Movies

ఐటీ దాడుల అనంతరం అదిరిపోయే స్టేట్‌మెంట్ ఇచ్చిన సోనూసూద్-తాజావార్తలు

ఐటీ దాడుల అనంతరం అదిరిపోయే స్టేట్‌మెంట్ ఇచ్చిన సోనూసూద్-తాజావార్తలు

* కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు సినీ హీరోయిన్ అంజలి సోమవారం వచ్చారు . వీరి కి మఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని మంగళ హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు పట్టు చీర తో ఫల మంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట సీఆర్వో ఐపి నర్సింహ స్వామి, బిందు మాధవ, జయతీర్థ తదితరులు ఉన్నారు. హీరోయిన్ అంజలి వచ్చిన సమాచారం తెలుసుకున్న అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. సెల్ఫీ దిగి హంగామా చేశారు.

* తనపై జరిగిన ఐటీ దాడులపై నటుడు సోనూసూద్‌ స్పందించారు. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం ఆయన సోమవారం ఉదయం ట్వీట్‌ చేశారు. ‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్‌ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో (ఐటీ దాడులు) బిజీగా ఉండటం చేత మీకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను’ అని సోనూ ట్వీట్‌ చేశారు. పన్ను ఎగవేత ఆరోపణలతో.. నాలుగు రోజులపాటు ఐటీ అధికారులు సోనూసూద్‌ ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే సోనూ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ వెల్లడించింది. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని అధికారులు పేర్కొన్నారు.

* రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో పోటీచేసి అభ్యర్థులు మరణించి ఖాళీగా ఉన్న స్థానాల్లో ఈ నెల 28వ తేదీన తిరిగి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ నెల 25 వ తేదీతో ఎంపీపి, జిల్లా పరిషత్ చైర్మన్ ల ఎంపిక పూర్తి అవుతున్న తరుణంలో సిఈసి ఖాళీ స్థానాలకు 28వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం..

* ఏపీ మంత్రి పేర్ని నానితో ఇవాళ ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు.ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్‌, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల  యజమానులు పాల్గొన్నారు.ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు, తెలుగు చిత్రపరిశ్రమను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం ఓ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

* కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఓ వ్యక్తి తన ధ్రువపత్రం చూసుకుని అవాక్కయ్యాడు.పేరు తప్పో, అచ్చు తప్పు పడిందో అనుకునేరు.. సర్టిఫికేట్‌లో ఆయన టీకా 5 డోసులు తీసుకుని, ఆరో డోసుకు షెడ్యూల్‌ చేసుకున్నట్లుగా ఉంది.దీంతో కంగుతిన్న ఆయన.. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మేరఠ్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన రామ్‌పాల్‌ సింగ్.. భాజపా బూత్‌ స్థాయి నాయకుడు.ఆయన.. ఈ ఏడాది మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇటీవల తన టీకా ధ్రువపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోగా.. దాన్ని చూసి రామ్‌పాల్‌ ఆశ్చర్యపోయాడు.

* నగరంలో రానున్న గంటపాటు మొస్తరు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని నగరవాసులకు సూచించింది.

* తమ పార్టీలోని ఒక నాయకుడు తెదేపా నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే.. వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ను ఉద్దేశించి జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

* కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పేల్చేందుకు చైనా మరో బాంబును సిద్ధం చేసింది. 2008లో 600 బిలియన్‌ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్‌ బ్రదర్స్‌ తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ఎవర్‌గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్‌ డాలర్ల మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్‌ బాండ్స్‌(పెట్టుబడి గ్రేడ్‌లో లేని సంస్థల బాండ్లు) ఈల్డ్‌ ఒక్కసారిగా 14.4శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

* నటుడు అడివి శేష్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్‌ పడిపోవడంతో సెప్టెంబర్‌ 18న ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన టీమ్‌ వెల్లడించింది. ప్రస్తుతం శేష్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. పలువురు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆయన త్వరితగతిన కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

* ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నిన్న నెతన్యాహూ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ కొత్త ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్‌ గతనెలలో జోబైడెన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో నెఫ్తాలీ బెన్నెట్‌ మాట్లాడుతుండగా జో బైడెన్‌ నిద్రలోకి జారుకొన్నట్లు ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ ఆంగ్ల వార్త సంస్థ ఆ వీడియోను ఫ్యాక్ట్‌ చెక్‌ చేసింది. అదొక ఫేక్‌వీడియోగా తేల్చింది. కొన్ని క్షణాల పాటు వీడియోను కట్‌చేసి ఎడిట్‌ చేసినట్లు పేర్కొంది.

* ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల మందకృష్ణ కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ అంబర్‌పేటలోని మందకృష్ణ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలకు న్యాయం జరగడం లేదనే ఎన్నికలు బహిష్కరించాం. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్లే గెలిచామని వైకాపా భావించడం అవివేకం. నేరాలు చేయడం సీఎం జగన్‌కు అలవాటైంది. దాడులు చేసిన దాఖలాలు మా పార్టీ చరిత్రలో లేవు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

* నేటి నుంచి తమ ఆశ్రమంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సమతామూర్తి పేరిట భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చినజీయర్‌ స్వామి మాట్లాడారు. ఫిబ్రవరి 5న రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారన్నారు.