Movies

అక్టోబర్ 10న మా ఎన్నికలు. సోనూసూద్‌పై ఐటీ కేసు-తాజావార్తలు

అక్టోబర్ 10న మా ఎన్నికలు. సోనూసూద్‌పై ఐటీ కేసు-తాజావార్తలు

* ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ‘‘గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైకాపా నేతలకు భయం పట్టుకుంది. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

* రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన.. అక్కడ తెరాస ఎలాగూ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డినా.. సీనియర్‌ నేత జానారెడ్డి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గజ్వేల్‌లోనే కాదు.. ఎక్కడ సభపెట్టినా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ అయినా దక్కుతుందా?అని ప్రశ్నించారు. ‘‘మేం సంక్షేమంలో నిమగ్నమయ్యాం. హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రూ.50కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేతే అన్నారు. పీసీసీ పదవి కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్‌ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయి? ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం? ఇక నుంచి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతాం. ఎంఐఎంకు ఎవరూ భయపడట్లేదు.. భాజపానే భయపడుతోంది. ఆదిలాబాద్‌కు గిరిజన వర్సిటీ ఇస్తామన్న భాజపా ఏం చేసింది? రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులపై అమిత్‌ షా మాట్లాడాలి’’ అని అన్నారు.

* తెలుగు సినీ నటుల సంఘం(MAA) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 30న వాటిని పరిశీలిస్తామని కృష్ణమోహన్‌ వివరించారు. అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా ఉపసంహరణకు అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. నామినేషన్‌ దరఖాస్తుకు రూ.100, ఓటర్ల జాబితా కావాలంటే రూ.500 చెల్లించాలని తెలిపారు. ఆఫీస్‌ బేరర్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.15వేలు, ఈసీ మెంబర్‌ రూ.10వేలు డిపాజిట్‌(నాన్‌ రిఫండబుల్‌)చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్లు సమర్పించే సమయంలో అవసరమైతే అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులను చూపాలని. పోలింగ్‌ తేదీ రోజున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుతో రావాల్సిందేనని వివరించారు
* ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలి.
* గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అనర్హులు.
* 20 శాఖల అసోసియేషన్‌లలో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
* సీనియర్‌ సిటిజన్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం.
* ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.
* నామినేషన్‌ సమర్పణ, ఓటు వేసే సమయంలో మాస్క్‌లు ధరించి రావాలి.
* పోలింగ్‌ బూత్‌లోకి మొబైల్‌ ఫోన్లకు అనుమతి లేదు.
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ప్యానెల్‌ సభ్యులను ప్రకటించారు. ప్రస్తుతం మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించి బాబూమోహన్‌, రఘుబాబు పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే పూర్తి ప్యానెల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

* ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి, రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. కాగా, మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి దిల్లీ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. భాజపా మాత్రం ఆరోపణలను కొట్టిపారేసింది.

* చైనాకు చెక్‌ పెట్టేందుకు కూటమిగా ఏర్పడ్డ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే మధ్య కుదిరిన అణుజలాంతర్గాముల ఒప్పందం పెనుదుమారం రేపుతోంది. అమెరికా సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మించిన అణుజలాంతర్గాముల కొనుగోలుకు ఆస్ట్రేలియా అంగీకరించింది. దీంతో ఫ్రాన్స్‌తో చేసుకున్న 100 బిలియన్‌ డాలర్ల విలువైన జలాంతర్గాముల కొనుగోలు ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌.. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌కు లేఖ పంపారు.

* గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 55,525 పరీక్షలు నిర్వహించగా.. 1,174 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,34,458 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14,061కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,309 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,653 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* పేరుపల్లిలో నిర్మించిన 70 రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక శుక్రవారం రసాభాసగా మారింది. సర్పంచి నాగేశ్వరరావు అధ్యక్షతన తహసీల్దార్‌ పుల్లయ్య గ్రామసభ ఏర్పాటు చేశారు. గ్రామంలో వంద మందికి ఇళ్లు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు గతంలో రూ.20 నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశారు. తీరా 70 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. వాయిదా పడుతూ వస్తున్న ఎంపిక ప్రక్రియను ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో చేపట్టారు. 120 దరఖాస్తుల నుంచి జల్లెడపట్టి 80 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 70మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని తహసీల్దార్‌ ప్రకటించారు. గతంలో నాయకులు తమ నుంచి నగదు తీసుకున్నారని, లాటరీ లేకుండా ఇస్తామని హామీ ఇచ్చారని పలువురు అభ్యంతరం తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని అధికారి తేల్చిచెప్పడంతో వాదన చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఎస్సీలు సైతం అందరికీ ఇళ్లు ఇవ్వాలని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి మరింత జఠిలంగా మారింది. సీఐ శ్రీనివాసులు, కారేపల్లి, కామేపల్లి ఎస్సైలు సురేశ్‌, స్రవంతిలు జోక్యం చేసుకుని బందోబస్తు నడుమ ప్రక్రియను పూర్తి చేయించారు.