Business

కార్వీలో పలు అక్రమాలు. పెరిగిన బంగారం ధరలు-వాణిజ్యం

కార్వీలో పలు అక్రమాలు. పెరిగిన బంగారం ధరలు-వాణిజ్యం

* బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లు రుణం తీసుకుని ఎగవేసిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకృష్ణ గురజాడను హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీపీ హరికృష్ణ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని సొంతానికి వినియోగించుకునేందుకు ఆయన ఎనిమిదేళ్ల కిందట ప్రణాళికను సిద్ధం చేశాడు. సదరు సంస్థ ఛైర్మన్‌ పార్థసారథితో కలిసి రూ. 300 కోట్లు మళ్లించాడు. పార్థసారథి ఫోను, లాప్‌టాప్‌లోని వివరాల ఆధారంగా పోలీసులు పరిశోధించగా.. శ్రీకృష్ణ అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయి. కార్వీలో శ్రీకృష్ణ ఇరవై ఏళ్ల కిందట చిరుద్యోగిగా చేరి వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయికి చేరాడు. కొన్నేళ్లుగా వినియోగదారుల షేర్లు, డీమ్యాట్‌ ఖాతాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి వ్యాపార విస్తరణ పేరుతో పదిహేనేళ్లుగా వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ కిస్తీలు చెల్లిస్తున్నాడు. వ్యాపారంలో నష్టపోయినట్లుగా బ్యాంకులను నమ్మిస్తే రూ.కోట్లు వెనకేసుకోవచ్చనే ఉద్దేశంతో పార్థసారథి, శ్రీకృష్ణ ప్రణాళిక రూపొందించారు. శ్రీకృష్ణ తొమ్మిది డొల్ల కంపెనీలను సృష్టించాడు. వాటితో వ్యాపారాలు చేసి నష్టపోయామని రికార్డులు తయారుచేశాడు. నష్టంగా చూపించిన రూ. 300 కోట్లను బినామీ ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్నారు. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అక్రమాలపై నెల వ్యవధిలో ఆ సంస్థ ఛైర్మన్‌ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

* పింఛన్‌దారులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెన్షనర్లు ఇకపై ఏదైనా ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించే వీలు కల్పించింది. పెన్షనర్లకు ఉద్దేశించిన పెన్షన్‌ సేవా పోర్టల్‌ పునరుద్ధరణలో భాగంగా ఈ సదుపాయం తీసుకొచ్చింది. పెన్షన్‌కు సంబంధించిన వివరాలను సులువుగా పొందే వెసులుబాటును కల్పించామని ఎస్‌బీఐ వెల్లడించింది.

* భారత మీడియా రంగంలో కీలక విలీనం ఒప్పందం దాదాపు ఖరారైంది. ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌)’, ‘సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)’ మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీనికి జీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సంస్థ వెల్లడించింది. విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం వాటాలుంటాయి. ఎస్‌పీఎన్‌ఐకు 52.93 శాతం వాటాలు దక్కుతాయి.

* దేశంలో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.196 పెరిగి రూ.45,746కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,550 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌డం, ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి మార‌కం విలువ మ‌రికొంత బ‌ల‌హీన‌ప‌డటం దేశీయంగా బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరుగ‌డానికి కార‌ణ‌మ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

* వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌ (ఎన్‌ఎస్‌డబ్ల్యూఎస్‌)ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం ప్రారంభించారు. ఈ వేదిక అనుమతుల కోసం ఇన్వెస్టర్లకు ప్రభుత్వ శాఖల కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక్కచోటే అన్ని క్లియరెన్స్‌లు లభించే వెసులుబాటు కల్పిస్తుందని మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.