DailyDose

మరదలితో పెళ్లి చేయలేదని దారుణం-నేరవార్తలు

మరదలితో పెళ్లి చేయలేదని దారుణం-నేరవార్తలు

* మనస్తాపానికి గురైన ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు కుమార్తెలను నీటి ట్యాంక్‌లో తోసేసి హత్య చేశాడు. అనంతరం అతడు కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. మృతులంతా పదేళ్లలోపు పిల్లలే. ఈ దుర్ఘటన రాజస్థాన్​లోని బాడ్​మేర్​లో జరిగింది. పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్‌కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కరోనా కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మృతిచెందారు. కుమార్తెలకు తల్లి అవసరం ఉందని భావించిన పుర్ఖారామ్‌.. మరదలు (భార్య చెల్లి)ని ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను కోరాడు. అందుకు వారు అంగీకరించలేదు. మనస్తాపానికి గురైన పుర్ఖారామ్‌.. కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర) చేత విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్​లో తోసేశాడు. తర్వాత పుర్ఖారామ్​ కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు వాటర్​ ట్యాంక్​లోకి దూకుతుండగా పొరుగింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు పోలీసు అధికారి ఓం ప్రకాశ్‌ వెల్లడించారు. ఓం ప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు పిల్లలను నీటిలో తోసేయగా మునిగిపోయి వారు మరణించినట్లు తెలిపారు. మృతదేహాలను సమీపంలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్​ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన ఉమా శంకర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాల గుర్తింపు కోసం అతడిని సుదీర్ఘంగా ప్రశ్నించడంతో పాటు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. సింహాద్రిపురం మండలం సుంకేశుల గ్రామానికి చెందిన సోమశేఖర్‌రెడ్డి, పులివెందులకు చెందిన వెంకట్‌నాథ్‌రెడ్డి సీబీఐ విచారణకు వచ్చారు. నాలుగు రోజులు కస్టడీ అనంతరం ఉమా శంకర్‌రెడ్డిని సోమవారం పులివెందుల కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు, క్షతగాత్రుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ సమీపంలోని సూర్య తండాకు చెందిన ఓ కుటుంబం శనివారం చిన్నారుల కేశఖండన కోసం మద్దిమడుగు ఆంజనేయస్వామి గుడికి వెళ్లారు. ఆటోలో ఇవాళ తిరుగు పయనమయ్యారు. మద్దిమడుగుకు రెండు కిలోమీటర్ల సమీపంలోకి రాగానే దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిసింది. అమ్రాబాద్‌ సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో శనివారం సాయంత్రం ఓ ఇంటిపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉన్న రూ.20లక్షల నగదు దగ్ధమైందని బాధితులు చెబుతున్నారు. తమ కుమారుడి చదువు కోసం ఇటీవల పొలం విక్రయించగా వచ్చిన రూ.20లక్షల నగదు ఇంట్లో ఉంచామని, పిడుగు పడటంతో నగదు మొత్తం మంటల్లో కాలిపోయాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. నగదుతో పాటు ఇంట్లో ఉన్న 50కాసుల బంగారం కూడా దగ్దమైందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

* వివాహం జరిగిన అరగంటలోనే పెళ్లి కూతురు అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన ఓ యువతితో బెంగళూరుకు చెందిన వ్యక్తికి వివాహం నిశ్చయమైంది. నిన్న రాత్రి నబీల్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఇద్దరికీ వివాహం జరిగింది. అబ్బాయి తరఫున యువతికి దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారం, రూ.50వేల నగదు ఇచ్చారు. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెళ్లి కుమార్తె బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని పట్టుబట్టి మరీ వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు కంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్‌ పోలీసులు తెలిపారు. పెళ్లి కుమార్తె తన ప్రియుడితో కలిసి పరారైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.