NRI-NRT

AP FiberNet Scam: సీఐడీ ఎదుట వేమూరు హాజరు-తాజావార్తలు

AP FiberNet Scam: సీఐడీ ఎదుట వేమూరు హాజరు-తాజావార్తలు

* గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ పలువురికి నోటీసులు జారీచేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇన్ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించిన సాంబశివరావు, టెక్నికల్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణప్రసాద్‌కు నోటీసులు పంపింది. నోటీసులు అందినందున విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో వాళ్లిద్దరూ విచారణకు హాజరయ్యారు. Read more about this scam here –

https://timesofindia.indiatimes.com/city/hyderabad/case-filed-in-rs-321-cr-ap-fibernet-scam/articleshow/86082336.cms

https://timesofindia.indiatimes.com/city/vijayawada/council-ex-member-booked-in-fibernet-scam/articleshow/86078305.cms

https://english.sakshi.com/who-is-vemuru-ravikumar

* ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు హాజరైన అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది.

* వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్‌కే పోయిందని, అయినా సీఎం జగన్‌ చెప్పిన ఏ మాటను వెనక్కి తీసుకోకుండా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదాయం లేకపోయినా అప్పు చేసైనా రైతులను ఆదుకోవాలని ఆయన భావించారని, అందుకు నిదర్శనమే రైతు భరోసా కింద రూ. 17,030 కోట్లు రైతులకు చెల్లించడం, పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అయితే చంద్రబాబు కొత్తగా రైతు ఆందోళనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన హయాంలో రైతులను విస్మరించి ఈ రోజు రైతు కోసం అంటూ రావడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. రుణమాఫీ, 9 గంటల విద్యుత్ సరఫరా, 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని గతంలో రైతులకు మాయమాటలు చెప్పిన చంద్రబాబుకు ఇప్పుడు మళ్లీ రైతులు గుర్తుకు వచ్చారా అని ఎద్దేవా చేశారు. అసలు వ్యవసాయం దండగ అన్న వ్యక్తి అధికారం పోయాక రైతు కోసం పోరాటం అనడం వింతగా ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

* తెలుగుదేశం ప్రభుత్వం 2015లో జారీచేసిన జీవోలోని క్లాజ్‌ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ విజయవాడలోగల హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం కామన్‌ గుడ్‌ఫంఢ్‌కు ఇచ్చే 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టుకు తప్పనిసరిగా కేటాయించాలనటం ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక, హిందూ మతసంస్థలు, దేవదాయ చట్టం–1987లోని సెక్షన్‌ 70కి వ్యతిరేకమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన జస్టిస్‌ ఇందూబెనర్జీ, జస్టిస్‌ జేకే మహేశ్వరిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి ఇటీవల నిరాకరించింది. 3 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కామన్‌ గుడ్‌ఫండ్‌కు నిధుల కేటాయింపును ఐదు నుంచి తొమ్మిది శాతానికి పెంచుతూ 2015 అక్టోబర్‌ 1న అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. జీవోలోని క్లాజ్‌ 7(2)(బీ) ప్రకారం హిందూ ధార్మిక కార్యక్రమాల నిమిత్తం తొమ్మిది శాతం నిధుల నుంచి రెండు శాతాన్ని తప్పనిసరిగా కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని మూడునెలలకోసారి ప్రత్యేక ఖాతాలో సదరు ట్రస్టు వద్ద ఉంచాలని పేర్కొంది. 1987 చట్టం సెక్షన్‌ 70 ప్రకారం ఈ జీవో చట్టవిరుద్ధమని విశాఖపట్నానికి చెందిన ఒ.నరేశ్‌కుమార్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హిందు ధార్మిక పరిరక్షణ ట్రస్టు ఏ చట్టబద్ధమైన నిబంధనకు లోబడి ఏర్పాటుకాలేదని, సెక్షన్‌ 70లో పేర్కొన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఆ మొత్తాన్ని మళ్లిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, హిందువుల ప్రయోజనాల కోసం ఆ విధంగా మళ్లించడం చట్టవిరుద్ధం కాదని, ఆలయాల తక్షణ మరమ్మతులు, పునర్నిర్మాణాలకు ఆ మొత్తాన్ని వినియోగిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. వాదనల అనంతరం నాటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సదరు ట్రస్టు చట్టబద్ధమైన సంస్థ కాదని గుర్తించింది. హిందూ ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే కామన్‌ గుడ్‌ఫండ్‌ 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని తప్పనిసరిగా ఆ ట్రస్టుకు కేటాయించాలనటం చట్టవిరుద్ధమని పేర్కొంది. జీవోలోని క్లాజ్‌ 7(2)(బీ)ని కొట్టేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

* దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్‌, హరియాణా,యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

* టెక్‌ యుగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. మానవుడి జీవన విధాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేస్తూ అనేక రకాల గాడ్జెట్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతలా అంటే ఫోన్‌తో చేసే పనులు కళ్ల జోళ్ల(స్మార్ట్‌ గ్లాసెస్‌)తో చేయడం అన్నమాట. ఇప్పటికే ఆ దిశగా ఫేస్‌బుక్‌ ‘రే బాన్‌ స్టోరీస్‌’ పేరుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడు ఫేస్‌బుక్‌కు పోటీగా ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్‌ డివైజ్‌ కాన్సెప్ట్‌’ పేరుతో స్మార్ట్‌ గ్లాసెస్‌ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్‌ చేసింది.

* సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నరేశ్‌ తప్పుపట్టారు. సాయితేజ్ విషయంలో తాను విడుదల చేసిన వీడియో బైట్ మీడియాలో తప్పుగా ప్రసారం కావడం వల్ల పెద్దలు మందలించారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు. తన ముందే హీరోగా ఎదిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్… మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తూ తమ ప్యానల్ ముందు ఓడిపోయారని తెలిపారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఎలాంటి వివాదాలు, విమర్శలకు తావులేకుండా మాట్లాడతానని నరేశ్‌ స్పష్టం చేశారు. శ్రీకాంత్ మరోసారి వీడియోలు విడుదల చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. యుక్త వయస్సులో వచ్చిన వాళ్లకు ద్విచక్రవాహనాలు నడపడం సహజమని, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా సహజమని నరేశ్‌ వ్యాఖ్యానించారు. సాయితేజ్ స్పీడ్‌గా వెళ్లలేదని, జారిపడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మరోమారు తెలిపారు.

* హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఉదయం సీజేఐ ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం.. నిమజ్జనం అంశాన్ని ప్రస్తావించనుంది.

* ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.

* తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 16న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25లోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే సర్కారు స్పందిస్తుందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. నిరుద్యోగులకు సంఘీభావంగా ఆమె ఇవాళ హనుమకొండలో నిరహార దీక్ష చేపట్టారు. తాను పది వారాలుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని వ్యాఖ్యానించారు.

* కరోనా మూడోముప్పు చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలు నివేదికల్లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌) నిర్వహించిన సీరో సర్వేలో ఆశాజనక ఫలితాలు వెలువడ్డాయి. రానున్న ముప్పు గురించి మరీ అంత ఆందోళన అవసరం లేదని తేలింది.

* మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. భాజపా నాయకుడు, బైరక్‌పుర్‌ లోక్‌సభ సభ్యుడు అర్జున్‌సింగ్ నివాసంపైకి మంగళవారం కొందరు ఆగంతకులు బాంబులు విసిరారు. ఎంపీ ఇంటిపై బాంబు దాడి జరగడం వారం వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

* అఫ్గాన్‌ పోలీసులు క్రమంగా విధుల్లో చేరుతున్నారు. తాజాగా కాబుల్‌ ఎయిర్‌ పోర్టు విధుల్లోకి కొందరు పోలీసులు తిరిగి వచ్చారు. వీరు అక్కడి చెక్‌పాయింట్లలో తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నారు. కాబుల్‌ ఆక్రమణ తర్వాత పోలీసులు విధుల్లోకి రావడం ఇదే తొలిసారి. తాలిబన్‌ కమాండర్ల నుంచి పలు మార్లు ఫోన్లు రావడంతో ఇద్దరు పోలీసు అధికారులు శనివారం విధుల్లో చేరారు.

* గతకొన్ని రోజులుగా ఒడుదొడుకుల్లో పయనిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. రోజంతా లాభాల్లోనే పయనించాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల అండ లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడం కలిసొచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సూచీలు ఆద్యంతం లాభాల్లో పయనించాయి.

* ఇంగ్లాండ్‌తో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ కోరాడు. లేకపోతే అది మరిన్ని అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నాడు. ‘ఇంతకు ముందు కూడా మ్యాచులు రద్దు అయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌ రద్దవ్వడానికి ముందు రోజు అర్ధరాత్రి కోహ్లీ బీసీసీఐకి లేఖ రాశాడు. కాబట్టి, మ్యాచ్‌ రద్దవ్వడానికి దారి తీసిన పరిస్థితులపై అతడు వివరణ ఇస్తే బాగుంటుంది’ అని గోవర్‌ పేర్కొన్నాడు.

* ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నట్టు క్రెమ్లిన్‌ వెల్లడించింది. ఆయన పరివారంలోని కొందరికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ఈ వారంలో తజికిస్థాన్‌లో జరగబోయే ప్రాంతీయ భద్రతా సమావేశాలకు పుతిన్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఎమోమలి రాఖ్‌మాన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపింది. తన సన్నిహిత వర్గాల్లో కొందరు కరోనా మహమ్మారి బారిన పడ్డారని, అందువల్ల తాను నిర్దిష్ట సమయం పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయనతో చెప్పారు. అందువల్ల ఈ వారంలో డుషంబేలో జరగబోయే ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనలేకపోతున్నట్టు ఆయనతో చెప్పినట్టు క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.