Politics

“మా”లో కొత్త లొల్లి. తెదేపాకు మాజీమంత్రి రాజీనామా-తాజావార్తలు

“మా”లో కొత్త లొల్లి. తెదేపాకు మాజీమంత్రి రాజీనామా-తాజావార్తలు

* ‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం?’.. అన్న దాశరథి నిలదీత నేటికీ జవాబు దొరకని ప్రశ్నే. ఆహార విధానాలపై ఈ వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సుకు ముందుగా ‘యునిసెఫ్‌’ విడుదల చేసిన తాజా నివేదిక కూడా ఇదే చాటుతోంది. గత దశాబ్దకాలంలో రెండేళ్లలోపు చిన్నారులకు తగినంత పౌష్టికాహారం అందించలేకపోయామని, కొవిడ్‌-19 మహమ్మారి ఈ దుస్థితిని మరింత దిగజారుస్తోందని నివేదిక హెచ్చరించింది.

* పోలీసులను ఉపయోగించుకొని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అనడం సరైంది కాదని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రును హోంమంత్రి సందర్శించారు. తెదేపా, వైకాపా శ్రేణుల ఘర్షణలో గాయపడిన వైకాపా కార్యకర్తలను సుచరిత పరామర్శించారు.

* రేపట్నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్‌ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్‌ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌ సమావేశంలో పాల్గొన్నారు.

* దేవి సీఫుడ్స్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని అందులో కోరింది. దీనిపై ఇవాళ సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది.

* ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఊరటనిచ్చే కబురు చెప్పింది. గత వారం మొత్తం 36 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపు 4 లక్షల కేసులు తగ్గినట్లు వెల్లడించింది. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో 22%, ఆగ్నేయాసియాలో 16% మేర కేసుల తగ్గుదల నమోదైనట్లు చెప్పింది.

* ఏ జంకూ లేకుండా గర్భిణీలు కరోనా టీకా పొందొచ్చని, వారి నుంచి అధిక సంఖ్యలో యాంటీబాడీలు బిడ్డలకు వెళ్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు పొందిన వారిపై ఈ అధ్యయనం సాగినట్లు పరిశోధకులు చెప్పారు. అందుకోసం బొడ్డుతాడు రక్తం (అంబిలికల్ కార్డ్ బ్లడ్‌)లో ఉన్న యాంటీబాడీల స్థాయిలను పరిశీలించారు.

* మహారాష్ట్రలోని ఠాణెలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన జరగింది. బాలికపై 30 మంది కామాంధులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఓ యువకుడు అసభ్యకరంగా బాలిక వీడియోలు తీశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని 30మంది దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసిన ఠాణె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

* పెట్రోల్‌, డీజిల్‌ వంటి చమురు ఉత్పత్తులు వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సుముఖంగా లేవని, అందుకే దేశంలో పెట్రోల్‌ ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి అన్నారు. భవానీపూర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కోల్‌కతా వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

* పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు మ్యాచ్‌లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భద్రతా కారణాలతో కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకొని న్యూజిలాండ్ స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి రికార్డులు బ్రేక్‌ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో సూచీలు దూసుకెళ్లాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు మార్చకపోవచ్చన్న అంచనాలు, చైనా స్థిరాస్తి దిగ్గజం వివరణ ఇవ్వడం మార్కెట్ల దూకుడుకు కారణమైంది. సెన్సెక్స్‌ దాదాపు వెయ్యి పాయింట్ల లాభంతో 60వేల మార్కుకు కొద్ది దూరంలో నిలిచింది. నిఫ్టీ 17,800 పైన ముగిసింది.

* రాష్ట్రంలో మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. విశాఖ, గుంటూరులోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలు ఆపాలని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈమేరకు ఆదేశాలిచ్చింది. మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రభుత్వ భూములు వేలం వేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది. మళ్లీ తాము చెప్పే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

* మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నడూ లేనంతగా మాటల యుద్ధం జరుగుతోంది. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి బండ్ల గణేశ్‌ బయటికి రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విష్ణు ప్యానెల్ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తోన్న పృథ్వీరాజ్‌ ఎన్నికల అధికారికి లేఖ రాయడం తాజాగా వివాదాస్పదమైంది. జీవిత.. ఓటర్లని మభ్యపెడుతున్నారని, తాత్కాలిక సభ్యులను ప్రలోభ పెడుతున్నారని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. విష్ణు ప్యానెల్‌ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పృథ్వీరాజ్‌ లేఖ రాయడంతో ఎన్నికల హీట్‌ మరింత వేడెక్కింది. జీవిత.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26న నిర్వహించనున్న సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. రేపు శాసనసభ సమావేశం, బీఏసీ భేటీ ముగిశాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ బయల్దేరి వెళ్తారు. శనివారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కేసీఆర్ సమావేశమవుతారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ జారీ చేసిన గెజిట్‌, నీటి కేటాయింపులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. అనంతరం ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైన చర్చించనున్నారు. హోంశాఖ సమావేశం అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయెల్‌తో చర్చించనున్నారు. 26న సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

* గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి తన అవసరం లేనందునే రాజీనామా చేస్తున్నట్టు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా.. తన సేవలను వినియోగించుకోవడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు. సీఎం జగన్‌ పేదలకు న్యాయం చేస్తున్నారని, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తన శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని మురుగుడు హనుమంతరావు తెలిపారు.