Health

కోవిద్ బాధితుల్లో మానసిక రుగ్మతలు

కోవిద్ బాధితుల్లో మానసిక రుగ్మతలు

కొవిడ్‌ బారిన పడి, కోలుకున్నా.. తదనంతర సమస్యలు కొత్తవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తీవ్రంగా కరోనా సోకిన వారికి సంబంధించి అమెరికా పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. మతిమరుపు, ఆందోళనకు గురికావడం, తికమకపడటం వంటి లక్షణాలతో వారు సతమతమవుతున్నట్లు చెప్పారు. కరోనా ప్రారంభ సమయంలో వైరస్ బారిన పడిన ఆసుపత్రిలో చేరిన 150 మంది బాధితులను పరిశీలించగా.. 73 శాతం మందిలో ఈ లక్షణాలను గుర్తించారు. దీన్ని డెలిరియం (మానసికంగా తీవ్ర గందరగోళానికి గురికావడం)గా వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనం బీఎంజే ఓపెన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఈ డెలిరియం సమస్య ఉన్నవారిలో బీపీ, డయాబెటిస్‌తో పాటు కొవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. 2020 మార్చి నుంచి మే మధ్యలో ఐసీయూలో చేరి, ఇంటికి చేరిన బాధితుల్ని పరిశీలించారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం, మెదడులో రక్తం గడ్డకట్టడం, స్ట్రోక్‌కు దారితీస్తోందని, ఫలితంగా వారిలో కాగ్నిటివ్ ఇంపెయిర్‌మెంట్(జ్ఞాపక శక్తి మందగించడం) వెలుగుచూసిందని చెప్పారు. మెదడులో అక్కడక్కడా వాపు రావడంతో వారు తత్తరపాటుకు గురయ్యారని చెప్పారు. చికిత్స సమయంలో వాడిన మత్తుమందులకు డెలిరియంకు సంబంధం ఉందన్నారు. ఐసీయూ మరీ ముఖ్యంగా వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ఈ మత్తుమందులు వాడటం సర్వసాధారణమేనన్నారు. కొవిడ్ తీవ్ర లక్షణాలతో బాధపడిన వారు ఆందోళనగా ఉండటంతో వారికి ఈ మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.

కొంతమందిలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ డెలిరియం లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. మూడింట ఒకవంతు మంది ఇంటికి వెళ్లే సమయంలో ఇంకా ఆ సమస్య నుంచి బయటపడలేదు. వారిలో 40 శాతం మందికి వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు. తీవ్రమైన కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారిలో జ్ఞాపకశక్తి బలహీనమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ తరహా సమస్యలు టీకాలు, వ్యాప్తిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను వెల్లడిచేస్తున్నాయని వివరించారు.