా వ‌స్తా, ఇప్పుడు వ‌ద్దు అని భ‌ర్త స‌ర్దిచెప్పాడు. మ‌రో రోజు కాదు నేను ఈరోజే వెళ్తా అని భార్య మొండికేసింది. అంతే భ‌ర్త‌లో కోపం న‌శాలానికి ఎక్కింది. దాంతో భార్య‌కూ కోపం వ‌చ్చింది. ఇద్ద‌రూ చెడామ‌డా తిట్టుకున్నారు. ఈ క్ర‌మంలో భ‌ర్త ఇంట్లో కూర‌గాయ‌లు కోసే క‌త్తి తీసుకొచ్చి భార్య ముక్కు కేసేశాడు. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

* పాన్ నంబ‌ర్ న‌మోదు చేస్తే.. ఆర్థిక లావాదేవీలు.. ఆధార్ నంబ‌ర్ ఫీడ్ చేస్తే స‌ద‌రు వ్య‌క్తి ఆస్తిపాస్తులు, విద్యా ఉద్యోగం వంటి విష‌యాల‌న్నీ తెలిసిపోతాయి.. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కోసం విశ్వ‌జ‌నీన హెల్త్ కార్డ్ తీసుకువ‌స్తే ఎలా ఉంటుంది. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ అర్థం అవుతాయి.. అందుకు అవ‌కాశాలు ఉన్నాయా.. అంటే అవున‌నే అనే స‌మాధానం వ‌స్తోంది. ఆధార్ త‌ర‌హాలోనే కేంద్రం.. హెల్త్ ఐడీ కార్డ్‌ను జారీ చేయ‌నున్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది. దేశ ప్ర‌జ‌లంద‌రికీ ఈ హెల్త్ కార్డులు జారీ చేస్తే.. ఇక ముందు ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రానికి, న‌గ‌రానికి వెళ్లిన‌ప్పుడు వెంట హెల్త్ రికార్డులు వెంట తీసుకెళ్ల‌న‌క్క‌ర్లేదు. ఆ కార్డు స‌మ‌ర్పిస్తే చాలు.. ఇంత‌కుముందు నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల నివేదిక‌లు తెలిసిపోతాయ్‌.. వాటి ఆధారంగా చికిత్స కూడా చేయొచ్చు.

* వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వాటంతట అవే (ఆటోమెటిగ్గా) కట్‌ అయ్యే విధానానికి స్వస్తిపలికే ప్రక్రియలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్‌ 1 నుంచి ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆటోమెటిక్‌ రెన్యువల్‌’ కుదరదని కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. వినియోగదారుడి ఖాతా నుంచి ఆటోమెటిక్‌గా డబ్బులు కట్‌ అయ్యే 24 గంటల ముందుగా బ్యాంకులు విధిగా ఖాతాదారుడికి ఎస్సెమ్మెస్‌ లేదా మెయిల్‌ రూపంలో సమాచారం అందించాలన్నది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ) మెసేజ్‌ను పంపించి, ఖాతాదారుడితో ధ్రువపర్చుకున్నాకనే అకౌంట్‌ నుంచి డబ్బులను కట్‌ చేయాలని తెలిపింది. తొలుత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌, హాట్‌స్టార్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ నెలవారీ ప్యాకేజీ అయిపోగానే, సబ్‌స్క్రిప్షన్‌ రెన్యువల్‌కు వినియోగదారుడి ఖాతా నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు కట్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. రూ.5 వేలకు మించి పేమెంట్లు చేయాల్సివస్తే ఓటీపీని కూడా తప్పనిసరి చేసింది.

* తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎస్సీలేనని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన దళితభేరి సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో దాదాపు 400 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది వారే. వైఎస్‌ఆర్‌ పాలనలో ముగ్గురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ ఐఏఎస్‌లను కేసీఆర్‌ అవమానించారు. కేసీఆర్‌ చేసిన అవమానాలతో ఐఏఎస్‌లు ముందే రిటైర్‌ అయ్యారు. కేసీఆర్‌ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు.. కానీ, చివరకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలి. ప్రతి రోజూ దళితులపై దాడులు జరుగుతున్నాయి. కేసీఆర్‌ పాలనలో ఎస్సీలపై దాడులు 800 శాతం పెరిగాయి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితులకు రూ.10లక్షలు ఇస్తున్నారు. ఏడేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయలేదు. అడ్డగూడూరు పీఎస్‌లో ఎస్సీ మహిళను లాకప్‌డెత్‌ చేస్తే చర్యలేవి. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి’’ అని షర్మిల ప్రశ్నించారు.