Movies

తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ నటుడు విజయ్-తాజావార్తలు

తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ నటుడు విజయ్-తాజావార్తలు

* అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్‌.. తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… ఏడాది క్రితం విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పేరుతో ఆయన తండ్రి చంద్రశేఖర్‌ పార్టీ పెట్టారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు. కానీ, తల్లిదండ్రులు విజయ్‌ పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

* ఈ సంవత్సరం రూ. 18.90 లక్షలకు పలికిన బాలాపూర్ లడ్డూ. లడ్డూ దక్కించుకున్న మర్రి శశాంక్ రెడ్డి.

* ఒకవైపు పంజాబ్‌లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఉత్కంఠ కొనసాగుతుండగా, మరోవైపు కాంగ్రెస్‌ పార్టీపై భాజపా విమర్శలకు దిగింది. పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్ సింగ్ సిద్ధూపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన తీవ్ర ఆరోపణల విషయంలో అధిష్ఠానం ఎందుకు మౌనం వహిస్తోందని భాజపా సీనియర్ నేత ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘సిద్ధూపై అమరీందర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన్ను దేశ ద్రోహిగా పేర్కొన్నారు. ఒకవైపు భారత్‌పై పాక్‌ ప్రేరేపిత దాడులు జరుగుతుండగా.. మరోవైపు 2018లో సిద్ధూ ఆ దేశాన్ని సందర్శించి, అక్కడి ఆర్మీ చీఫ్ బజ్వాను కలిసిన విషయం అందరికి తెలిసిందే. కానీ.. నిన్న అమరీందర్ ఇదే అంశంపై ప్రశ్నించారు. ఇది చాలా పెద్ద ఆరోపణ. మరి ఈ అంశంలో పార్టీ అగ్రనేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనేదే మా ప్రశ్న’ అని అన్నారు. కాంగ్రెస్.. ఈ ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, సిద్ధూపై విచారణ ప్రారంభిస్తుందా? అని సవాల్‌ విసిరారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన సిద్ధూపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సీఎం అయితే.. దేశ భద్రతకే ముప్పు అంటూ వ్యాఖ్యానించారు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూ పేరును ప్రతిపాదిస్తే అంగీకరించబోననీ హెచ్చరించిన విషయం తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ విజయ పరంపర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24గంటల్లో 35,160 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 173 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,94,564కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,904కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 315 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,005 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

* పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్‌ పాలనకు ఏకపక్షంగా మద్దతు పలికారని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టన్నారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. సీఎం పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

* పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

* ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు తేదీలు ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ.. 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.

* తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వరకు స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్వహించే వార్షిక సదస్సు-2022కు హాజరుకావాల్సిందిగా డబ్ల్యూఈఎఫ్‌ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కొవిడ్ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ చూపిన విజన్‌కు గుర్తింపుగా ఆయన్ను ఆహ్వానించినట్లు డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. తెలంగాణను సాంకేతిక రంగంలో రారాజుగా కేటీఆర్ నిలిపారని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండె ప్రశంసించారు.

* అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. దీనికి తోడు అవమానకర రీతిలో అమెరికన్లు అఫ్గానిస్థాన్‌ను వీడటానికి కూడా ఇస్లామాబాదే కారణమని నిందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రష్యా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధికారులపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారన్నారు. ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు. తాలిబన్లకు వారే ఆశ్రయమిచ్చారని ఆరోపించారు.

* ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రికార్డు స్థాయిలో దేశంలో వ్యాక్సిన్లు ఇవ్వడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పందించారు. ‘ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం’ అంటూ మోదీ పుట్టినరోజు కోసమే ఈ రికార్డులు అనే అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశారు. కొవిన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గత పదిరోజుల వ్యాక్సినేషన్‌ వివరాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. రికార్డుకు ముందు, రికార్డు తర్వాత వ్యాక్సినేషన్‌లో వేగం తగ్గడం గ్రాఫ్‌లో కనిపిస్తోంది.

* జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోడు భూముల సమస్య పరిష్కారానికి తెరాస, భాజపాయేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెరాస, భాజపాయేతర ప్రతిపక్షాలనేతలు ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ అనంతరం రేవంత్ మీడియాకు వెల్లడించారు.