Devotional

హుస్సేన్‌సాగర్ కాలుష్యానికి ససేమిరా ఒప్పుకోమన్న హైకోర్టు-తాజావార్తలు

హుస్సేన్‌సాగర్ కాలుష్యానికి ససేమిరా ఒప్పుకోమన్న హైకోర్టు-తాజావార్తలు

* రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్, సీజనల్ వ్యాధులుపై సీఎం కేసీఆర్‌ సమీక్షించినట్లు డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. 2019లో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 10 నాటికి 3 వేల కేసులు నమోదైనట్లు చెప్పారు. వైరల్ జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డెంగ్యూ ప్లేట్‌లెట్స్‌పై కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ మొదలు పెట్టాయని.. జనాలను పరుగులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు 104కి ఫిర్యాదు చేయవచ్చునని డీహెచ్ సూచించారు. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదవుతున్నాయని.. అక్టోబర్ నెలాఖరు వరకు వైరల్‌ జ్వరాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

* గణేశ్‌ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని గతవారం హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఈ ఉదయం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. పరిస్థితులను అర్థం చేసుకొని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పరిస్థితులన్నీ ప్రభుత్వం సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని..కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది.హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని అడిగింది. చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉందని వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. తీర్పులో జోక్యం చేసుకొని సవరించలేమని స్పష్టం చేసింది. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

* సామాన్యులకు భద్రత కల్పించలేని హోం మంత్రి రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర 17వ రోజు మెదక్‌ జిల్లా చిన్న ఘన్‌పూర్‌లో కొనసాగుతోంది. సైదాబాద్‌లో చిన్నారి హత్యాచార ఘటనపై బండి సంబయ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ‘‘పసిపాపపై హత్యాచారం చేసిన ఘటనకు నైతిక బాధ్యత వహించి హోంమంత్రి మహమూద్‌ అలీని సీఎం రాజీనామా చేయించాలి. ఒక వర్గానికే కొమ్ముకాసే హోం మంత్రి రాష్ట్రానికి అవసరం లేదు’’ అని బండి సంజయ్‌ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సంజయ్‌ పాదయాత్రకు ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ హాజరయ్యారు. ఆయనను భాజపా శ్రేణులు గజమాలతో సత్కరించారు.

* రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్‌ ప్రాజెక్టు అమలుపై మరికాసేపట్లో సన్నాహక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తాను హాజరుకానున్నట్లు సీఎల్సీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మధిర శాసనసభ నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఇందులో ఉందని.. దీంతో స్థానిక శాసనసభ్యుడనైన తనను ఆహ్వానించారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొని.. కాంగ్రెస్‌ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానని వెల్లడించారు.

* తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల పేర్లు.. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్‌ ఇంటర్నేషన్‌ సంస్థ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది.

* గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కొర్రపాడుకు చెందిన పాత నేరస్థులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వీరి ప్రమేయం ఉండొచ్చని విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా అనుమానితుల నుంచి ఘటనకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.